KVS–NVS సంయుక్త భారీ నోటిఫికేషన్ – 14,967 పోస్టుల భర్తీ

- ఉపాధ్యాయ–నాన్‌టీచింగ్ పోస్టులకు అవకాశాలు
- ఆన్‌లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 4 చివరి తేదీ
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి యువతలో ఉత్సాహం
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :
కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) దేశవ్యాప్తంగా వేలాది ఖాళీలను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 14,967 ఉద్యోగాలు ప్రకటించడం ద్వారా విద్యారంగంలో అత్యంత భారీ నియామకాలకు మార్గం సుగమమైంది. ఈ రెండు జాతీయ విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా అత్యుత్తమ విద్యను అందించేవి మాత్రమే కాకుండా, ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి కేంద్ర ప్రభుత్వ వేతన నిర్మాణం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ అవకాశాలు, జాతీయస్థాయి నియామకాల వంటి అనేక ప్రయోజనాలు కల్పించే సంస్థలు కావడంతో, ఈ నోటిఫికేషన్ యువతలో విశేష స్పందనను రేకెత్తిస్తోంది.
ఈ నియామకాల్లో PRT, TGT, PGT ఉపాధ్యాయులు, స్టాఫ్ నర్స్, లైబ్రేరియన్, లాబ్ అసిస్టెంట్, క్లర్క్, సూపరింటెండెంట్, కౌన్సిలర్, అకౌంటెంట్ తదితర బోధన మరియు బోధనేతర విభాగాల ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టుల అర్హతలు స్పష్టంగా నిర్ణయించబడాయి. బోధన పోస్టులకు డిగ్రీ, పీజీ మరియు B.Ed అర్హతలు తప్పనిసరి. ఇతర పోస్టులకు SSC, ఇంటర్, డిగ్రీ ఆధారంగా అర్హతలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో SSC మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ–పీజీ సర్టిఫికెట్లు, B.Ed మెమో (ఉపాధ్యాయ పోస్టులకు), ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడీ వంటి పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
కేంద్రీయ మరియు నవోదయ విద్యాలయాల ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా, జాతీయస్థాయిలో నిర్వహించబడుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్, డెమో, ఇంటర్వ్యూ—ఈ మూడు లేదా నాలుగు దశలలో అభ్యర్థుల ప్రతిభను పరీక్షించి చివరకు ఎంపిక చేస్తారు. అభ్యర్థుల సామర్థ్యం, పాఠశాల నిర్వహణ నైపుణ్యం, బోధనలో నైపుణ్యం, విద్యార్థులతో వ్యవహరించే తీరు వంటి అంశాలపై పూర్తి స్థాయి పరీక్ష జరుగుతుంది.
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుల చివరి తేదీ డిసెంబర్ 4, 2025. ఈ సమయపరిమితిలో దరఖాస్తులు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కేవలం దేశవ్యాప్తంగా దాదాపు 15 వేల ఖాళీలు ప్రకటించడం మాత్రమే కాకుండా, ఇది కేంద్ర ప్రభుత్వ కింద పనిచేసే అత్యంత ప్రతిష్టాత్మక నియామకాలలో ఒకటిగా భావిస్తున్నారు.
