అశోక విజయదశమి శుభాకాంక్షలు…

✍️అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B


మన భారతదేశంలో బౌద్ధ మతం సుమారు 2౦౦౦ సం౹౹లు విరాజిల్లింది.ఈ నేలపైనే పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.బౌద్ధ మతానికి జన్మభూమి మన దేశం.అలాంటి బౌద్ధ మతాన్ని స్థాపించిన భగవాన్ గౌతమ బుద్ధుడు యొక్క ధమ్మాన్ని వ్యాప్తి చేసిన సామ్రాట్ అశోకుడు బుద్ధుని తరువాత 2 వ స్థానంలో నిలిచారు.అశోక విజయదశమి సందర్భంగా సామ్రాట్ అశోకుడు గురించి తెలుసుకుందాం…

విశ్వవిఖ్యాత చక్రవర్తులలో చంద్రగుప్త మౌర్యుడు ఒకరు.ఇతను జైనమతాభిమాని.చంద్రగుప్త మౌర్యుని తనయుడు బిందుసారుడు.బిందుసారుడు-సుభద్రాంగి దంపతుల తనయుడు అశోకుడు.

అశోకుడు కాలం నాటికి బహుభార్యత్వం రాజకీయ అవసరంగా ఉండేది. అశోకునికి ఆరుగురు భార్యలు విదిశా దేవి,అసంధిమిత్ర, తిష్యరక్షిత, పద్మావతి, కారువాకి,ఆరవ భార్య (పేరు తెలియదు).

క్రీ.పూ.304 సంవత్సరంలో చైత్రమాసం శుక్ర పక్ష అష్టమి నాడు సుభద్రాంగిని – బిందుసారుడు దంపతులకు జన్మించారు.అశోకుడు జననంతో మహారాణి సుభద్రాంగిని కష్టాలు,శోకాలు తొలగడంతో తమ పుత్రునికి అశోక అని పేరు పెట్టారు.అశోకునికి సుసీమ,విగతశోకలు అను ఇద్దరు సోదరులు కలరు.గృహయుద్ధంలో అశోకుడు చేతిలో సుసీమ వీరమరణం చెందారు. విగతశోకలు,సుసీమ కుమారుడు బౌద్ధ భిక్షువుగా మారారు.

అశోకునికి తిశ్యరక్ఖితా,అసంఘమిత్రా,దేవీ, కారువాకీ, పద్మావతీలు అను ఐదుగురు భార్యలు.మహేంద్ర, కుణాలుడు,జల్లోకుడు అను కుమారులు, సంఘమిత్ర, చారుమతి అను కుమార్తెలు కలరు.

అశోకుని గురించి చరిత్రలో చాలా వక్రీకరణలు చేసారు. వాస్తవానికి అశోకుడు 99 మంది తన సోదరులను చంపి గద్దెనెక్కాడని చరిత్రకారులు వ్రాశారు. అయితే ఇందులో నిజం లేదు.మహా చక్రవర్తి గురించి ఇలాంటి అవాస్తవ వ్రాతలు వ్రాయడం సబబు కాదు.ఈ వ్రాతలకు ఆధారాలు కూడా లేవు.బౌద్ధ చక్రవర్తి ప్రతిష్ఠను దిగజార్చడం కోసం వ్రాసిన వ్రాతలు ఇవని అర్థం చేసుకోవచ్చు.

    అశోకుడు క్రీ.పూ.270-69 లో మగధ రాజ్య పట్టాభిషిక్తుడు అయ్యాడు.అశోకుడు పట్టాభిషిక్తుడైన ఎనిమిది సం౹౹లకు కళింగ యుద్ధం జరిగింది. క్రీ.పూ.262 లో జరిగిన కళింగ యుద్ధం మన భారతదేశం యొక్క చరిత్ర గతిని మార్చింది.

