శంకర్‌పల్లి మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని శంకర్‌పల్లి మండల ప్రజలకు మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రంజాన్ ఉపవాస దీక్ష కేవలం ఆహార నియంత్రణ మాత్రమే కాదు, ఇది ఓ పవిత్ర ఆధ్యాత్మిక సాధన. ఉపవాసం మనలో సహనాన్ని, క్షమాశీలతను పెంపొందించి, ఇతరుల బాధలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. రంజాన్ మాసం దానధర్మాలకు ప్రాధాన్యత ఇచ్చే సమయం. దానానికి దైవానుగ్రహం లభిస్తుందని, పేదలకు సహాయపడటం ద్వారా నిజమైన భక్తి చాటాలని ఇది నేర్పుతుంది” అని పేర్కొన్నారు.
అలాగే, “రంజాన్ మనకు క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, మానవత్వం అనే విలువలను నేర్పించే గొప్ప పర్వదినం. ఈ పవిత్ర మాసంలో ప్రార్థనలు, ఉపవాస దీక్ష, పరస్పర ప్రేమ, సహాయ సహకారాలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకోవాలి. శంకర్‌పల్లి మండల ప్రజలందరూ ఐక్యంగా, ఆనందంగా, పరస్పర సహాయ సహకారాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.