బుద్ధుడు దశావతారాలలో ఒకరా ?

ప్రచారంగా మారిన ఒక అపోహ


భగవాన్ బుద్ధుడు దశావతారాలలో ఒకరు అనే వాదనను హిందూ మతానికి చెందిన వర్గాలు చాలాకాలంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం కేవలం ధార్మిక వేదికలకే పరిమితం కాకుండా, పాఠ్యపుస్తకాలు, ఉపన్యాసాలు, మీడియా ద్వారా కూడా విస్తరిస్తోంది. పదేపదే చెప్పడం వల్ల అది సత్యంగా మారిపోతుందన్న భావనతో ఈ వాదనను ప్రజల్లో బలంగా నాటే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఏ అంశమైనా నిజమా కాదా అనేది నిర్ణయించేది ప్రచారం కాదు, చరిత్ర ఆధారాలు మరియు తత్వపరమైన సరిపోలికే.

దశావతార సిద్ధాంతం ఎలా ఏర్పడింది

విష్ణువు దశావతారాలు అనే సిద్ధాంతం వేదకాలానికి చెందినది కాదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం వంటి ప్రాచీన గ్రంథాలలో ఈ భావనకు సంబంధించిన స్పష్టమైన ప్రస్తావన ఎక్కడా కనిపించదు. దశావతార సిద్ధాంతం ప్రధానంగా పురాణ కాలంలో క్రమంగా రూపుదిద్దుకుంది. విష్ణు పురాణం, భాగవత పురాణం వంటి గ్రంథాలలో అవతారాల జాబితా ఒకే విధంగా లేకపోవడం దీనికి నిదర్శనం. కొన్ని పురాణాలలో బుద్ధుడు అవతారంగా ఉంటే, మరికొన్నింటిలో బలరాముడు కనిపిస్తాడు. అంటే ఇది ఒక స్థిరమైన చారిత్రక సత్యం కాకుండా, కాలానుగుణంగా మారిన పురాణాత్మక నిర్మాణం మాత్రమే.

బుద్ధుడు పురాణ పాత్ర కాదు

గౌతమ బుద్ధుడు ఒక పురాణ కథలోని పాత్ర కాదు. ఆయన క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో జీవించిన చారిత్రక వ్యక్తి. కపిలవస్తు నగరంలో జన్మించి, రాజ్యాన్ని విడిచిపెట్టి, బోధిగయలో బోధి పొందిన గౌతముడి జీవితం చరిత్ర ద్వారా నిర్ధారించగలిగినది. ఆయన బోధనలు, సంఘ నిర్మాణం, శిష్యుల పరంపర మొదలైనవి ఇవన్నీ చరిత్రలో నమోదు అయిన వాస్తవాలు. భగవాన్ బుద్ధుడు తనను తాను ఎక్కడా దేవుడిగా ప్రకటించుకోలేదు. విష్ణువు అవతారమని చెప్పుకోలేదు. ఆయన చెప్పింది ఒక్కటే మనిషి తన దుఃఖానికి తానే కారణం, అలాగే విముక్తికీ తానే మార్గం.

బుద్ధ ధర్మ తత్వం మరియు అవతార భావన

బుద్ధ ధర్మం యొక్క మూలం హేతువాదం. అనిత్యత, అనాత్మ, దుఃఖ నివారణ వంటి సూత్రాలు బుద్ధ ధర్మానికి కేంద్ర బిందువులు. శాశ్వత ఆత్మ లేదని, లోకాన్ని నడిపించే సృష్టికర్త దేవుడు అనే భావనకు ఆధారం లేదని తథాగత బుద్ధుడు స్పష్టంగా చెప్పారు. ప్రతీ విషయం కారణ–కార్య నియమం ప్రకారమే జరుగుతుందని ఆయన బోధన. ఇలాంటి తత్వం ఉన్న బుద్ధ ధర్మంలో దైవ అవతారం అనే భావనకు స్థానం ఉండదు.

