గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ,ఉద్యోగావకాశం

గ్రామీణ యువతకు ఉచిత శిక్షణతో ఉద్యోగావకాశం
- హాస్టల్, భోజన వసతి సదుపాయాలతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు
- డీడీయూజీకేవై (DDUGKY) కింద 2025 సెప్టెంబర్ 1 వరకు అడ్మిషన్లు
జ్ఞాన తెలంగాణ,యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (జలాల్పూర్, పోచంపల్లి మండలం) గ్రామీణ నిరుద్యోగ యువతీ–యువకుల కోసం ఉచిత శిక్షణా కార్యక్రమాలను ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద అభ్యర్థులకు శిక్షణతో పాటు హాస్టల్, భోజన వసతి, ఉద్యోగ అవకాశాలు కల్పించబడనున్నాయి. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) క్రింద ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
శిక్షణా కోర్సులలో ఎకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ), కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్–2 వీలర్ సర్వీసింగ్, సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మరియు సర్వీసింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల వ్యవధి సుమారు మూడున్నర నెలలు. బి.కామ్ పాస్ అయిన వారు ఎకౌంట్స్ అసిస్టెంట్ కోర్సుకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్సుకు, పదవ తరగతి పాస్ అయిన వారు ఆటోమొబైల్ మరియు సోలార్ సిస్టమ్ కోర్సులకు అర్హులు. ఐటిఐ చేసిన వారికి సోలార్ సిస్టమ్ కోర్సులో ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. వారు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతానికి చెందినవారై ఉండాలి. చదువు మధ్యలో వదిలిన వారు ఈ అవకాశానికి అర్హులు కారు. దరఖాస్తు చేసుకునే వారు తమ విద్యా అర్హతల అసలు సర్టిఫికెట్లు, రెండు సెట్ జిరాక్స్, పాస్‌పోర్ట్ ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు సమర్పించాలి.
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ జలాల్పూర్ గ్రామంలో ఉంది. హైదరాబాద్ దిల్సుఖ్‌నగర్ నుండి 524 నంబర్ బస్సు ద్వారా రాకపోకలు సులభంగా ఉంటాయి. సమీప రైల్వే స్టేషన్లు బీబీనగర్, భువనగిరి, సికింద్రాబాద్. అడ్మిషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 1, 2025 (సోమవారం)గా నిర్ణయించబడింది.
వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111 నంబర్లను సంప్రదించాలని సంస్థ చైర్మన్ డా. ఎన్. కిశోర్ రెడ్డి తెలిపారు.