సమాజ స్వచ్ఛతకు స్వరూపం – సంత్ గాడ్గే బాబా

బహుజన చైతన్యానికి శాశ్వత దీపం

✍️ అరియ నాగసేన బోధి
M.A., M.Phil., TPT., LL.B
సద్ధమ్మ ప్రబోధకులు


డిసెంబర్ – బహుజనులకు విషాద మాసం

భారతదేశ బహుజన చరిత్రలో డిసెంబర్ మాసం ఒక ప్రత్యేకమైన విషాద ఛాయను కలిగిన కాలంగా నిలిచిపోయింది. డిసెంబర్ 6న భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత ప్రజల ఆశాజ్యోతి డా. బి.ఆర్. అంబేడ్కర్ మహాపరినిర్వాణం చెందడం కోట్లాది బహుజన హృదయాలను శోకసంద్రంలో ముంచింది. అదే శూన్యత, అదే మానసిక వేదన డిసెంబర్ 20న మరో మహానుభావుడిని కూడా మన నుంచి దూరం చేసింది. ఆయనే సమాజ స్వచ్ఛతకు ప్రతిరూపమైన సంత్ గాడ్గే బాబా మహారాజ్.

డా. అంబేడ్కర్ మరణవార్త విన్న గాడ్గే బాబా,
“ఈ దేశానికి ఇక పీడితులను కాపాడే రక్షకుడు లేడే!”
అనే తీవ్రమైన మనోవేదనకు లోనయ్యారు. ఆ వేదన ఆయన హృదయాన్ని పూర్తిగా కుదిపేసింది. అంబేడ్కర్‌కు కేవలం 14 రోజుల తర్వాత, 1956 డిసెంబర్ 20న గాడ్గే బాబా కూడా అనంత లోకాలకు చేరుకున్నారు. ఈ రెండు మరణాలు బహుజన చరిత్రలో విడదీయరాని భావోద్వేగ అధ్యాయంగా నిలిచాయి.


రజక కుటుంబంలో జన్మించిన సమాజ విప్లవకారి

సంత్ గాడ్గే బాబా అసలు పేరు దేవదాస్ దేబుజీ జింగర్జీ జోధాకర్. ఆయన 1870 ఫిబ్రవరి 23న మహారాష్ట్ర రాష్ట్రం అమరావతి జిల్లా షేన్‌గావ్ గ్రామంలో రజక (చాకలి) కుటుంబంలో జన్మించారు. తండ్రి జింగ్రా, తల్లి సక్కుబాయి. కులవ్యవస్థలో అట్టడుగున ఉంచబడిన కుటుంబంలో పుట్టినా, ఆయన ఆలోచనలు ఆకాశాన్ని తాకాయి.

సత్యాన్వేషణ కోసం గౌతమ బుద్ధుడి త్యాగ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని, భార్యా పిల్లలను విడిచి సన్యాసిగా మారారు. ఆయన వద్ద ఎలాంటి సంపద లేదు. ఒక చీపురు, ఒక భిక్షాపాత్ర మాత్రమే. అదే ఆయన జీవితం, అదే ఆయన ఆస్తి. ఈ సన్యాసం పారిపోవడానికి కాదు – సమాజాన్ని ప్రశ్నించడానికి.


చీపురుతో సమాజాన్ని ఊడ్చిన మహానుభావుడు

గాడ్గే బాబా గ్రామాల నుంచి పట్టణాల వరకు కాలినడకన తిరుగుతూ వీధులు ఊడ్చేవారు. ఆయన చేతిలోని చీపురు కేవలం మురికిని తొలగించడానికి కాదు – కుల అహంకారాన్ని, మూఢనమ్మకాలను, మానవత్వ రాహిత్యాన్ని ఊడ్చే ఆయుధం.

శుభ్రత అనేది కేవలం భౌతిక పరిశుభ్రత మాత్రమే కాదని, అది మానసిక స్వచ్ఛతకు దారి తీస్తుందని ఆయన ప్రజలకు బోధించారు. శుభ్రమైన వీధులు, శుభ్రమైన మనస్సులు, కులరహిత సమాజం – ఇదే గాడ్గే బాబా కల.

మరాఠీ భాషలో విరిగిన మట్టి కుండను “గాడ్గే” అంటారు. అదే మట్టి పాత్రను భిక్షాపాత్రగా వాడుతూ, శుభ్రం చేసిన తరువాత తలపై ధరించేవారు. అలా “గాడ్గే బాబా” అనే పేరు ఆయనకు స్థిరపడింది.


పాటల ద్వారా ప్రజా చైతన్యం

గాడ్గే బాబా గొప్ప ప్రజావాగ్గేయకారుడు. ఆయన ఉపన్యాసాలు కాదు – పాటలు పాడారు. ప్రజల భాషలో, ప్రజల నడుమ నిలబడి, సూటిగా ప్రశ్నలు వేశారు.
“కులం ఒక రోగం”,
“శ్రమకు గౌరవం ఇవ్వాలి”,
“మూఢనమ్మకాలు పోవాలి”
అనే సందేశాలను సరళంగా ప్రజల గుండెల్లో నాటారు.