అవతార సిద్ధాంతం మాత్రం భిన్నమైన దారిలో సాగుతుంది. లోకంలో అధర్మం పెరిగినప్పుడు దేవుడు మానవ రూపంలో అవతరించి ధర్మాన్ని రక్షిస్తాడన్న విశ్వాసం దాని ఆధారం. అంటే మానవ విముక్తి దేవుడి చేతుల్లో ఉందన్న భావన. కానీ బుద్ధ ధర్మం మానవ విముక్తిని మానవుడి ప్రయత్నంతోనే సాధ్యమని చెబుతుంది. ఈ రెండు భావనలు తత్వపరంగా పరస్పరం విరుద్ధమైనవి.

బుద్ధుడిని అవతారంగా మార్చిన రాజకీయ నేపథ్యం

భగవాన్ బుద్ధుడిని దశావతారాలలో చేర్చడం వెనుక ధార్మికత కంటే రాజకీయ–సాంస్కృతిక ఉద్దేశ్యాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు బౌద్ధ ధర్మం భారతదేశమంతా విస్తరించింది. యజ్ఞాలు, బలులు, కులవ్యవస్థ, మూగ విశ్వాసాలపై అది గట్టి సవాలు విసిరింది. దీని వల్ల బ్రాహ్మణీయ వ్యవస్థకు తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది. బౌద్ధ ధర్మాన్ని పూర్తిగా అణిచివేయడం సాధ్యం కాకపోవడంతో, బుద్ధుడినే విష్ణువు అవతారంగా ప్రకటించి, బౌద్ధాన్ని హిందూ మతంలో కలిపివేయాలనే ప్రయత్నం జరిగింది.

హిందూ బ్రాహ్మణీయ శక్తులు నిబిడీకృతా సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రతిదానినీ తమలోని కలుపుకుంటూ దాని అసలు సిద్ధాంతాన్ని కనుమరుగు చేస్తారు అనడానికి ఇదే నిదర్శనం.

పురాణాలలో బుద్ధుడి వక్రీకరణ

ఈ సాంస్కృతిక ఆక్రమణ ఎంతవరకు వెళ్లిందంటే, కొన్ని పురాణాల్లో బుద్ధుడిని “దైత్యులను మోసం చేయడానికి వచ్చిన అవతారం”గా వర్ణించారు. ఇది బుద్ధుడి బోధనలను కించపరచడమే కాకుండా, ఆయన ధర్మాన్ని తప్పుడు మార్గంగా చూపే ప్రయత్నం. ఒకవైపు అవతారం అంటూనే, మరోవైపు మోసగాడిగా చిత్రించడం బుద్ధుడిపై ఉన్న వ్యతిరేకతకు స్పష్టమైన నిదర్శనం.

చరిత్ర ఏం చెబుతోంది

చరిత్రను నిష్పక్షపాతంగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. భగవాన్ బుద్ధుడు జీవించిన కాలంలో దశావతార సిద్ధాంతం లేదు. బుద్ధుడు వేదాలను ప్రామాణికంగా అంగీకరించలేదు. బ్రాహ్మణీయ దేవతలను తిరస్కరించారు. కులవ్యవస్థను ఖండించారు. అలాంటి వ్యక్తిని శతాబ్దాల తర్వాత రూపొందిన ఒక పురాణ సిద్ధాంతంలో బలవంతంగా చేర్చడం చరిత్రకు విరుద్ధమైన చర్య.

తథాగత బుద్ధుడు అవతారం కాదు

హేతుబద్ధంగా, చరిత్రాత్మకంగా, తత్వపరంగా పరిశీలిస్తే భగవాన్ బుద్ధుడు దశావతారాలలో ఒకడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయన ఒక అవతారం కాదు. ఆయన ఒక మానవుడు, ఒక తత్వవేత్త, ఒక సామాజిక విప్లవకారుడు. భగవాన్ బుద్ధుడిని గౌరవించాలంటే ఆయనను దేవుడిగా మార్చడం కాదు, ఆయన బోధించిన ధమ్మాన్ని అర్థం చేసుకుని ఆచరించడమే నిజమైన నివాళి. భగవాన్ బుద్ధుడు అవతారం కాదు – మానవ చైతన్య విప్లవం.


✍️ అరియ నాగసేన బోధి
M.A., M.Phil , TPT., LL.B
సద్ధమ్మ ప్రబోధకులు

You may also like...

Translate »