భీమాకొరేగావ్ శౌర్య విజయోత్సవ రోజు శుభాకాంక్షలు

భీమాకొరేగావ్ శౌర్య విజయోత్సవ రోజు శుభాకాంక్షలు
“విదేశీయులై న బ్రిటీష్ సైన్యంలో చేరి దేశాన్ని ఆక్రమించుకోవడానికి సహాయపడ్డ ఈ భారతీయులెవరు? జాగ్రత్తగా చేసిన అధ్యయనం ఆధారంగా నేను చెప్పగలిగిన సమాధానం ఏమిటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరిన ప్రజలు భారత్ లోని మూలభారతీయులు. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవుతో పోరాడిన వాళ్లు దూసాదులు మూలభారతీయులే.భీమా కోరేగావ్ యుద్ధంలో పోరాడిన వాళ్ళు మహార్లు. ఈ మహార్లు మూల భారతీయులే. ఈ విధంగా మొదటి చివరి (1757-1818) యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడి భారతదేశాన్ని వాళ్ళు అక్రమించుకోవడానికి సహాయపడింది. మూలభారతీయులే.” అని డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకు దాచబడిన అసలు చరిత్రను తెలియచేశారు. ఈరోజు భారతీయ చరిత్రలోనే స్ఫూర్తి వంతమైన రోజు. జనవరి 1 నూతన సంవత్సరం జరుపుకుంటున్న బానిసలు, బాధితులకు ఈ చారిత్రక విజయోత్సవం గురించి తెలికపోవడం బాధాకరం. అసలు చరిత్రను తమ మూలాలను తెలుసుకోలేని స్వార్థ పర జీవితాలను గడుపుతున్నారు.ఇదే అత్యంత విచారకరం.1818 వ సంవత్సరం జనవరి 1 వ తేదీన భీమానది ఒడ్డున ఉన్న భీమాకొరేగావ్ ప్రదేశం లో 28000 పీష్వా బ్రాహ్మణులు ఒక పక్షంలో ఉన్నారు. వీరికి వ్యతిరేకంగా బ్రిటిష్ సైనికులు మహర్ ల నాయకత్వంలో 500 మంది మహర్ లతో కలిసి ఉన్నారు.28000 మందికి 500 మందికి భీకర యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు.? మెజారిటీ సైనికులు కదా గెలవాలి.అయితే ఇక్కడ అధర్మం కోసం, మానవజాతిని నిచ్చెన మెట్ల కులవ్యవస్థ గా చీల్చి విభజించి పాలిస్తూ మానవహక్కులను మెజారిటీ ప్రజలైన ఈదేశ మూల భారతీయులకు ( నేటి ఎస్సీ, ఎస్టీ, ఒబిసిలు) నిరాకరిస్తూ పీష్వా బ్రాహ్మణులు మహారాష్ట్రలో పీష్వా బ్రాహ్మణ మనుధర్మశాస్త్రం ప్రకారం ఒక దుర్మార్గపు, దోపిడీ పాలన సాగించారు. అది ఎప్పటికీ ఉండేలా చూడాలని తపించారు.ఈ సమయంలో మొగలలు మనదేశంలోకి వచ్చారు. వారి పాలన కూడా కొనసాగింది.బ్రిటిష్ వారు వచ్చారు. ఎవరు వచ్చిన మనుధర్మశాస్త్రం ప్రకారం పాలన నడిచింది తప్ప మెజారిటీ ప్రజలైన మూలభారతీయుల శ్రేయస్సు కాంక్షించలేదు.పీష్వా రాజ్యం పై బ్రిటీష్ వారు పట్టు కోరారు. పీష్వాలు మూలభారతీయులను అణచివేస్తూ ఉండటం గమనించిన బ్రిటిష్ పాలకులు మహర్ లను తమ సైన్యం లోకి చేర్చుకోవడం జరిగింది. మనుధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణ పీష్వాలు శూద్రులు, అతిశూద్రులను సైన్యం లో చేర్చుకోలేదు. వీళ్ళు ఆయుధాలు ధరించకూడదని, పాలన చేయకూడదు అంటూ శాసనాలు కఠినంగా చేసి అమలు చేసారు. తత్ఫలితంగానే మనదేశంలోకి విదేశీయులు రావడం జరిగింది. మనదేశంలోకి బయటి నుండి వచ్చిన బ్రాహ్మణ మనువాదులు వలనే విదేశీయులు ఇక్కడకు రావడం జరిగింది. మనుధర్మశాస్త్రం వలనే మనదేశంలో విదేశీ ఆక్రమణలు, వలసవాదుల పాలన సాగింది.