సంత్ కబీర్, సంత్ రవిదాస్ ప్రభావం ఆయనపై స్పష్టంగా కనిపిస్తుంది. వారు బ్రాహ్మణీయ మనుస్మృతిని ఎలా ప్రశ్నించారో, గాడ్గే బాబా కూడా అదే మార్గాన్ని అనుసరించారు. కులవ్యవస్థ నిర్మూలన ఆయన జీవిత లక్ష్యం.


డా. అంబేడ్కర్ – గాడ్గే బాబా: ఒక చారిత్రక మైత్రి

గాడ్గే బాబా, డా. అంబేడ్కర్ కంటే సుమారు 15 సంవత్సరాలు పెద్దవారు. అనేక రాజకీయ నాయకులను, సంస్కర్తలను చూశారు. కానీ అంబేడ్కర్ వంటి మహోన్నత నాయకుడు మరొకరు లేరని ఆయన బహిరంగంగా చెప్పారు. అందుకే అంబేడ్కర్‌పై ఆయనకు అపారమైన గౌరవం.

డా. అంబేడ్కర్ కూడా,
మహాత్మా జోతిరావు ఫూలే తర్వాత గొప్ప సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా
అని పలుమార్లు ప్రశంసించారు.

పండరీపురంలో అంబేడ్కర్‌కు ఎదురైన వివక్షను గాడ్గే బాబా తీవ్రంగా ఖండించారు. చోకామేళా చరిత్రను గుర్తు చేస్తూ, కులవ్యవస్థ ఎంత క్రూరమో ప్రజలకు వివరించారు. దేవుడి పేరుతో జరిగే అన్యాయాన్ని ఆయన ఎప్పుడూ అంగీకరించలేదు.


స్వచ్ఛ భారత్‌కు నిజమైన పితామహుడు

నేడు “స్వచ్ఛ భారత్” అనే నినాదం దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. కానీ శతాబ్దాల క్రితమే చీపురును ఆయుధంగా చేసుకుని సమాజాన్ని శుభ్రం చేసిన వ్యక్తి సంత్ గాడ్గే బాబా. నిరుపేద రజక కుటుంబంలో పుట్టిన ఆయన, శ్రమకు గౌరవం కావాలని నిరంతరం పోరాడారు.

బ్రాహ్మణీయ గ్రంథాల్లో శ్రమకులాలను హీనంగా చూపించిన విధానాన్ని ఆయన ప్రశ్నించారు. శ్రమదోపిడీకి కులవ్యవస్థ ఎలా తోడ్పడుతుందో బహిరంగంగా వివరించారు. ఆయన దృష్టిలో నిజమైన పవిత్రత – శ్రమ, నిజాయితీ, మానవత్వం.


“దేవుడు గొప్పా? మనిషి గొప్పా?” – హేతువాద ప్రశ్న

గాడ్గే బాబా ప్రజలను తరచూ ఇలా ప్రశ్నించేవారు:
“దేవుడు గొప్పా? మనిషి గొప్పా?”

ప్రజలు “దేవుడే గొప్ప” అని చెప్పగానే,
“అయితే గొప్ప దేవునికి మనం కానుకలు ఎందుకు ఇస్తున్నాం? దేవుడు మనకు ఇవ్వాలా, మనం దేవునికి ఇవ్వాలా?”
అని ప్రశ్నించి ఆలోచింపజేశారు.

దేవుడు లేడని, మనిషే సమాజాన్ని మార్చగలడని ఆయన సుమారు 80 సంవత్సరాల పాటు నిర్భయంగా ప్రకటించారు. ఇది భక్తిని కూల్చడం కాదు – బానిసత్వాన్ని కూల్చడం.


బహుజనుల మరుగున పడిన చరిత్ర – నేటి బాధ్యత

సంత్ గాడ్గే బాబా జీవితం ఒక ప్రశ్న. ఒక సవాల్. ఒక దిశానిర్దేశం. బహుజనుల చరిత్రను మరుగున పెట్టిన వ్యవస్థలను ప్రశ్నించాల్సిన బాధ్యత నేటి తరానికి ఉంది. ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన మహనీయులను గుర్తించడం కేవలం చరిత్ర కాదు – నైతిక ధర్మం.


అమరత్వానికి అర్హుడు

డా. అంబేడ్కర్ మరణంతో కుంగిపోయిన గాడ్గే బాబా, అదే బెంగతో పాట పాడుతూ ప్రాణాలు విడిచారు. వారి జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది –
సమాజం కోసం జీవించాలి, సమాజం కోసం మరణించాలి.

You may also like...

Translate »