ప్రపంచ గణతంత్ర భావనకు భారతీయ మూలం

వైశాలి గణరాజ్యం – బౌద్ధ ధమ్మం మరియు అంబేడ్కర్ దృష్టి


✍️ అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B

గణతంత్రం : పాశ్చాత్య ఆలోచనా? భారతీయ వారసత్వమా?

ప్రపంచ రాజకీయ చరిత్రలో గణతంత్ర భావనను సాధారణంగా గ్రీస్, రోమ్ వంటి పాశ్చాత్య నాగరికతలకు పరిమితం చేస్తూ చూడటం పరిపాటి. అయితే భారతదేశ ప్రాచీన చరిత్రను, ముఖ్యంగా బౌద్ధ మూలగ్రంథాలను పరిశీలిస్తే, ప్రజాస్వామ్య పరిపాలనకు సంబంధించిన స్పష్టమైన నమూనాలు క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే కనిపిస్తాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనది వైశాలి గణరాజ్యం. ఇది కేవలం ఒక పురాతన నగరం కాదు; ప్రజల భాగస్వామ్యంతో నడిచిన రాజకీయ వ్యవస్థకు స్పష్టమైన చారిత్రక సాక్ష్యం.

వైశాలి గణరాజ్యం : చరిత్రలో తొలి ప్రజాపాలన

వైశాలి వజ్జి సమాఖ్యలో భాగమైన లిచ్ఛవుల రాజధాని. ఇక్కడ రాజు ఆధిపత్యం కాకుండా, గణసభ ఆధారిత పాలన అమలులో ఉండేది. దీఘ నికాయం లోని మహాపరినిబ్బాన సుత్తం లో వైశాలి పాలనా విధానాన్ని బుద్ధుడు స్వయంగా ప్రశంసించిన వివరాలు లభిస్తాయి. తరచూ సమావేశమయ్యే సభలు, సమ్మతితో తీసుకునే నిర్ణయాలు, ప్రజాప్రతినిధుల పాత్ర ఇవన్నీ ఒక గణతంత్ర రాజ్యానికి అవసరమైన మౌలిక లక్షణాలు.

శాసనసభా సంప్రదాయం : ప్రజలే అధికార కేంద్రం

వైశాలి గణరాజ్యంలో శాసనసభకు కీలక స్థానం ఉండేది. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ సభలో సుమారు 700 మంది ప్రతినిధులు పాల్గొనేవారు. వీరంతా ప్రజలచే ఎంపిక చేయబడినవారే. సభా సమావేశాలు క్రమం తప్పకుండా జరగడం, నిర్ణయాల్లో ఏకాభిప్రాయాన్ని ప్రధానంగా తీసుకోవడం, అప్పటి రాజకీయ సంస్కృతి ఎంత పరిపక్వంగా ఉండేదో తెలియజేస్తుంది. ఇది నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూడా ఆదర్శంగా నిలిచే అంశం.

అధికారానికి ముందు ధర్మం : అభిషేక పుష్కరిణి

వైశాలిలోని “అభిషేక పుష్కర్” అనే చెరువు రాజకీయ–సాంస్కృతిక చరిత్రలో విశిష్టత కలిగినది. ప్రజాప్రతినిధులు పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఇక్కడ పాలాభిషేకం చేయించుకునే సంప్రదాయం ఉండేదని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఆచారం కాదు; ప్రజాసేవ పట్ల నిబద్ధతను ప్రకటించే నైతిక ప్రకటన. అధికారాన్ని ధర్మంతో అనుసంధానం చేయాలనే భావన బౌద్ధ ప్రభావంతో ఏర్పడినదిగా భావించవచ్చు.

బుద్ధుడు – గణరాజ్యాల మిత్రుడు

తథాగత గౌతమ బుద్ధుడు వైశాలిని అత్యంత ప్రీతిపాత్రంగా భావించాడు. ఆయన తన బోధనా జీవితంలో అనేకసార్లు ఈ నగరాన్ని సందర్శించాడు. వజ్జీల గణపరిపాలనను ఆయన బహిరంగంగా ప్రశంసించాడు. ధర్మబద్ధంగా, సమ్మతితో నడిచే పాలన ఉన్నంతకాలం వజ్జీలను ఎవరూ ఓడించలేరని బుద్ధుడు చెప్పిన మాటలు, గణతంత్ర పాలన పట్ల ఆయనకున్న గౌరవాన్ని స్పష్టంగా చూపిస్తాయి. బుద్ధుని చివరి ఉపన్యాసం కూడా వైశాలి సమీపంలోని కొల్హువా ప్రాంతంలో జరగడం ఈ నగరానికి ఉన్న ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది.

అశోకుడు మరియు వైశాలి స్మృతి

క్రీ.పూ. 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు వైశాలిలో అశోక స్తంభాన్ని నిర్మించాడు. ఇది బౌద్ధ ధమ్మానికి, అలాగే గణరాజ్య సంప్రదాయానికి ఇచ్చిన గౌరవంగా చూడవచ్చు. బుద్ధుని మహాపరినిర్వాణం తరువాత వందేళ్లకు వైశాలిలో రెండవ బౌద్ధ మండలి జరిగింది. ఈ మండలిలో వినయ నియమాలపై విస్తృత చర్చ జరిగింది. భిన్న అభిప్రాయాలను వినిపించి, సంఘ సమ్మతితో నిర్ణయాలు తీసుకోవడం బౌద్ధ సంఘ ప్రజాస్వామ్య స్వభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

అంబేడ్కర్ దృష్టిలో వైశాలి గణరాజ్యం

డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌద్ధ ధమ్మాన్ని ఒక సమగ్ర సామాజిక–రాజకీయ తత్వంగా చూశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ప్రజాస్వామ్యానికి అవసరమైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం వంటి విలువలు బౌద్ధ ధమ్మంలో సహజంగా నిక్షిప్తమై ఉన్నాయి. వైశాలి గణరాజ్యం ఈ విలువలను ఆచరణలో అమలు చేసిన చారిత్రక ఉదాహరణ. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఈ ధర్మాధిష్ఠిత ప్రజాస్వామ్య భావనల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

వైశాలి నుంచి ఆధునిక భారత గణతంత్రానికి

వైశాలి గణరాజ్యం గతంలో మిగిలిపోయిన ఒక చరిత్ర కాదు. ప్రజల భాగస్వామ్యంతో నడిచే పాలన, నైతిక విలువల ఆధారిత అధికార వ్యవస్థ, సమ్మతి మీద ఆధారపడిన నిర్ణయ ప్రక్రియ – ఇవన్నీ నేటి ప్రజాస్వామ్యాలకు కూడా మార్గదర్శకాలు. ప్రపంచ గణతంత్ర భావనకు భారతీయ మూలం ఉందని చాటి చెప్పే చారిత్రక సాక్ష్యంగా వైశాలి నిలుస్తుంది.

You may also like...

Translate »