మహారాష్ట్రలో వెనుకబడిన జాతిలో శివాజీ బోస్లే మహారాజ్ జన్మించారు. ఇతని కాలం 1630-1680.పీష్వా చిత్ పవన్ బ్రాహ్మణులను ఎదిరించి బీజాపూర్ సుల్తాన్ లను ఓడించారు. రాయ్ ఘడ్ ను రాజధాని గా చేసుకుని స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ నెలకొల్పారు. శివాజీ చక్రవర్తి గా పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణ పురోహితులు ముందుకు రాలేదు. ఎందుకంటే మనుధర్మశాస్త్రం ప్రకారం క్షత్రియులు మాత్రమే పాలకులు కావాలి అనే శాసనం ఉండటం వలన.మనుధర్మశాస్త్రం అనే దానిని బ్రాహ్మణులు తమకు అనుకూలంగా మెజారిటీ ప్రజలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని పీడించి తాము మాత్రమే అభివృద్ధి చెందాలనే ఒక కుట్ర, ఒక దోపిడీ సిద్ధాంతాన్ని బ్రాహ్మణులు ప్రవేశ పెట్టారు. ఈ సిద్ధాంతం వలనే భారతదేశంలో అభివృద్ధి లేదు. శ్రమజీవులు ఎప్పటికీ శ్రమచేస్తూనే ఉంటున్నారు తప్పితే మంచి ఆర్థిక పుష్టిని కలిగి ఉండటం లేదు. శ్రమజీవులు కేవలం శ్రమచేస్తూనే ఉండాలి. బానిసలుగానే ఎప్పటికీ ఉండాలనేది బ్రాహ్మణ భావజాలం. ఈ భావజాలం వలనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావడం లేదు. ఈ భావజాలం వలనే ఈ దేశంలో రాజ్యాంగం కూడా సరిగా అమలుకావడం లేదు. ప్రజ్ఞ అంటే తెలివి ,వివేకం గలవారు బ్రాహ్మణులు. అయితే ప్రజ్ఞ ఉంటే చాలదు. శీలం ఉండాలి, కరుణ, దయ, సేవా గుణం,దాన గుణం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సత్యాన్ని సత్యం గా చెప్పే లక్షణాలు ఉండాలి.ఎదుటి మనిషి శ్రమను దోచుకోరాదు. మనదేశంలో బ్రాహ్మణ మనువాదులకు ఈ గుణాలు, లక్షణాలు లేవు.అందుకే వేల సంవత్సరాలు నుండి కులాన్ని ప్రాక్టీసు చేస్తున్నారు. ఎవడైతే కులాన్ని ఈ దేశంలో ప్రవేశ పెట్టాడో వాడు ఎప్పటికీ నిజాయితీ గలిగి ఈ కులవ్యవస్థ ను పారద్రోలడానికి సిద్ధంగా లేరు.మెజారిటీ ప్రజలు ఈ నిజాన్ని గమనించాలి.బ్రాహ్మణ మనువాదులు ప్రజ్ఞను ఆధిపత్యం, దోపిడీ కు పునాది చేసుకుంటున్నారు.ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680 వ సంవత్సరంలో నిర్యాణం తరువాత తిరిగి పీష్వా చిత్ పవన్ బ్రాహ్మణులు రాజ్యం సంపాదించుకున్నారు.మనుధర్మశాస్త్రం ప్రకారం క్షత్రియులు కదా పాలించాలి.మరి బ్రాహ్మణులు ఎందుకు పాలిస్తున్నారు? మనుధర్మశాస్త్రం లో బ్రాహ్మణ మనువాదులు అవసరం అయితే ,రాజ్యం లో ప్రళయం సంభవించిన సందర్భంలో బ్రాహ్మణులు కూడా కత్తి పట్టి రాజ్యం పాలించవచ్చు అని సవరణ తమకు అనుకూలంగా కూడా చేసేసుకున్నారు.మహారాష్ట్రలో పీష్వా బ్రాహ్మణ పాలకులు మహర్ లను అంటరాని వారిగా చేశారు. శూద్ర పాలకులు ఎవరూ కూడా ఈ అంటరాని తనం నేరం దీనిని రూపుమాపాలని చూడలేదు. మహర్ లు రహస్యం గా యుద్ధ విద్యలు నేర్చుకుని పీష్వా బ్రాహ్మణ మనువాద పాలకులపై పోరాటానికి ప్రయత్నాలు చేశారు. క్రీ.శ.1817 లో మహర్ లు బ్రిటిష్ సైన్యం లో చేరారు.