భయంకరమైన, ఘోరమైన కళింగ యుద్ధం :కళింగులు మహావీరులు, ఆదివాసీలు(గిరిజనులు). కళింగ ప్రజలు ఆది బౌద్ధులు, ధమ్మాచారులు కూడా. అశోకుని తండ్రి బిందుసారుడు సైతం కళింగ రాజ్యంపై తన సైన్యాన్ని పంపించినా కళింగులు లొంగలేదు.కొందరు అశోకునిపై రాజకీయ కుట్రలు పన్ని,కళింగ రాజుల చెంత చేరి కళింగ యుద్ధానికి కారకులు అయ్యారు.మూడు కళింగ కూటముల ఏకమైనాయి.వీరికి ‘ఐళ’ నాయకత్వం వహించాడు. అశోకునికి యుద్ధం చేయక తప్పలేదు.అశోకుడు కళింగులను ఎలాగైనా జయించాలనే యుద్ధం ప్రకటించాడు. కళింగులపై యుద్ధం చేయడానికి బహుశా కళింగులు ఆచరిస్తున్న బౌద్ధ మతం కూడా ఒక కారణం కావొచ్చు. కళింగులు బౌద్ధులు, ధమ్మ రక్షణ, దేశం కోసం యుద్ధభూమిలో విరోచితంగా పోరాటం సాగించారు.అశోకుని సైన్యం-కళింగ సైన్యం ఇరువురు సమానస్థాయిలో యుద్ధం చేసారు.కళింగ యుద్ధం పది నెలలు పాటు సాగింది.కళింగ యుద్ధంలో ఒక లక్ష మంది మరణించారు.ఒక లక్షన్నర మంది క్షతగాత్రులై విగత జీవులైనారు.ఒక లక్షన్నర మంది యుద్ధ ఖైదీలై మగధ కారాగారాల్లో బంధీలైనారు.ప్రపంచంలో అంతకముందెన్నడూ ఇంతటి భయంకరమైన, ఘోరమైన యుద్ధం జరిగి ఉండలేదు.క్రీ.పూ.261 లో కళింగ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో అశోకుడు చేసిన నరమేధాన్ని అశోకుడే చూసి చలించిపోయాడు.

అశోకుడు కళింగ యుద్ధంలో రక్తపాతం చూసి చలించిపోయాడు, విసిగిపోయాడు. యుద్ధ భూమి నుండి ఇంటికి తిరిగి వచ్చిన అశోకునికి నిద్ర పట్టలేదు. సామ్రాట్ అశోకునికి నిద్ర పట్టకపోవడం ఏంటి? ఇలా తన మనసులో ప్రశ్నలు వేసుకొని అశోకుడు హృదయపరివర్తన చెందాడు. ఎంత గొప్పవాడు అయినా, సిరిసంపదలు ఉన్న, పదవి ఉన్న, అధికారం ఉన్న నిద్ర పట్టకపోవడం అనే రోగం వస్తే ఇక ఆ మనిషికి విలువ ఏంటి? మనిషికి శాంతి, సంతృప్తి, మానసిక ప్రశాంతత,కంటి నిండా సరైన నిద్ర ఉండాలి. ఇవి లేనప్పుడు మన జీవితానికి అర్థం ఉండదు.

యుద్ధం ముగిసిన మరుసటి రోజున ప్రజలు దేశమంతా అశోకునికి గుర్తుగా కళింగ యుద్ధ విజయయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.అశోక విజయదశమినే ‘ధమ్మ జయం’ అని పిలుస్తారు.అశోకునిలో మాత్రం విజయం లభించినా మనశ్శాంతి కనబడేది కాదు.అశోకుడు ఇంటికి వచ్చిన తరువాత తన భార్య విదిశా దేవి మరియు తమ బిడ్డలు సంఘమిత్ర,మహేంద్రలు ధమ్మ బోధనలు చేసేవారు. ఈ ధమ్మ బోధనలు కొంత అశోకునికి ఊరటనిచ్చేవి.

కళింగ యుద్ధ భూమిలో శవాలు కుప్పలుగా పడి ఉండటం అశోకుడు చూశాడు. అక్కడ రక్తం ఏరులై పారటం, క్షతగాత్రుల ఆర్తనాదాలు, వారి బంధువులు, మిత్రులు యొక్క ఆవేదన అశోకునిలో పరివర్తనకు దారితీసింది. అశోకునిలో ఉన్న మానవత్వం బయటపడింది.తాను పశ్చాత్తాపం చెందాడు.

🪷అశోకునిలో ధమ్మ పరివర్తన కలిగించిన యువ భిక్షువు : ఒకరోజు ఆయన … దారిన వెళుతున్న ఒక యువ భిక్షువును చూశాడు. శాంతి స్వభావం ఉట్టిపడే ఆ భిక్షువును చూసి అశోకుడు సమ్మోహితుడయ్యాడు. అతన్ని తన అంతఃపురానికి ఆహ్వానించాడు. వారి మధ్య సంభాషణ జరిగింది. దీంతో అతని మనసులో అలజడి కొంత ఉపశమిండింది. మెల్లమెల్లగా అశోకుడు ధర్మ మార్గంలో నడవ సాగాడు. ఒక నూతన యుగం …యుగ పరివర్తన ప్రారంభమైంది. ప్రపంచ సామాజిక – పరివర్తన ఒక నూతన దిశా నిర్ధేశం జరిగింది.అశోకుని పరివర్తనతో… ఒక నూతన మానవతా కిరణం ఉదయించింది. దీనిని ధర్మక్రాంతి అని గాని ధర్మిమ పరివర్తన అని పిలవటం సబబు. ఎందుకంటే ధర్మ కాంతిలో దుడుకుదనం ఉంటుంది. కాని ధర్మ పరివర్తనలో ధర్మం దిశగా మార్పు జరుగుతుంది.

