ధర్మవాదులు – అధర్మవాదుల పట్ల ఎలా ప్రవర్తించాలి?


అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
కోశాంబీ నగరంలో భిక్షువుల మధ్య గొడవలు, వాదనలు జరిగాయి. ఆ గొడవలు ఆగకపోవడంతో, భగవాన్ బుద్ధుడు వారిని విడిచిపెట్టి పారిలేయ అరణ్యంలోకి వెళ్లి, అక్కడ ఏకాంతంగా వర్షాకాల వాసం గడిపారు. ఆ కాలంలో ఏనుగు రాజు, కోతి రాజు ఆయనకు సేవలు చేశారు. తరువాత భగవాన్ బుద్ధుడు శ్రావస్తికి వచ్చి జేతవన విహారంలో నివసించారు.
కోశాంబీకి చెందిన గృహస్తులు ఈ విధంగా ఆలోచించారు: “ఈ గొడవచేసే భిక్షువుల వల్లే భగవాన్ బుద్ధుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు. అందువల్ల వీరిని మనం గౌరవించకూడదు. వీరు ఎదురుపడితే మనం లేచి నిలబడకూడదు, నమస్కరించకూడదు, ఆహారం ఇవ్వకూడదు. అలా చేస్తే వీరు సిగ్గుపడి ఇక్కడినుంచి వెళ్లిపోతారు లేదా భగవాన్ బుద్ధుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరుతారు.”
అందువల్ల కోశాంబీ ప్రజలు వారిని గౌరవించలేదు, ఆహారం ఇవ్వలేదు. దాంతో భిక్షువులు ఇబ్బందిపడి చివరికి శ్రావస్తిలో ఉన్న భగవాన్ బుద్ధుని వద్దకు వచ్చారు.
సారిపుత్రుని ప్రశ్న
సారిపుత్రుడు భగవాన్‌ను అడిగాడు: “భగవాన్, ఈ గొడవచేసే భిక్షువులు వస్తున్నారు. వీరితో నేను ఎలా ప్రవర్తించాలి?”
గవాన్ చెప్పారు: “సారిపుత్రా, నువ్వు ధర్మవాదుల పక్షాన నిలబడవచ్చు.”సారిపుత్రుడు మళ్లీ అడిగాడు: “ఎవరు ధర్మవాదులు, ఎవరు అధర్మవాదులు అని నేను ఎలా గుర్తించగలను?”
అధర్మవాది భిక్షువుల లక్షణాలు (18) :
- అధర్మాన్ని ధర్మమని చెప్పడం.
- ధర్మాన్ని అధర్మమని చెప్పడం.
- అవినయాన్ని వినయమని చెప్పడం.
- వినయాన్ని అవినయమని చెప్పడం.
- బుద్ధుడు చెప్పని విషయాన్ని చెప్పినట్లు చెప్పడం.
- బుద్ధుడు చెప్పిన విషయాన్ని చెప్పలేదని చెప్పడం.
- బుద్ధుడు ఆచరించని విషయాన్ని ఆచరించాడని చెప్పడం.
- బుద్ధుడు ఆచరించిన విషయాన్ని ఆచరించలేదని చెప్పడం.
- బుద్ధుడు నిర్ణయించని విషయాన్ని నిర్ణయించాడని చెప్పడం.
- బుద్ధుడు నిర్ణయించిన విషయాన్ని నిర్ణయించలేదని చెప్పడం.
- నిరపరాధిని అపరాధిగా చెప్పడం.
- అపరాధిని నిరపరాధిగా చెప్పడం.
- చిన్న తప్పును పెద్ద తప్పు అని చెప్పడం.
- పెద్ద తప్పును చిన్న తప్పు అని చెప్పడం.
- సావశేష తప్పును అనావశేషం అని చెప్పడం.
- అనావశేష తప్పును సావశేషం అని చెప్పడం.
- తీవ్రమైన తప్పును తేలికైనదని చెప్పడం.
- తేలికైన తప్పును తీవ్రమైనదని చెప్పడం.
ధర్మవాది భిక్షువుల లక్షణాలు (18) :ధర్మవాదులు అంటే పైన చెప్పిన ప్రతిదానికి సరైన అర్థం చెప్పేవారు. ఉదాహరణకు: ధర్మాన్ని ధర్మమే అని చెప్పడం, వినయాన్ని వినయమే అని చెప్పడం, తప్పును తప్పే అని చెప్పడం మొదలైనవి.
గృహస్తుల ప్రశ్న
అనాథపిండికుడు, విశాఖమ్మ కూడా భగవాన్‌ను అడిగారు: “భగవాన్, ఈ గొడవచేసే భిక్షువులు వస్తున్నారు. వీరితో మేమెలా ప్రవర్తించాలి?”
భగవాన్ చెప్పారు: “మీరు రెండు వర్గాలకూ సమానంగా దానం ఇవ్వండి. కానీ ఎవరు నిజంగా ధర్మవాదులో వారు చెప్పిన దృష్టి, మాటలు, ధోరణిని అనుసరించండి.”
శయనాసన – భోజనం విషయం
భగవాన్ చివరగా సారిపుత్రునికి చెప్పారు:
భిక్షువులకు వేర్వేరు శయనాసనాలు ఇవ్వాలి.
వృద్ధ భిక్షువుకు ఎప్పటికీ శయనాసనం ఇవ్వకుండా వంచకూడదు.
ఆహారం విషయానికి వస్తే – అందరికీ సమానంగా పంచాలి.
ఇదే ధర్మవాదులు – అధర్మవాదుల పట్ల చూపవలసిన వైఖరి అని బుద్ధుడు ఉపదేశించాడు.