భారత్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్ కీలుబొమ్మ..

– మాపై దాడి చేస్తే 50 రెట్లు తీవ్రంగా స్పందిస్తాం: పాక్ రక్షణ మంత్రి

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. తమ దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు కాబూల్ ప్రభుత్వం ఢిల్లీ చేతిలో ఒక సాధనంగా మారిందని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇస్లామాబాద్‌పై దాడికి ప్రయత్నిస్తే ఊహించని పరిణామాలు ఉంటాయని, 50 రెట్లు బలంగా బదులిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇస్తాంబుల్‌లో పాక్-ఆఫ్ఘన్ మధ్య జరిగిన శాంతి చర్చలు నాటకీయంగా విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జియో న్యూస్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. “మేము ఒక ఒప్పందానికి దగ్గరైన ప్రతీసారి, ఆఫ్ఘన్ ప్రతినిధులు కాబూల్‌తో మాట్లాడిన తర్వాత వెనక్కి తగ్గారు. చర్చలను ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చారు. తెర వెనుక ఢిల్లీ ఉండి ఈ తతంగాన్ని నడిపిస్తోంది” అని ఆసిఫ్ ఆరోపించారు.
ఆఫ్ఘన్ నాయకత్వం మాత్రం ఢిల్లీ చేతిలో కీలుబొమ్మలా మారిందని ఆయన విమర్శించారు. “కాబూల్‌లో కూర్చుని ఈ నాటకాన్ని ఆడిస్తున్న సూత్రధారులు ఢిల్లీలో ఉన్నారు. పశ్చిమ సరిహద్దులో ఎదురైన ఓటమికి ప్రతీకారంగా, ఆఫ్ఘనిస్థాన్‌ను అడ్డం పెట్టుకుని పాకిస్థాన్‌తో తక్కువ తీవ్రతతో కూడిన యుద్ధం చేయాలని భారత్ కోరుకుంటోంది” అని ఆసిఫ్ పేర్కొన్నారు.
తమపై దాడి చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆసిఫ్ హెచ్చరించారు. “ఆఫ్ఘనిస్థాన్ ఇస్లామాబాద్ వైపు కన్నెత్తి చూసినా, వారి కళ్లు పీకేస్తాం. ఇప్పటికే వారు ఉగ్రవాదులను వాడుకుంటున్నారు. పాక్‌లో జరుగుతున్న ఉగ్రవాదానికి కాబూలే బాధ్యత వహించాలి. ఒకవేళ వారు మాపై దాడికి తెగబడితే, 50 రెట్లు శక్తిమంతమైన సమాధానం ఇస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.అయితే, పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను అఫ్ఘనిస్థాన్ గతంలోనే నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. తాము స్వతంత్ర దేశంగా భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నామని ఆఫ్ఘన్ రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ స్పష్టం చేశారు. ఇస్తాంబుల్ చర్చలు విఫలమవడానికి అమెరికా డ్రోన్ల వినియోగానికి తమ భూభాగాన్ని వాడుకునేందుకు పాకిస్థాన్ అనుమతించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేమని పాక్ చెప్పడంతో ఆఫ్ఘన్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

You may also like...

Translate »