ఓటర్ల జాబితాలో లోపాలకు – భారత ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి.


డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్.
ఓటర్ల జాబితాలో లోపాలకు – భారత ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి.
భారతీయ ప్రజాస్వామ్యం యొక్క మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ఉంది. అయితే, ఇటీవల కర్ణాటకలోని “ఆలంద్ ” నియోజకవర్గం అలాగే మహారాష్ట్రలోని ” “రాజురా” అసెంబ్లీ సీటులలో వెలుగుచూసిన ఓటర్ల జాబితా అక్రమాల ఆరోపణలు ఈ సంస్థ యొక్క పారదర్శకత మరియు నిష్పాక్షికతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
2022 డిసెంబర్‌లో ఆలంద్‌లో ఆన్‌లైన్ ఫారం 7 ద్వారా 6,018 ఓటర్ల తొలగింపు అభ్యర్థనలు వచ్చాయి. వీటిలో కేవలం 24 మాత్రమే నిజమైనవిగా గుర్తించబడ్డాయి. మిగిలిన 5,994 మోసపూరితమైనవిగా తేలాయి. ఇది కేవలం స్థానిక సమస్య మాత్రమే కాదు. ఒక పెద్ద పథకం ప్రకారం జరిగిన కుట్ర గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి అక్రమాలు మహారాష్ట్రలోనూ జరిగాయి. అక్కడ “రాజురా” లో 6,850కి పైగా బోగస్ ఓట్ల చేర్పులు జరిగాయి. ఈ ఘటనలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి జరిగిన ఉద్దేశపూర్వక ప్రయత్నాలుగా (కుట్ర)గా చూడాలి.ఈ విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ప్రవర్తన, ప్రతిస్పందనలు మరింత సందేహాలను కలిగిస్తున్నాయి.
ఈ అక్రమాలు మొదట “ఆలంద్” లో బయటపడ్డాయి, అక్కడ బూత్ లెవల్ అధికారి (బీఎల్‌ఓ) ఒకరు తమ సొంత కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపును గమనించి అప్రమత్తమయ్యారు. ఈ అభ్యర్థనలు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన మొబైల్ నంబర్లతో నమోదు చేయబడ్డాయి. జార్ఖండ్, చెన్నై, మహారాష్ట్ర మొదలైనవి. అలాగే ఇవి “ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ” ద్వారా జరిగినట్టు సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య దీనిని ఒక పెద్ద కుట్రగా అభివర్ణించారు. కాంగ్రెస్ కు బలమైన ప్రాంతాలలోనే ఈ తొలగింపులు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు.అందుకు
రాహుల్ గాంధీ చూపించిన సాక్షాలు రుజువు చేస్తున్నాయి. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశ పూర్వకంగా ఓటర్ల జాబితాను మార్చడానికి చేసిన ప్రయత్నమని స్పష్టమవుతుంది. మరోవైపు, “రాజురా” నియోజకవర్గంలో బోగస్ ఓట్ల చేర్పులు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ లీడ్ ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయానికి దారితీసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది
బీబీసీ మారాఠీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, 2024 అక్టోబర్‌లో ఫిర్యాదు నమోదైనా, 11 నెలల తర్వాత కూడా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు, అలాగే ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను సంప్రదించలేదు.ఎందుకు? ఇది స్పష్టంగా (క్రిస్టల్ క్లియర్)వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతుంది. కానీ కర్ణాటక సీఐడీ 18 సార్లు ఐపీ అడ్రస్, డెస్టినేషన్ పోర్టులు, ఓటీపీ ట్రయిల్స్ వంటి డేటాను అభ్యర్థించినా ఇవ్వలేదు
ఈ ఆరోపణల విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ప్రతిస్పందన మరింత వివాదాస్పదంగా ఉంది. ఏలాంటి విచారణ చేయకుండానే మొదటి నుండి
ఈ ఆరోపణలను “నిరాధారమైనవి” అని కొట్టిపారేయడం (బుకాయించడం) ఏదో ఒక పార్టీని సమర్ధించే నేతగా అతని ప్రతి స్పందన ఉందే కానీ నిష్పాక్షికంగా ఉన్నట్లు కనిపించటం లేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ డేటా లేకుండా, అక్రమాల వెనుక ఉన్న పెద్ద తలకాయలను (వ్యక్తి, సంస్థ లేదా కాల్ సెంటర్) కనుగొనడం అసాధ్యం. అందుకే రాహుల్ గాంధీ భారత ఎన్నికల సంఘం “వోట్ చోర్లను కాపాడుతున్నది” అని స్పష్టంగా, బహిరంగంగా మీడియా ముందు ఆరోపించారు. అతని ఆరోపణ సమంజసమే అనిపిస్తుంది. ఎందుకంటే ? ఈ విషయంలో ఎన్నికల సంఘం తనంతట తాను ఈ విషయాలను వెల్లడించలేదు. మూడేళ్ల తర్వాతే ఈ కుట్ర బట్టబయలైంది. తాజాగా, రాహుల్ ఆరోపణల తర్వాత ఆధార్ లింక్డ్ ఈ-సైన్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇది పని ముందుగా ఎందుకు చేయలేదనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇది రియాక్టివ్ చర్య మాత్రమే, ప్రోయాక్టివ్ పర్యవేక్షణ కాదు.
