కాంగ్రెస్ అభ్యర్థులకు భీమ్ భరత్ మద్దతు

- నవాబ్‌పేట్ మండలంలో విస్తృత పర్యటన
- ఉంగరం–కత్తెర గుర్తులకు ఓటు వేయాలని పిలుపు
- బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విమర్శలు
- కాంగ్రెస్ సంక్షేమ పథకాల ప్రస్తావన
- గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి
జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్ ప్రతినిధి :
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పామేన భీమ్ భరత్ నవాబ్‌పేట్ మండలంలోని యావపూర్, ఎత్బారపల్లి, మమ్మదాన్‌పల్లి, నవాబ్‌పేట్ మండల కేంద్రం, ఎల్లకొండ గ్రామాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశమై, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. మంగలి శివ నీలలక్ష్మణ్ (ఉంగరం), మీనేపల్లి శివప్రసాద్ (కత్తెర), ఎన్కేపల్లి మల్లేష్ (ఉంగరం), గాజులగూడెం నరసింహరెడ్డి (ఉంగరం), కావాలి కొండయ్య యాదవ్ (ఉంగరం) గుర్తులకు ఓటు వేయాలని కోరారు.
సమావేశాల్లో మాట్లాడుతూ భీమ్ భరత్, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల విషయంలో గ్రామాలకు కనీస ప్రయోజనం అందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వేగవంతమై, లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లులు పారదర్శకంగా జమ అవుతున్నాయని తెలిపారు. రాబోయే ఏప్రిల్‌లో రెండో విడత ఇండ్ల మంజూరు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని వివరించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ ద్వారా సన్నబియ్యం అందించడం ప్రజాహిత పరిపాలనకు ప్రతీక అని అన్నారు.
చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను నిరంతరం శ్రమిస్తున్నానని, గ్రామస్థులు కూడా ఈ అభివృద్ధి యాత్రలో భాగస్వాములు కావాలని కోరుతూ, కాంగ్రెస్ అభ్యర్థులను విశాల మెజార్టీతో గెలిపించాలని భీమ్ భరత్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల, గ్రామస్థాయి నాయకులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.