సుమారు 500 మందితో “రెజిమెంట్ ఆఫ్ అన్ టచ్ బుల్ మహర్ సోల్జర్స్” ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ కెప్టెన్ ఎఫ్.ఎఫ్.స్టావున్ టన్ ఈ మహర్ రెజిమెంట్ కు నాయకత్వం వహించారు. పీష్వా రాజు బ్రాహ్మణ మనువాది బాజీరావు పీష్వా 1795-1818 లో 30 వేల మందిని మహర్ లను అణచివేయాలి అని సిద్ధం చేశాడు.మహారాష్ట్ర లోని పూనాలోని “భీమా” నది ఒడ్డున కొరేగావ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ 30 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైనికులు ఈ దేశంలో మనుధర్మశాస్త్రం అమలు చేయడానికి అడ్డువచ్చిన వారిని ఊచకోత కోయాలని చూశారు. ఈ దుర్మార్గాన్ని ఎదురించడానికి మహర్ లు 500 మంది సిద్ధం అయ్యారు. జనవరి 1,1818 న మనదేశంలో 500 మంది మహర్ లు 30 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైనికులపై ఆత్మగౌరవ యుద్ధం చేసి విజయం సాధించారు. ఈ నిజాలను ,చరిత్ర ను ఎక్కడా కూడా చెప్పకుండా దాచుకున్నారు బ్రాహ్మణ మేధావులు. ఈ భీమాకొరేగావ్ లో జరిగిన యుద్ధం లో 2000 మంది మహర్ వీరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఒక పెద్ద స్తూపం కూడా నిర్మించుకున్నారు మహర్ లు.ప్రతి సంవత్సరం జనవరి 1 న భీమాకొరేగావ్ ప్రాంతంలో ఉన్న స్తూపం వద్దకు వెళ్ళి డా.బి.ఆర్. అంబేడ్కర్ నివాళులు అర్పించేవారు.భారతీయ చరిత్రలో పీష్వా బ్రాహ్మణ మనువాదుల దుర్మార్గాలను ఎదిరించిన ఏకైక శూద్ర రాజు ఛత్రపతి శివాజీ. శివాజీ అసలు చరిత్ర ను మహాత్మా జోతిరావు ఫూలే గుర్తించి తెలియజేశారు. జోతిరావు ఫూలే శివాజీ సమాధిని వెలుగులోకి తెచ్చి 1869 లో పవాడా ఛందస్సు లో శివాజీ చరిత్ర ను కావ్యంగా రచించారు.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫూలే చరిత్ర ను ఆయన నడిపిన ఉద్యమాన్ని వెలుగులోకి తెచ్చారు.ఫూలేను ఆదర్శంగా తీసుకుని అంబేడ్కర్ సామాజిక ఉద్యమాన్ని నడిపారు. తన గురువు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ప్రకటించారు కూడా.

శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ చిన్న వయసులోనే వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు అధ్యయనం చేసి ,ఇవన్నీ బ్రాహ్మణ మనువాదులు వ్రాసారని గ్రహించారు. బుద్ధ భూషణం అనే గ్రంథాన్ని రచించారు. బ్రాహ్మణ మనువాదులు యొక్క దుర్మార్గాలను దోపిడీ ను ప్రశ్నించారు.బ్రాహ్మణ మనువాదులు శివాజీ ను హతమార్చారు. అత్యంత క్రూరంగా చంపారు. తల ,మొండెం వేరు చేసారు. ముక్కలు ముక్కలుగా శంభాజీను వేరుచేసి మహారాష్ట్రలో తన శవాన్ని ముక్కలు ముక్కలుగా వెదజల్లారు.గైక్వాడ్ అనే వ్యక్తి తమ శూద్ర రాజును హత్య చేశారని మహర్ లకు తెలియజేశారు.ఆ శవపు ముక్కలు అన్నీ సేకరించి కుట్టి శవాన్ని దహనసంస్కారాలు చేశారు.ఆ విధంగా ఈ దేశంలో మనువాద హత్యలు జరిగాయి. ఈ హత్యలు సమానత్వం ఇవ్వడానికి ఇష్టం లేకనే జరిగాయి.మనుషులు దోచుకోవడానికి, మానవహక్కులను ఇవ్వడానికి ఇష్టం లేకనే జరిగాయి.
