విజేత విధి శాంతి స్థాపనే

అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B


మనిషి విజయం అంటే సాధారణంగా మరొకరిని ఓడించడం అని చాలా మంది భావిస్తారు. కానీ భగవాన్ బుద్ధుడు చెప్పిన విజయం ఆ రకమైనది కాదు. ఆయన బోధనల ప్రకారం, నిజమైన విజేత అంటే తనలోని కోపం, అహంకారం, అసూయ, లోభం, ద్వేషం వంటి మానసిక శత్రువులను జయించినవాడు. భగవాన్ బుద్ధుడు ఇలా అన్నారు : “విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి.” ఈ వాక్యం బుద్ధ తత్వానికి గుండె చప్పుడు వంటిది.

శాంతి తత్వానికి మూలం:భగవాన్ బుద్ధుడు యుద్ధాలకు వ్యతిరేకి. ఆయన మానవ చరిత్రలో అహింసా తత్వాన్ని రాజకీయ మరియు సామాజిక ఆచరణగా చూపిన మొదటి విప్లవకారుడు. భగవాన్ బుద్ధుని దృష్టిలో హింస అనేది శక్తి కాదు, బలహీనత. శాంతి, సహనం, సత్యం, ధర్మం మరియు దానగుణం ఇవే మానవ వికాసానికి మార్గదర్శకాలు.భగవాన్ బుద్ధుడు ఎప్పుడూ మితభాషి. ఆయనకు మాట కంటే మౌనం ఎక్కువ శక్తివంతమైనది. “మౌనం అంగీకారం” అనే సామెత కూడా భగవాన్ బుద్ధుని ఆచరణ వల్లే పుట్టింది. ఆయన శ్రోత, శాంతి దూత, మరియు సత్యమార్గ సంచారి.

రోహిణీ నది వివాదం — ఒక చారిత్రక పాఠం:సిద్ధార్థుడు (భగవాన్ బుద్ధుడు) యువరాజుగా ఉన్న సమయంలో శాక్యులు మరియు కొలియులు అనే రెండు రాజ్యాల మధ్య రోహిణీ నది జలాల వినియోగం పై తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ రెండు రాజ్యాల ప్రజలు వ్యవసాయానికి ఆ నదినే ఆధారంగా చేసుకుని జీవనం సాగించేవారు. సంవత్సరానికి నీటి పంచాయితీ విషయంలో ఇరువైపుల మధ్య వివాదం పెరిగి యుద్ధ స్థాయికి చేరింది.సిద్ధార్థుడు శాక్యసభలో నిలబడి యుద్ధం వ్యర్థమని వాదించాడు. ఆయన అన్నాడు: “యుద్ధం వలన సమస్యలు పరిష్కరించబడవు. యుద్ధం మరొక యుద్ధానికి దారితీస్తుంది. చంపిన వారిని చంపేందుకు మరొకరు సిద్ధమవుతారు.”

ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు; ఇది భగవాన్ బుద్ధుని అంతర్మనస్సు నుండి ఉద్భవించిన మానవతా సత్యం. అయితే సిద్ధార్థుని అభిప్రాయం శాక్య సంఘం అంగీకరించలేదు. ఇరువైపులా ఆగ్రహం పెరిగింది. అప్పుడే సిద్ధార్థుడు గ్రహించాడు : “సత్యం నెగ్గాలంటే రాజ్యాన్ని కాదు, మనసును మార్చాలి.”ఆత్మజ్ఞానం కోసం ఆయన రాజభవనాన్ని విడిచాడు. ఆ పరిణామమే తరువాత ఆయనను “భగవాన్ బుద్ధుడు”గా మార్చింది.

భగవాన్ బుద్ధుని శాంతి సిద్ధాంతం:భగవాన్ బుద్ధుని దృష్టిలో శాంతి అనేది ఒక స్థితి కాదు; అది ఒక జీవన విధానం. శాంతి అనేది ధర్మానుసారమైన ఆలోచనల ఫలితం. అహింస, దయ, సమానత్వం, వినయం ఇవి శాంతి యొక్క నాలుగు స్తంభాలు. యుద్ధం మనిషిని బాహ్యంగా జయించవచ్చు, కానీ శాంతి మనిషిని అంతర్గతంగా వికసింపజేస్తుంది.భగవాన్ బుద్ధుని “మధ్యమ మార్గం” అదే సూచిస్తుంది. ఎటువంటి అతి ప్రవర్తన, అహంకార భావం లేకుండా సమతా జీవనం.

మానవ విజయం అంటే ఏమిటి?:భగవాన్ బుద్ధుని బోధనల ప్రకారం, మానవుని విజయం కత్తితో గెలిచిన యుద్ధంలో కాదు; జ్ఞానం, సహనం, మరియు కరుణతో గెలిచిన మనసులో ఉంది. ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం కాదు. తనలోని అజ్ఞానం, దురాశ, ద్వేషం, దురహంకారాన్ని జయించడం నిజమైన విజయమని ఆయన బోధించాడు.

భగవాన్ బుద్ధుడు మనకు నేర్పిన సందేశం ఒక వాక్యంలో చెప్పాలంటే : “శాంతి ఎక్కడా లేదు; శాంతి మనలో ఉంది.” మన జీవితంలో యుద్ధాలను తగ్గించుకోవాలంటే, ముందుగా మనలోని ఆత్మలోకాన్ని గెలవాలి. అది నిజమైన “విజేత విధి.”

You may also like...

Translate »