చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాటలు… నీటి మూటలు!

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మాటలు… నీటి మూటలు!
- వర్షం పడితే ప్రయాణికుల దుస్థితి, అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం
- హామీలు గాలిలో కలిసిపోయాయి, ప్రజలు మాత్రం ఇబ్బందుల్లో మునిగిపోతున్నారు
- “శంకర్పల్లి ఫతేపూర్ బ్రిడ్జి వద్ద ప్రయాణికులకు తీవ్ర అవస్థలు
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లిశంకర్పల్లి, ప్రతినిధి: 1మండలంలోని పత్తేపూర్ బ్రిడ్జి ప్రజలకు శాపంగా మారింది. రాత్రి కురిసిన వర్షాలకు బ్రిడ్జి కింద భారీగా నీరు చేరింది. మోకాళ్ల లోతు వరకూ నీళ్లు నిలిచి, వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. ప్రతిసారి ఇదే పరిస్థితి, కానీ పరిష్కారం మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు.
ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, నీటి పారుదల మార్గం లేకుండానే రోడ్డు వేసిన అధికారుల నిర్లక్ష్యపు తీరుతో సమస్య మరింత తీవ్రతరమైంది. వర్షం పడిన ప్రతిసారి ఇదే దుస్థితి ఎదురవుతుంటే, పాలకులు మాత్రం మౌనం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతంలో ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల కష్టాలను తీరుస్తానని మాటలు చెప్పిన వారు, వర్షం వచ్చిన ప్రతిసారి మౌనంగా ఉండిపోతున్నారు. హామీలకంటే పనులు ముఖ్యమని, నీటి మూటలుగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