“భీమా కోరేగావ్ యుద్ధం తర్వాతనే నాకు చదువుకునే అవకాశం వచ్చింది.నేను చదువుకున్నాక బ్రాహ్మణుల కుట్రలు తెలుసుకున్నాను. చదువు లేమి వల్ల ఇదంతా జరిగింది, అందుకే శూద్ర-అతిశూద్ర జాతుల చదువు కొరకు పాఠశాలల్ని స్థాపించాను. బ్రాహ్మణులను ఓడించిన జాతుల నుండే నా పోరాటం మొదలు పెట్టాను.నా ఉద్యమానికి స్ఫూర్తి భీమాకోరేగావ్ యుద్ధమే.” అని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలిపారు.ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి. శూద్ర ఒబిసిలు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే లను అధ్యయనం చేయాలి. వీరిని స్ఫూర్తి గా తీసుకోవాలి. బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ కూడా మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలేల చరిత్ర ను మనకు అందించారు. తన పోరాటం జోతిరావు ఫూలేను స్ఫూర్తి గా తీసుకుని చేశారు. తన గురువుగా జోతిరావు ఫూలేను చెప్పుకున్నారు.
1757 ప్లాసీ యుద్ధం గురించి చరిత్రలో ఉంది. మరి 1818 యుద్ధం గురించి ఎందుకు చెప్పడం లేదు?

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మనదేశంలోకి వ్యాపారం పేరుతో వలసొచ్చి తమ పాలన కొనసాగించాలని అనుకున్నారు.1757 లో ప్లాసీ యుద్ధం తో రాజకీయ అధికారాన్ని దేశమంతటా విస్తరించాలని చూశారు.ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో పూణేలో ఉన్న విదేశీ వలసపాలకులు అయిన బ్రాహ్మణ పీష్వాలు తమ పాలనను ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేయాలని చూశారు.రాజ్య విస్తరణ కోసం ఇటు విదేశీ బ్రిటిష్ పాలకులకు-అటు విదేశీ బ్రాహ్మణ పీష్వా పాలకులకు మధ్య తీవ్రంగా వైరం తలెత్తింది.ఈ యుద్ధం లో బ్రిటిష్ సైనికులు, పాలకులు పీష్వా బ్రాహ్మణ సైనికులను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.బ్రిటిష్ వారు తరపున పోరాడిన మహర్ లు పీష్వా బ్రాహ్మణులను ఎదుర్కొన్నారు. మీరు అలా చూస్తూ ఉండండి అంటూ మహర్ ల రెజిమెంట్ నాయకుడు సిద్ధినాగ్ నాయకత్వం లో వీరోచితంగా పోరాటం సాగించారు. యుద్ధంలో మహర్ రెజిమెంట్ గెలిచింది.ఈ వీరోచిత యుద్ధానికి చిహ్నంగా బ్రిటిష్ వారు భీమానది ఒడ్డున కోరెగావ్ ప్రాంతంలో 60 అడుగులు గల విజయ స్థూపాన్ని నిర్మించారు.
డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ వారు అంటరాని వారికి కృతఘ్నలు అని చాలాసార్లు చెప్పారు. 1946 లో బ్రిటీష్ వారు తమ పరివాలన భారతదేశంలో కొనసాగడానికి యుద్ధంలో గెలిపించిన వారికే ఓటు హక్కు లేకుండా చేశారని చెప్పారు. బ్రిటీష్ వారు అంటరానివారిని ఉపయోగించుకొని ఇండియాలో పాలన సాగించారు. చివరకు అంటరాని వారికి తీవ్ర అన్యాయం చేశారు.సైనిక మరియు పరిపాలనలో బ్రిటిష్ వారు ఇతర కులాలను ప్రోత్సహించారు. అంటరాని వారిని పక్కన పెట్టారు అని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటీష్ వారి యొక్క ద్వంద్వ వైఖరిని ఖండించారు. అలాగే అంటరానివారిపై ఇతర కులాలను ప్రోత్సహించడం చాలా డా.అంబేడ్కర్ కు బ్రిటీష్ వారిపై చికాకు కలిగించింది.మొదటి యుద్ధం (ప్లాసీ), చివరి యుద్ధం (భీమా కోరేగావ్)లో అంటరానివారు బ్రిటిష్ వారితో కలిసి పీష్వా బ్రాహ్మణ రాజ్యంపై పక్కపక్కనే పోరాడారు. 1818 వ సంవత్సరం జనవరి 1 వ తేదీన, మహర్‌లు తమ వీరోచిత పోరాటం,చర్యల ద్వారా పీష్వాల పాలనలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు. భీమా కోరేగావ్‌లోని స్థూపంపై మహర్లు మరియు కొంతమంది OBCల పేర్లు వ్రాయబడ్డాయి. భీమా కోరేగావ్‌లోని స్మారక స్తంభంలో మహర్‌లందరినీ నక్స్ (నాగా) అని పిలుస్తారు. డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ మన పూర్వీకులను కూడా నాగులు అని పిలిచేవారు. అతని తాతని మల్నాక్ (మలనాగ) అని పిలుస్తారు. అతని తండ్రిని రామ్నాక్ (రమణగా) అని పిలుస్తారు. బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ కూడా అదే విధంగా భీమానక్ (భీమనగా) అవుతాడు. భీమా కోరేగావ్ యుద్ధంలో గొప్ప వీరుడు సిద్ధనాగ.
మీరు శూరులు ,వీరుల సంతానం అనేది కాల్పనికం కాదు. భీమా కోరేగావ్ వెళ్లి చూడండి మీ పూర్వీకుల పేర్లు అక్కడి విజయ స్తంభం మీద చెక్కబడి ఉన్నాయి. మీరు గొర్రెల సంతానం కాక సింహాల సంతానమనే దానికి నిదర్శనం.” అని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్
(25.12.1927 డిసెంబర్ 25వ తేదీన జరిగిన మహాడ్ ఉపన్యాసంలో అన్నారు.
నాగాలు ఆధునిక కాలంలో ఒక పురాణం కాదు, నాగులుగా పిలువబడే ప్రజల సజీవ సమాజం. భారతదేశ చరిత్రను వెలికితీసినప్పుడు, నాగాలు ఒకప్పుడు భారతదేశాన్ని పాలించిన గొప్ప జాతి అని కనుగొనబడింది. తన జీవిత చరమాంకంలో, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ నాగపూర్ లోని దీక్షాభూమి వద్ద బౌద్ధ ధమ్మం స్వీకరించిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆర్యులు మరియు నాగుల మధ్య సంఘర్షణ గురించి మాట్లాడారు.బ్రాహ్మణులు భారతదేశాన్ని ఆర్యవ్రత్ అని పిలిచేవారు కాని నాగులకు భారతదేశం జంబూద్వీపం. సామ్రాట్ అశోకుడు స్వయంగా తన రాజ్యాన్ని జంబూద్వీపంగా చెప్పుకున్నాడు. నాగుల భయం బ్రాహ్మణుల మనస్సులో ఎంతగా నాటుకుపోయిందంటే, బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ మహానాగ భగవాన్ బుద్ధుని అడుగుజాడల్లో నడిచి బుద్ధుణ్ణి అనుసరించినప్పుడు, అది నాగ రాజ్యాన్ని (నాగాల రాజ్యం) ప్రారంభిస్తుందని సావర్కర్ వ్యాఖ్యానించారు. నాగులు భగవాన్ బుద్ధుని బోధనలను సమర్థించిన సృజనాత్మక వ్యక్తులు అని చరిత్ర రుజువు చేస్తుంది. నాగులు భారతదేశం అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు మరియు ఇప్పుడు భారత ఉపఖండం అంతటా విభజించబడ్డారు. కానీ చరిత్రను బట్టి చూస్తే, వారు తమ స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం విలువలను రక్షించుకోవడానికి మాత్రమే పోరాటం సాగించారు.

— అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B