చెల్లిని హత్య చేసి సంచిలో కుక్కిన అన్న

  • గోధుమల బస్తా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం

జ్ఞాన తెలంగాణ, న్యూస్ డెస్క్ :

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లా ఓ పాశవిక హత్యకు వేదికైంది. పరిహారం డబ్బు కోసం అన్న చెల్లిని హత్య చేసి సంచిలో కుక్కిన ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు ఆపినపుడు అతడు ఆ సంచిని “గోధుమల బస్తా” అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన దృశ్యం అందరినీ షాక్‌కు గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే — గోరఖ్‌పూర్‌కు చెందిన చింకు నిషాద్ అనే వ్యక్తికి రోడ్డు ప్రాజెక్టు కింద ప్రభుత్వం నుంచి రూ.6 లక్షల పరిహారం అందింది. ఆ డబ్బును తన కుమార్తె నీలం (19) వివాహానికి వినియోగించాలని తండ్రి నిర్ణయించాడు. అయితే కుమారుడు రామ్ ఆశిష్ (32) ఆ డబ్బులో తనకు వాటా ఇవ్వలేదనే ఆగ్రహంతో చెల్లిపై కోపం పెంచుకున్నాడు.

అక్టోబర్ 27న రామ్ ఆశిష్ ఆగ్రహంతో చెల్లిని గొంతునొక్కి హత్య చేశాడు. ఆమె కాళ్లు విరిచాడు. అనంతరం మృతదేహాన్ని ఒక పెద్ద సంచిలో కుక్కి, బైక్ వెనుక కట్టి కుషినగర్ వైపు పడేయడానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పోలీసులు బైక్ ఆపి విచారణ చేయగా, సంచిలో ఏమున్నదని అడిగినప్పుడు “గోధుమలు ఉన్నాయి” అని చెప్పి తప్పించుకున్నాడు.

తర్వాత కుషినగర్‌లోని చెరకు తోటలో సంచిని పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే సమయంలో నీలం ఇంటికి రాలేదని గమనించిన తండ్రి చింకు ఆందోళన చెందాడు. గ్రామస్తుల నుంచి కుమారుడు రామ్ బైక్‌పై పెద్ద సంచి తీసుకెళ్లినట్టు తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు రామ్ ఆశిష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, పరిహారం డబ్బులో వాటా ఇవ్వలేదనే కోపంతో చెల్లిని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ దారుణ సంఘటనతో గోరఖ్‌పూర్ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసమే తమ్ముడు ఇంత పాశవికంగా ప్రవర్తించడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like...

Translate »