ప్రజాస్వామ్యం ముసుగులో అమెరికా రక్త చరిత్ర కుట్రలు..

ప్రపంచ రాజకీయ చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఒక గంభీరమైన విరుద్ధత మన ముందుకొస్తుంది. ఒకవైపు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అనే విలువలను ప్రపంచానికి బోధించే శక్తిగా నిలిచిన అమెరికా; మరోవైపు అదే దేశం అనేక దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకొని ప్రభుత్వాలను పడగొట్టడం, నాయకులను తొలగించడం, సైనిక తిరుగుబాట్లకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడిన చరిత్ర. ముఖ్యంగా కోల్డ్ వార్ కాలంలో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఈ రాజకీయాల అసలు స్వరూపం యువతరానికి అర్థమవుతుంది.

ఆఫ్రికాలోని కాంగో దేశం ఈ చరిత్రలో ఒక విషాద అధ్యాయం. 1960లో బెల్జియం వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత దేశం తొలి ప్రధానమంత్రిగా ‘పాట్రిస్ లుముంబా’ అధికారంలోకి వచ్చారు. దేశంలోని యురేనియం, కాపర్ వంటి సహజ సంపదలను విదేశీ కంపెనీల ఆధిపత్యం నుంచి బయటకు తేవాలని ఆయన ప్రయత్నించారు. పాశ్చాత్య దేశాలకు ఇది అసహనంగా మారింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ‘డ్వైట్ ఐసెన్ హోవర్’ నాయకత్వంలోని వాషింగ్టన్ పాలక వర్గం లుముంబాను తమ ప్రయోజనాలకు ప్రమాదంగా భావించింది. తర్వాత వెలుగులోకి వచ్చిన పత్రాలు సూచించినట్లుగా ‘సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)’ ఆయనను తొలగించే కుట్రలను రూపొందించింది. చివరికి 1961లో లుముంబా హత్యకు గురయ్యారు. ఆఫ్రికా రాజకీయాల్లో ఇది ఒక చీకటి మలుపుగా నిలిచింది.

లాటిన్ అమెరికాలోని చిలీ దేశంలో జరిగిన సంఘటన కూడా ఇదే నమూనాను ప్రతిబింబిస్తుంది. 1970లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన అధ్యక్షుడు ‘సాల్వడార్ అల్లెండే’ దేశంలోని కాపర్ గనులను జాతీయీకరించారు. పేదల సంక్షేమానికి అనేక సంస్కరణలు ప్రారంభించారు. అయితే అమెరికా కంపెనీల ప్రయోజనాలకు ఇది ప్రమాదంగా భావించబడింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ‘రిచర్డ్ నిక్సన్’ ప్రభుత్వం “చిలీ” దేశపు రాజకీయాలను అస్థిరపరచడానికి రహస్య చర్యలకు పాల్పడిందని తరువాత బయటపడిన పత్రాలు సూచిస్తున్నాయి. 1973లో చిలీ సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ‘ఆగస్టో పినోచెట్’ నియంతృత్వ పాలనను స్థాపించాడు. అల్లెండే అదే రోజు మరణించాడు. చిలీ ప్రజాస్వామ్యానికి ఇది ఒక తీవ్రమైన దెబ్బ.

మధ్యప్రాచ్యంలో కూడా ఇలాంటి జోక్యం జరిగింది. ఇరాన్ దేశంలో 1951లో ప్రధానమంత్రిగా ఎన్నికైన ‘మొహమ్మద్ మొసద్దేగ్’ దేశంలోని ఆయిల్ పరిశ్రమను జాతీయీకరించారు. ఇది పాశ్చాత్య ఆయిల్ కంపెనీలకు పెద్ద దెబ్బగా మారింది. 1953లో జరిగిన తిరుగుబాటులో ఆయన ప్రభుత్వం పడిపోయింది. ఈ కుట్రలో అమెరికా సీఐఏ, బ్రిటన్ గూఢచారి సంస్థల పాత్ర ఉందని తరువాత అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ సంఘటన తరువాత ఇరాన్‌లో ‘షా’ రాజ్యాధికార పాలన బలపడింది. ఆ అసంతృప్తి చివరికి 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి దారితీసింది.

మధ్య అమెరికాలోని ‘గ్వాటిమాలా’ దేశం కూడా ఇలాంటి కుట్రకు గురైంది. 1954లో అక్కడి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన అధ్యక్షుడు ‘జాకోబో ఆర్బెన్స్’ భూసంస్కరణలను ప్రారంభించాడు. పెద్ద భూస్వామ్య సంస్థల ప్రభావాన్ని తగ్గించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అమెరికా కంపెనీలకు అసహనంగా మారాయి. తర్వాత జరిగిన సైనిక తిరుగుబాటుతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఈ సంఘటన గ్వాటిమాలాలో అనేక దశాబ్దాల రాజకీయ అస్థిరతకు దారితీసింది.

