80 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో కనీస వేతనాలు కరువు .

80 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో కనీస వేతనాలు కరువు .
—సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ .
జ్ఞాన తెలంగాణ- బోధన్
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ కార్మికులకు కనీస వేతనం అందడం లేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ అన్నారు. మేడే సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన పలు వివరాలు వెల్లడించారు .ఈ దేశంలోని కార్మికుల శ్రమ ద్వారా దేశ సంపద సృష్టించబడుతుందని, కార్పొరేట్ల వల్ల కాదనీ అన్నారు. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, మౌలిక వసతులు కోసం ఇంకా కార్మికులు పోరాటాలు చేయవలసి రావడం ఈ దేశ దౌర్భాగ్యం అని అన్నారు. ప్రజలను పాలించే నాయకులు దేశ సంపదను కొల్లగొడుతున్నారు తప్ప చిత్తశుద్ధితో తమను ఎన్నుకున్న ప్రజల కోసం సంపదకు కేంద్రమైన కార్మిక వర్గం కోసం , రైతుల కోసం కృషి చేయడం లేదన్నారు. వీరి పాలనలో పెట్టుబడిదారులు వేల కోట్లకు పడగలెత్తుతుంటే కార్మికుడు మాత్రం చితికిన బతుకుతో జీవితాన్ని గడుపుతున్నాడని పేర్కోన్నారు. ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్యం ఏర్పడినప్పుడే ఈ దేశ ప్రజలు సుసంపన్నమైన జీవితాలను గడుపుతారని అన్నారు. నరేంద్ర మోడీ పాలనలో కార్మిక చట్టాలు కార్పొరేట్ల కనుకూలంగా మార్చబడ్డాయని అన్నారు. ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతనాలు లేవని, కులమత వైశాల్యాలు పెరిగాయని, దేశ సంపద కొల్లగొట్టబడిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు.