కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలి : వేముల మహేందర్ గౌడ్

జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్14:

రాష్ట్రంలో వెంటనే కులగణన కోసం చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసినందున జీవో నెంబర్ 26 ప్రకారం సమగ్ర కులగణన కోసం ప్రత్యేక కమిషన్ ను నియమించి ఇంటింటి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర క్యాబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కులగణనను మొదలు పెట్టడానికి జీవో నెంబర్ 26ను తీసుకొచ్చి, కులగణన నిర్వహణకు 150 కోట్ల బడ్జెట్ ను కూడా విడుదల చేసిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం బీసీ కులగణనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నందుకు మహేందర్ గౌడ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో సమగ్ర సామాజిక, ఆర్థిక కులగణన నిర్వహించడానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, కమిషన్ ద్వారా రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించి కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని కోరారు. కులగణన నిర్వహించి బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే గ్రామపంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదే డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేయడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బీసీలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు.

You may also like...

Translate »