కలెక్టర్ వి.పి గౌతమ్ చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం

కలెక్టర్ వి.పి గౌతమ్ చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం
జ్ఞాన తెలంగాణ మే 21, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రత్యేక చొరవతో కాలనీ త్రాగునీటి సమస్య తీరింది. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సాయి గణేష్ నగర్ లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. కాలనీ వాసులు అభివృద్ధి కమిటీ ఏర్పాటుచేసుకొని, త్రాగునీటి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ని కలిసి త్రాగునీటి సరఫరాకై విన్నవించుకొన్నారు. సమస్య విన్న కలెక్టర్ పరిష్కారానికి చర్యలకై అధికారులకు ఆదేశాలిచ్చి, తీసుకుంటున్న చర్యల గురించి పర్యవేక్షణ చేశారు. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సాయి గణేష్ నగర్ లో 22 వీధులు ఉండగా, ఇందులో 17 వీధులను 270 గృహాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాతో కవర్ చేయడం జరిగింది. 2 వాటర్ ట్యాoకర్లను ప్రత్యేకంగా శ్రీ సాయి గణేష్ నగర్ ప్రాంత వాసుల నీటి సరఫరాకై ఏర్పాటుచేసి, నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మిగతా 5 వీధుల్లో 70 గృహాలకు మేజర్ పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి. అంతర్గత పైప్ లైన్ పనులు చివరి దశకు చేరాయి. 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేయడం జరిగింది. ఒక క్రొత్త బోర్ మంజూరు చేసి, వేయడం జరిగింది. మిషన్ భగీరథ కు ప్రత్యామ్నాయంగా 15 లక్షల రూపాయలతో నీటి సరఫరాకై పనులు మంజూరు చేయబడ్డాయి. త్రాగునీటి శాశ్వత పరిష్కారానికి 2 లక్షల లీటర్ల క్రొత్త వాటర్ ట్యాoక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం డైరెక్ట్ పంపింగ్ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం దిశగా వేగంగా పనులు జరుగుతున్నాయి.
మంగళవారం శ్రీ సాయి గణేష్ నగర్ అభివృద్ధి కమిటీ నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ వి.పి. గౌతమ్ ని కలిసి, త్రాగునీటి ఇబ్బందులు పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.