చెస్ ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు దివ్య

ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు
జ్ఞానతెలంగాణ,స్పోర్ట్స్ :
భారత చిచ్చర పిడుగు దివ్యా దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. మహిళల చెస్ వరల్డ్ కప్‌లో 19 ఏళ్ల దివ్య ఫైనల్లో అడుగుపెట్టింది. తద్వారా ఈ మెగా టోర్నమెంట్ టైటిల్ ఫైట్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. చైనా జీఎం, ప్రపంచ మాజీ చాంపియన్ టోన్ జోంగ్యితో బుధవారం జరిగిన సెమీఫైనల్ రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన దివ్య విజయం సాధించింది. దాంతో 1.5-0.5 పాయింట్ల తేడాతో ఆమె టైటిల్ ఫైట్‌లో ప్రవేశించింది. సెమీస్ తొలి గేమ్‌ను దివ్య డ్రా చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ ఫైనల్ ప్రవేశం దరిమిలా..2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి దివ్య క్వాలిఫై అయ్యింది.ప్రస్తుత ప్రపంచ చాంపియన్ ఝు జినెర్‌తో తలపడే చాలెంజర్‌ను క్యాండిడేట్స్ టోర్నమెంట్ ద్వారా నిర్ధారిస్తారు. అంతేకాదు..సెమీఫైనల్ గెలుపుతో దివ్య తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం) నార్మ్నూ సొంతం చేసుకుంది. మరో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సెమీఫైనల్ ఫలితం టైబ్రేకర్‌లో తేలనుంది. చైనా గ్రాండ్ మాస్టర్ లి టింగ్జీతో సెమీఫైనల్ రెండో గేమ్‌ను హంపి డ్రా చేసుకుంది. హంపి-టింగ్జీ మొదటి గేమ్‌లో కూడా ఫలితం తేలని విషయం తెలిసిందే. ఫలితంగా రెండు క్లాసికల్ గేమ్‌ల అనంతరం హంపి, టింగ్జీ చెరో పాయింట్‌తో సమంగా నిలిచారు. దాంతో గురువారం జరిగే టైబ్రేకర్‌లో హంపి-లి టింగ్జీ అమీతుమీ తేల్చుకోనున్నారు.