క్యూబా దేశంలో జరిగిన పరిణామాలు కూడా ఈ రాజకీయాల్ని స్పష్టంగా చూపిస్తాయి. విప్లవ నాయకుడు ‘ఫిడెల్ కాస్ట్రో’ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను తొలగించడానికి అనేక రహస్య ప్రయత్నాలు జరిగాయి. ఆయనపై విషప్రయోగం చేయడం నుంచి బాంబు దాడుల వరకు అనేక యత్నాలు జరిగాయని తరువాత పత్రాలు వెల్లడించాయి. క్యూబాపై ఆర్థిక ఆంక్షలు దశాబ్దాలుగా కొనసాగాయి.

దక్షిణాసియాలో కూడా అమెరికా జోక్యం వివాదాలకు దారితీసింది. ఇండోనేషియా దేశంలో 1960లలో జరిగిన రాజకీయ పరిణామాల్లో అధ్యక్షుడు ‘సుకార్నో అధికారాన్ని కోల్పోయారు. తరువాత జనరల్ సుహార్తో ‘ నాయకత్వంలో కొత్త పాలన ఏర్పడింది. ఈ మార్పులో పాశ్చాత్య దేశాల మద్దతు ఉందని అనేక చరిత్రకారులు పేర్కొన్నారు.

ఆఫ్రికాలోని మరొక ఉదాహరణ ‘ఘనా’ దేశం. అక్కడి అధ్యక్షుడు ‘క్వామే ఎన్‌క్రూమా’ పాన్-ఆఫ్రికన్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లారు. 1966లో ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు వెనుక కూడా విదేశీ గూఢచారి సంస్థల పాత్ర ఉందని అనేక విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇలా చరిత్ర గర్భంలో అనేక కుట్రలు, సంఘటనలు దాగి ఉన్నాయి. వాటిని అన్నింటిని నేటి యువత తవ్వి తీసి పరిశీలిస్తే ఒక సాధారణ నమూనా కనిపిస్తుంది.ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదల పై నియంత్రణ, వ్యూహాత్మక భౌగోళిక ప్రయోజనాలు, కోల్డ్ వార్ రాజకీయాలు… ఇవన్నీ కలగలిసినప్పుడు అమెరికా విదేశాంగ విధానం తరచూ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. ప్రపంచానికి ప్రజాస్వామ్యం గురించి బోధించే దేశం, అదే సమయంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచడంలో భాగస్వామ్యం కావడం ఒక గంభీరమైన విరుద్ధంగా కనిపిస్తుంది.

ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు; ప్రపంచ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన పాఠం కూడా. అధికారిక ప్రకటనలు, ఉపన్యాసాలు, అంతర్జాతీయ వేదికలపై వినిపించే మాటలు మాత్రమే నిజం కావు. వాటి వెనుక దాగి ఉన్న వ్యూహాలు, ప్రయోజనాలు, రాజకీయ లెక్కలు కూడా ఉంటాయి. అందువల్ల యువత ప్రపంచ రాజకీయాల చరిత్రను తొందరపాటుతో కాకుండా నిదానంగా విమర్శనాత్మక ఆలోచనా దృష్టితో అధ్యయనం చేయాలి.

నేటి సమాచార యుగంలో నిజాలను దాచడం క్రమంగా కష్టమవుతోంది. గతంలో రహస్యంగా జరిగిన అనేక ఆపరేషన్లు ఇప్పుడు పత్రాల రూపంలో బయటపడుతున్నాయి. చరిత్రను పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది… ఆర్థికంగా, ఆయుధ పరంగా శక్తివంతమైన దేశాలు తరచూ తమ స్వార్థపూరిత ఆర్థిక, రాజకీయ ఆధిపత్య ప్రయోజనాలను రక్షించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తాయి. కానీ అదే సమయంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ హక్కులు వంటి విలువలు నిజమైన అర్థంలో నిలవాలంటే ప్రపంచ యువత ఇలాంటి చారిత్రక ఆధారాలతో తమ ప్రభుత్వాధి నేతలపై ప్రశ్నలు సంధించాలి.ఎందుకంటే రేపటి భవిష్యత్తు వారిదే.

ఈ చారిత్రక పాఠాలు నేటి యువతకు ఒక కనువిప్పు కావాలి. ప్రపంచ రాజకీయాల్లో నీతులు చెప్పే నేతల మాటలకంటే , ఆచరణలో వారి చర్యలు ముఖ్యమైనవి. చరిత్రను విమర్శనాత్మకంగా అధ్యయనం చేసినప్పుడే అంతర్జాతీయ రాజకీయాలు, దౌత్య వైఖరి, పార్టీ సిద్ధాంతాల అసలు స్వరూపం ఏమిటో బయటపడుతుంది. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనే పదం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా నిజమైన ఒక ‘విలువ’ గా మారే అవకాశం ఉంటుంది.


డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్.

You may also like...

Translate »