నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 87వ వర్థంతి

జై భీమ్ : ఒక వ్యక్తి పేరు కాదు – ఒక విప్లవాత్మక చైతన్య ప్రకటన


✍🏽 అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B,సద్ధమ్మ ప్రబోధకులు & అంబేడ్కరిస్టు


నినాదంగా మారిన చరిత్ర :

భారత సామాజిక ఉద్యమ చరిత్రలో కొన్ని నినాదాలు కేవలం నోట పలికే మాటలుగా ఉండవు. అవి ఒక కాలానికి చెందిన పీడితుల పోరాట చరిత్రను, పోరాటాన్ని, ఆశను ప్రతిబింబిస్తాయి. అలాంటి నినాదాలలో అత్యంత ప్రభావవంతమైనది “జై భీమ్”. నేడు ఈ నినాదం భారతదేశం అంతటా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాల హక్కుల పోరాటానికి ప్రతీకగా మారింది. అయితే ఈ నినాదం వెనుక ఉన్న వ్యక్తి, చరిత్ర, త్యాగం గురించి తెలుసుకోవడం మన బాధ్యత. నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 87వ వర్థంతి సందర్భంగా ఆయన జీవితాన్ని, ఆయన అందించిన ఈ చారిత్రక నినాద ప్రాధాన్యాన్ని స్మరించుకోవడం అత్యంత అవసరం.

జై భీమ్ అంటే ఏమిటి? – సరైన చారిత్రక అర్థం :

జై భీమ్ అనేది భాషాపరమైన శబ్దవ్యుత్పత్తి కంటే ముందుగా ఒక రాజకీయ–సామాజిక ప్రకటన. ఇది పాళీ లేదా సంస్కృత పదాల వ్యాకరణ విభజనపై ఆధారపడి ఏర్పడిన నినాదం కాదు.జై భీమ్ అంటే – “డా. బి.ఆర్. అంబేడ్కర్‌కు జయము” అదే సమయంలో, డా.అంబేడ్కర్ ప్రతినిధ్యం వహించిన సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, మానవ హక్కుల ఉద్యమానికి జయము అనే విస్తృత అర్థాన్ని కలిగి ఉంది. ఇది ఒక వ్యక్తి పట్ల అంధభక్తి కాదు. ఇది డా.అంబేడ్కర్ ఆలోచనా వ్యవస్థకు, ఆయన విముక్తి ప్రాజెక్టుకు ఇచ్చిన మద్దతు నినాదం.

జై భీమ్ – ఎందుకు భయపెట్టే నినాదం అయింది?:

జై భీమ్ నినాదం కేవలం శుభాకాంక్ష కాదు. ఇది ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ఒక బహిరంగ ప్రకటన. అందుకే ఈ నినాదం ఛాందసవాద శక్తులను కలవరపెట్టింది.

కులాధిపత్యానికి సవాల్ విసిరింది.సమానత్వాన్ని నిరాకరించే శక్తులకు వణుకు పుట్టించింది.

జై భీమ్ అంటే “మేము మళ్లీ అణచివేతను అంగీకరించం” అనే ధైర్యవాక్యం.

జై భీమ్ నినాదం ఎలా పుట్టింది? :

డా. బి.ఆర్. అంబేడ్కర్ స్థాపించిన సమతా సైనిక దళ్ అణగారిన వర్గాల్లో ఆత్మరక్షణ, క్రమశిక్షణ, చైతన్యం పెంపొందించేందుకు ఏర్పాటు చేయబడింది. 1935లో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో సమతా సైనిక దళ్ శిక్షణా కార్యక్రమం జరిగింది.1935 జనవరి 6న సమతా సైనిక దళ్‌కు సంబంధించిన నియమావళిని రచించిన వ్యక్తి బాబు హరదాస్. అదే నియమావళిలో తొలిసారిగా “జై భీమ్” అనే నినాదం ఉపయోగంలోకి వచ్చింది.డా.అంబేడ్కర్ నాయకత్వంలోని ఉద్యమానికి విజయం చేకూరాలి అనే సంకల్పంతో, ఆయన పేరు చుట్టూ ఐక్యత ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ నినాదాన్ని ప్రవేశపెట్టారు. ఆ రోజు నుంచి జై భీమ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఉద్యమానికి అధికారిక ఆత్మగా మారింది.