ఇలాంటి ఘటనలలే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయా !? అనేదే కీలక ప్రశ్న. “ఆలంద్” అలాగే “రాజురా ” కేవలం ఉదాహరణలు మాత్రమే కావచ్చు. కానీ, ఇలాంటి అక్రమాలు ఇతర రాష్ట్రాలలోనూ జరిగి ఉండవచ్చు, ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలలో. సాఫ్ట్ వేర్ ఉపయోగం…ఇది ఓటర్ల జాబితాలో సీరియల్ నంబర్లను టార్గెట్ చేసి బల్క్ అప్లికేషన్లు సమర్పించడం అనేది ఒక వ్యూహాత్మక
సిస్టమాటిక్ అప్రోచ్‌ను బలంగా సూచిస్తుంది.
కర్ణాటక సీఐడీ దర్యాప్తులో ఫేక్ ఐడీలతో 100 సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్టు తేలింది.
ఇది ప్రొఫెషనల్ నెట్‌వర్క్ ఉనికిని ధృవీకరిస్తుంది. ఇలాంటి మోసాలు ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చుతాయి. ఎందుకంటే ఓటర్లు తమ హక్కును కోల్పోతారు.అలాగే ఎన్నికల ఫలితాలు మార్చబడతాయి. బీజేపీ ఇలాంటి ఆరోపణలను “కాంగ్రెస్ డ్రామా” అని కొట్టిపారేస్తున్నప్పటికీ, తగిన సాక్ష్యాలు ఉన్నప్పుడు దీనిని తేలికగా తీసుకోకూడదు.
బ్లాక్ లెవల్ అధికారుల పర్యవేక్షణలో లోటుపాట్లు స్పష్టం. ఆన్‌లైన్ అప్లికేషన్లు వచ్చినప్పుడు, వెరిఫికేషన్ ప్రక్రియ ఆఫ్‌లైన్‌గా జరగాలి. కానీ, ఆలంద్‌లో (బ్లాక్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు )హెచ్చరికలు చేసిన తర్వాతే చర్యలు తీసుకున్నారు. ఇది సిస్టమ్‌లోని లోపాలను (లూప్‌హోల్స్‌ను) ఎత్తిచూపుతుంది. ఇలాంటివి ముఖ్యంగా డిజిటల్ ఎరాలో. ఎవరికి లాభం చేకూరుతుంది? స్పష్టంగా, రాజకీయ పార్టీలు లేదా వారి మద్దతుదారులు ఓటర్ బేస్‌ను మార్చడం ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు, ఎందుకంటే సామాన్య పౌరుల విశ్వాసం కుదేలవుతుంది.
ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కాపాడుకోవాలంటే, పారదర్శక చర్యలు తీసుకోవాలి. ముందుగా, సీఐడీకి అవసరమైన డేటాను అందించాలి. అలాగే దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ఆడిట్ ను చేపట్టాలి. అత్యున్నత స్థాయి జ్యుడీషియల్ కమిషన్ లేదా అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన కమిటీ ద్వారా ఈ విషయంలో విచారణ జరపాలి. రాజ్యాంగంలోని 324, 326 అధికరణల స్ఫూర్తిని కాపాడుకోవాలి. ఇది స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఎన్నికలను నిర్ధారిస్తుంది. ఇప్పుడు చర్య తీసుకోకపోతే, భవిష్యత్ ఎన్నికలలో మరిన్ని అక్రమాలు, అవకతవకలు జరగవచ్చు.ఇది ప్రజాస్వామ్యం యొక్క మూలాలు బలహీనపరుస్తాయి. ఇది కేవలం “ఒక రాజకీయ డ్రామా కాదు. దేశ భవిష్యత్” కు సంబంధించిన విషయం.