గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే..

గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే..
అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటి (పీఏసీ) చైర్మన్ గా ఎంపికైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే గాంధీ కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ గాంధీ విషయంలో బీఆర్ఎస్ నేతలు లేనిపోని హంగామాలు సృష్టిచండం కేవలం చచ్చిన పార్టీని బతికించుకోవడం కోసమే అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌసిక్ రెడ్డి కనీసం సర్పంచ్ పదవికి కూడా సరిపోడని అన్నారు. బీఆర్ఎస్ నేతలు గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఉద్ధేశపూర్వకంగా ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రా ఓటర్ల మద్దతు లేకపోతే బీఆర్ఎస్ కు అన్ని సీట్లు వచ్చేవా అని అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు ఎంత రెచ్చగొట్టినా కాంగ్రెస్ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. అయితే సీఎంపైన గానీ, ఇతర నేతలపైన గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నేతల భరతం పట్టాలని, వాళ్లను రోడ్లపై తిరుగకుండా చేయాలని కోమటిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.