భద్రతా పేరుతో భయానకం మోకిలాలో మృత్యు బ్రేకర్లు

అనధికార స్పీడ్ బ్రేకర్ల తో – ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని మోకిలా గ్రామంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో అనధికారంగా నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రస్తుతం వాహనదారులకు మరియు స్థానికులకు తీవ్ర సమస్యగా మారాయి. సంబంధిత శాఖల అనుమతి లేకుండా, ఎటువంటి హెచ్చరికా బోర్డులు లేకుండా ఏర్పాటు చేయబడిన ఈ బ్రేకర్లు, పట్టపగలు సైతం గమనించలేనంత ప్రమాదకరంగా మారాయి. రిఫ్లెక్టర్ల లేమి వల్ల వాహనదారులు ఆకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి రోడ్డుపై ప్రయాణిస్తున్నవారికి ప్రమాదాలను పెంచుతోందని, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “స్పీడ్ బ్రేకర్లు భద్రత కోసమే, కానీ అవే ప్రమాదంగా మారితే బాధ్యత ఎవరిది?” అని నిలదీస్తున్నారు. ఇటువంటి నిర్మాణాల వల్ల కొన్ని ప్రమాదాలు ఇప్పటికే జరిగాయి. భద్రతకు మించిన మరో అవసరం ఏముంటుంది? అనే ప్రశ్న నిశ్శబ్దంగా ప్రతిధ్వనిస్తుంది.

భారత రహదారి నిబంధనల ప్రకారం, స్పీడ్ బ్రేకర్లు అధికారుల అనుమతితో, రెండు వైపులా హెచ్చరికా బోర్డులు, రిఫ్లెక్టివ్ పెయింట్‌తో కూడిన స్పష్టమైన గుర్తింపులతో మాత్రమే నిర్మించాలి. కానీ మోకిలాలో ఈ నిబంధనలకు ఎలాంటి విలువ లేకుండా నిర్మాణాలు జరగడం క్షమించరానిది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు – ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం.

ఈ స్పీడ్ బ్రేకర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే నియమాలకు అనుగుణంగా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ కొత్త స్పీడ్ బ్రేకర్లను నిర్మించాలి. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై వెంటనే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కాదు – ప్రమాదం జరగకముందే నివారించాల్సిన బాధ్యత మనందరిదీ. ప్రజల ప్రాణాలు చిన్న విషయమేం కావు. అలాంటి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నప్పుడు మౌనంగా ఉండటం మన బాధ్యత కాదనే విషయం గుర్తించి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు గ్రామ ప్రజలు కోరుతున్నారు.

You may also like...

Translate »