విద్వేశపు గుండె చప్పుడు: ఫారూక్ అబ్దుల్లాపై దాడి

మార్చి 11, 2026 నాడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం మాత్రమే కాదు. అది నేటి భారత దేశ సామాజిక రాజకీయాలపై చెరగని ఓ నల్లటి మత విద్వేషపు కుట్రల మరక. 88 ఏళ్ల అబ్దుల్లా ఒక వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా, కమల్ సింగ్ జంవాల్ అనే వ్యక్తి ఆయన మెడపై తుపాకీ పెట్టి కాల్పులు జరిపాడు . భద్రతా సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ, ఈ సంఘటన లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం చాలా లోతైనవి, బాధాకరమైనవి. నేడు మన దేశంలో ఈ మత విద్వేశం ఎంత లోతుగా పాతుకుపోయిందో, అది ఎలా హింసాత్మక రూపం దాలుస్తుందో ఈ ఘటన తిరిగి మరోసారి గుర్తు చేసింది.

ఈ దాడి జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉంది. జడ్-ప్లస్ భద్రత కలిగిన అబ్దుల్లా ప్రాణాలను కాపాడటానికి కేంద్ర బలగాలు, (ఎన్.ఎస్.జీ.) కమాండోలు ఉండాల్సిన ఏర్పాట్లు ఉన్నా, ఓ 63 ఏళ్ల వ్యక్తి సునాయాసంగా ఆయనను సమీపించి కాల్చడం తీవ్రమైన భద్రతా లోపాన్ని సూచిస్తుంది.బహుశా ఈ దేళాలే మన దేశ ప్రధానమంత్రికి, కేంద్ర , రాష్ట్ర మంత్రులకు రక్షణ కల్పిస్తారేమో… ఏది ఏమైనా వారి రక్షణ కీలకం. భవిష్యత్తులో వారి రక్షణకు ఈ సంఘటన సందర్భంగా ఓ సమీక్ష జరిపి తగిన భద్రతా చర్యలు తీసుకుంటే మంచిది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, నిందితుడి మాటలు మరింత కలచివేసేవిగా ఉన్నాయి. పోలీసుల అదుపులో ఉన్న జంవాల్, తాను గత 20 ఏళ్లుగా అబ్దుల్లాను చంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, ఆయన్ను చంపడమే తన లక్ష్యమని నిర్మొహమాటంగా చెప్పడం మనల్ని ఆలోచింపజేస్తుంది. తన చర్యకు ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడం, ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై చెప్పు విసిరిన ఓ సీనియర్ న్యాయవాది మాటలను గుర్తుకు తెస్తుంది. వారిలో ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల సిగ్గుపడటం, పశ్చాత్తాపం పడకపోవటం మానవ విలువల పతనాన్ని సూచిస్తుంది. ఇలాంటి సంఘటనల పట్ల మీడియా లో కొందరు హర్షం ప్రకటించటం, మరికొందరు మత పిచ్చితో లోలోపల సంతోషం పొందవచ్చు. కానీ ఇలాంటి సంతోషాలు మానవ సమాజానికి మేలు చేసేవి కావు. ఆ నేరస్తుని మాటల్లో ప్రతిఫలించిన ద్వేషం ఒక వ్యక్తి మనసులో ఎంత లోతుగా విషం నింపుకున్నాడో తెలియజేస్తుంది.

ఈ దాడి తర్వాత ఫారూక్ అబ్దుల్లా స్పందించిన తీరు చాలా అర్థపూర్వకంగా ఉంది. “దేశంలో వ్యాపించిన విద్వేశమే ఇలాంటి సంఘటనలకు కారణం” అని ఆయన అన్న మాటలు ఎంతో ఆలోచనాత్మకమైనవి. ఈ సంస్కృతి మన దేశంలో గత 12 ఏళ్ళుగా విజృంభించటం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఏ మతమూ ద్వేషం నేర్పించదని, కానీ మనం మతాన్నే వదిలేసినట్లు ఉందని ఆయన చేసిన వ్యాఖ్య సమాజం ముందున్న నైతిక సంక్షోభాన్ని ఎత్తి చూపిస్తుంది . ఈ దాడి తనపై వ్యక్తిగతంగా జరిగిన దాడిగా కాకుండా, ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణం యొక్క సహజ పరిణామంగా ఆయన విశ్లేషించడం గమనార్హం. ఆయన మాట్లాడుతున్న మితమైన, సామరస్య పూర్వకమైన వాణికి స్థానం లేకుండా పోతోందనే ఆవేదనను వ్యక్తం చేయడం, ఈ దాడిని కేవలం తనపై దాడిగా కాకుండా ఒక భావజాలంపై దాడిగా భావించేలా చేస్తుంది.

ఈ సంఘటనపై రాజకీయ స్పందనలు కూడా ఇప్పటికే ఊహించిన దానికంటే భిన్నంగా లేవు. ప్రతిపక్షాలు భద్రతా విఫలమైందని, దీన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేస్తుంటే, కేంద్రం మాత్రం దీనికి రాజకీయ రంగు వేయవద్దని హెచ్చరించింది . కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, చట్ట-వ్యవస్థ బాధ్యత వహించే వారిని నిలదీయాలని డిమాండ్ చేయడం సమంజసంగా ఉంది . కానీ, ఈ దాడి రాజకీయాలకు అతీతంగా, సమాజంలో ఏర్పడిన ఒక ప్రమాదకర ధోరణిని సూచిస్తుంది. మాటల ద్వేషం ఎప్పుడు తుపాకీ మందుగుండుగా మారుతుందో అనే భయానక వాస్తవానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.

ఫారూక్ అబ్దుల్లా ఎదుర్కొన్న ఈ ప్రమాదం, ఆయన వ్యక్తిగతంగా ఓ 63 ఏళ్ల వ్యక్తి దాడి నుంచి బయటపడిన సంఘటన మాత్రమే కాదు. అది మన సమాజంలో పాతుకుపోయిన విద్వేశం యొక్క గుండె చప్పుడు. ఎవరి భావాలతోనైనా విభేదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ, ఆ విభేదాలు విద్వేశంగా మారి, హింసకు దారితీస్తే, ఆ సమాజం అంధకారంలో మునిగిపోతుంది. జమ్మూకాశ్మీర్ చాలా కాలంగా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంది . ఇప్పుడు, ఈ దాడి ఆ అంధకారం మరింత లోతుగా విస్తరిస్తున్నదనడానికి నిదర్శనం. ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే… విద్వేశానికి వ్యతిరేకంగా గళం విప్పడమే కాదు, దాన్ని నిర్మూలించడానికి సమష్టిగా కృషి చేయడం. లేదంటే, రేపు మరొకరి మెడపై మరో తుపాకీ మొన చూపవచ్చు.ఆ విద్వేష అగ్ని మనదాకా రావచ్చు.కీలక నేతలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.సంబంధిత రక్షణ దళాలు కూడా తగిన విధంగా సంసిద్ధ పడాలి.


డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్.

You may also like...

Translate »