పేదింటి కుటుంబంలో పుట్టి..కళాకారునిగా రాణిస్తూ..!

పేదింటి కుటుంబంలో పుట్టి..కళాకారునిగా రాణిస్తూ..!

  • ఇప్పలపల్లి గ్రామానికే వన్నె తెస్తున్న శ్రీపతి రామ్ గౌడ్
  • 300 పాటలతో రచయితగా..ఎన్నో అవార్డులు
  • శ్రీపతి రామ్ గౌడ్ ను అభినందిస్తున్న గ్రామస్తులు

జ్ఞాన తెలంగాణ, మొగుళ్లపల్లి (డిసెంబర్ 29): పేదింటి కుటుంబంలో పుట్టిన ఈ ఆణిముత్యం..కళాకారునిగా రాణిస్తూ..ఇప్పలపల్లి గ్రామానికే వన్నె తెస్తున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి లక్ష్మీ కోమల- చంద్రమౌళి గౌడ్ దంపతులకు జన్మించిన శ్రీపతి రామ్ గౌడ్ 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ..సమాజంపై ఉన్న అవగాహనతో పాటల రచయితగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. సామాజిక ఉద్యమ కవిగా..అక్షరాన్నే ఆయుధంగా మలుచుకుని..దోపిడి, అవినీతి వ్యవస్థపై తిరుగుబాటు చేసే సాహిత్యంతో తెలంగాణ ఉద్యమానికి ఎన్నో గేయాలను అందించాడు. సమాజం పట్ల చైతన్య గేయాలను వ్రాసి ప్రజలను చైతన్య పర్చడంలో ముఖ్య భూమికను పోషిస్తున్నాడు. రాజకీయ నాయకులకు పాటలు వ్రాసి వారి గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరించాడు. 300 పాటలు వ్రాసి ఎన్నో అవార్డులను అందుకున్నాడు. తన పాటల ప్రభంజనంతో ఇప్పలపల్లి గ్రామానికే వన్నె తెస్తుండడంతో..గ్రామస్తులు శ్రీపతి రామ్ గౌడ్ ను అభినందిస్తున్నారు. తన పాటలతో పుట్టిన ఊరికి..కన్న తల్లిదండ్రులకు..విద్య నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతులు తెస్తున్న ఈ కోహినూర్ వజ్రం శ్రీపతి రామ్ గౌడ్ ఎన్నో విప్లవ పాటలను రచించాడు. కడు పేదరికంలో కుటుంబాన్ని పోషిస్తూ..ఏనాడు అక్షరాన్ని తాకట్టు పెట్టకుండా జనం కోసమే బ్రతుకుతున్నాడు. కీర్తించే మాటలు..కొట్టే చప్పట్లే తనకు ఆస్తులని పాటలతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయనకు చాలా గుర్తింపు తెచ్చిన పాటలు వీరుల గన్న తల్లి రా..వెలిశాల నా పల్లె రా, ఉద్యమాల పోరుబాటలో ఒదిగి..మండలమై పేరొందినవమ్మ మొగుళ్లపల్లి, కొత్తగా వెలుగొచ్చెను భూపాలపల్లికి, సలాం..నీకు లాల్ సలాం గాదర్ల సారన్న, ఎన్నాళ్లు ఈ ఆంధ్ర వలస పాలన, అమ్మ రుణం, మణిపూర్ మతవిద్వేశం, మల్లూరు భక్తి గీతాల్లాంటి పాటలు ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇలాంటి పాటలను మరెన్నో సమాజానికి అందించారు. రానున్న రోజుల్లో మరెన్నో పాటలను ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పాత్రికేయులతో తెలిపారు. అదేవిధంగా సినిమా రంగం వైపు కూడా తాను అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. తన కెరీర్ లో తనకు ఇష్టమైన పాటల రచయితలు చంద్రబోస్, మిట్టపల్లి సురేందర్, బండి సత్యం, దాసారపు నరేష్, గాయకులు రేలా కుమార్, జూపాక శివ, పుల్యాల నరేష్, శంకర్ బాబు, వడ్లకొండ అనిల్, సంగీత దర్శకుడు హన్మకొండకు చెందిన కిట్టు, అలాగే తనకు ప్రోత్సాహాన్ని అందించేది మాత్రం పెండెం రాజు, యూట్యూబర్ దూడపాక చలపతి, చిలువేరు మల్లయ్య, దూడపాక శ్రీకృష్ణ, డప్పు సత్తి, దూడపాక రాజేశం మరియు గ్రామస్తులు, తోటి కళాకారులని శ్రీపతి రామ్ గౌడ్ అంటున్నారు.

You may also like...

Translate »