బాబు హరదాస్ : జననం మరియు విద్యా నేపథ్యం :

బాబు హరదాస్ లక్ష్మణరావు నాగ్రాలే 1904 జనవరి 6న మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కామఠీ పట్టణంలో జన్మించారు. అస్పృశ్యత అత్యంత తీవ్రంగా ఉన్న కాలంలో, నిమ్నజాతులకు విద్య లభించని పరిస్థితుల్లో హరదాస్ మెట్రిక్యులేషన్ వరకు చదవడం ఒక విప్లవాత్మక ఘట్టం. విద్యను ఆయుధంగా మార్చుకుని ఆయన సామాజిక పరివర్తన దిశగా అడుగులు వేశారు.

సామాజిక చైతన్యం : విద్య, సంఘటన, ఐక్యత :

హరదాస్ అస్పృశ్యుల కోసం రాత్రి బడులు నడిపారు, చోకమేళ గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. మహిళల విద్య కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. పదిహేడు సంవత్సరాల వయసులోనే “మహారథ” అనే పత్రికను ప్రారంభించి నిమ్నజాతుల సమస్యలపై చర్చకు వేదిక కల్పించారు.అగ్రవర్ణాల దాడుల నుండి అస్పృశ్యులను రక్షించేందుకు మహర్ యువకులను ఏకం చేసి “మహర్ సమాజ్ పాతక్” అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ఆత్మగౌరవ రక్షణకు తొలి సంఘటిత అడుగు.

కార్మిక ఉద్యమం మరియు సామాజిక ఐక్యత :

బీడీ కార్మికులుగా పనిచేసే అస్పృశ్యులు శ్రమదోపిడీకి గురవుతున్న పరిస్థితిని గమనించిన హరదాస్ బీడీ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. సహకార వ్యవస్థ ద్వారా దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. కుల విభజనను చెరిపివేయడానికి సామూహిక భోజనాలు నిర్వహించి ఐక్యతకు బాటలు వేశారు.

డా. అంబేడ్కర్ అనుయాయిగా హరదాస్ పాత్ర :

1928లో డా.అంబేడ్కర్‌ను కలిసిన తరువాత హరదాస్ పూర్తిగా డా.అంబేడ్కర్ ఉద్యమానికి అంకితమయ్యారు. 1930లో స్థాపించిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్‌కు సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు.రౌండ్ టేబుల్ సమావేశాల సమయంలో డా.అంబేడ్కర్‌ను దళితుల నిజమైన ప్రతినిధిగా గుర్తింపజేయడానికి దేశవ్యాప్తంగా నాయకులను ఏకం చేసి 32 టెలిగ్రామ్‌ల ఉద్యమానికి నాయకత్వం వహించారు. పూనా ఒప్పంద సమయంలో కూడా అస్పృశ్యుల హక్కుల కోసం కీలకంగా వ్యవహరించారు.

త్యాగానికి ప్రతిరూపం : వ్యక్తిగత విషాదం – ఉద్యమ నిబద్ధత :

1933లో అకోలా సభలో ప్రసంగిస్తున్న సమయంలో తన కొడుకు మరణించినా, సభను వదిలి వెళ్లలేదు. “ఈ సభకు వచ్చిన మీరందరూ నా పిల్లలే” అన్న ఆయన మాటలు ఉద్యమానికి ఆయన ఎంతగా అంకితమయ్యారో తెలియజేస్తాయి.

రాజకీయ జీవితం – తీవ్ర పేదరికం :

ఇండిపెండెంట్ లేబర్ పార్టీ చీఫ్ సెక్రటరీగా, ఎమ్మెల్యేగా పనిచేసినా హరదాస్ వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. క్షయవ్యాధితో బాధపడుతున్నప్పుడు మందు వేసుకోవడానికి పాలు కొనలేని స్థితి ఆయన నిస్వార్థ రాజకీయ జీవితం యొక్క దుర్దశను చూపుతుంది.

మరణం మరియు అంబేడ్కర్ స్పందన :

1939 జనవరి 12న బాబు హరదాస్ క్షయవ్యాధితో మరణించారు. ఆయన మరణంపై డా. అంబేడ్కర్ “బాబు హరదాస్ మరణంతో నా కుడిచెయ్యి కోల్పోయినట్లైంది” అని చెప్పడం హరదాస్ ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది.

నినాదంగా మిగిలిన అమరత్వం :

బాబు హరదాస్ జీవితం చిన్నదైనా, ఆయన ఇచ్చిన జై భీమ్ నినాదం శాశ్వతం. ఇది ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, సమానత్వం కోసం సాగే నిరంతర పోరాటానికి ప్రతీక. ఈ 87వ వర్థంతి సందర్భంగా బాబు హరదాస్‌ను స్మరించుకోవడం అంటే, జై భీమ్ అనే నినాదంలో దాగి ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ ఆలోచనలను మన జీవితాల్లో అమలు చేయడమే.

You may also like...

Translate »