👉అశోకుడికి హిత బోధ చేసిన వదిన : అశోకునికి వదిన సుమన.ఈమె అశోకునికి మాతృ సమానురాలు.తల్లిలా సుమన అశోకునికి మంచి – చెడును చెప్పేది.యుద్ధం ముగిసిన తరువాత చీకటి వేళ ఇంటికి చేరుకున్న అశోకుడు తన వదినను శత్రు సైన్యాలు హతమార్చారేమోనని యుద్ధ భూమిలో కాగడా పట్టుకుని యుద్ధ భూమిలో విగత జీవులై ఉన్న మహిళలను ఎంతో ఆతృతతో, ఆవేదనతో చూస్తాడు.సుమన కనబడి అశోకునికి ఇలా హితోపదేశం చేసింది ” బంధు ప్రీతితో నీవు నీ వదిన మరణించినదని అల్లాడిపోయావు. ఇన్ని వేల మంది స్త్రీలు తమ భర్తలను, భర్తలు భార్యలను పోగొట్టుకుని వినిపిస్తున్నారు వారి మాటేమిటి ? నీ వంటి మనుష్యులే కదా ! ఎందుకీ మరణహోమం ? ఎవరిని పరిపాలిస్తావు ? మనుష్యు జన్మనెత్తి మానవులను వధించడం మహాపాపం. ఇక్కడితో మారణకాండను ఆపి ప్రజాపాలన సాగించు. నీవల్ల చిధ్రమైన బ్రతుకులను ఉద్ధరించడమే పరమావధిగా భావించు.”

ఈ మాటలు అశోకుణ్ణి ఎంతగానో కదలించాయి.గతంలో భిక్షు సంఘాలతో గల సాన్నిధ్యం, భిక్షువులు చెప్పిన హిత బోధనలు గుర్తుకు వచ్చాయి. దీంతో అశోకునిలో ధమ్మ పరివర్తన మొదలైంది. బౌద్ధ ధమ్మమే శరణ్యం అని భావించి అశోకుడు క్రీ.పూ.260 లో ఉపగుప్తుడు అనే బౌద్ధ భిక్షువు ద్వారా మన దేశంలో ఉన్న బౌద్ధ క్షేత్రాలను దర్శించుకున్నాడు.

అశోకుడు బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకారం : అశోకుడు క్రీ.పూ.260 లో ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు దశమి రోజున సముద్రుడు, యశస్సుడు, పిండోల భరద్వాజుడు మొదలగు బౌద్ధ భిక్షువుల సమక్షంలో బౌద్ధ గురువు భిక్షువు ఉపగుప్తుడు(మొగ్గలి పుత్త తిస్స) చేతుల మీదుగా బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించాడు.అశోకుడు బౌద్ధంపై మక్కువ కనబరచడం వెనుక తన భార్య విదిశా దేవి ప్రభావం కూడా ఉంది.

తథాగత బుద్ధుణ్ణి అశోకుడు ది లార్డ్(ప్రభువు) అంటూ మనస్ఫూర్తిగా కీర్తించాడు.బౌద్ధ ధమ్మంలో అశోకునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చరిత్రకారుడు బండార్కర్ అశోకుడు “బౌద్ధ ధమ్మ పోషకుడు మాత్రమే కాదు-యదార్థమైన ప్రవక్త” అని కొనియాడారు.అశోకుని మీద తన తాత చంద్రగుప్త మౌర్యుడు యొక్క జైన మత ప్రభావం-తండ్రి బిందుసారుని ప్రభావం ఎంతగానో ఉంది. అశోకుడు గొప్ప యోధుడు, విజేత,పరిపాలన దక్షుడుగా ఆనాడు ప్రజల మన్ననలు పొందాడు.

“నేను భోజనం చేస్తూ ఉన్నా, లేదా అంతఃపురంలో ఉన్నా., లేదా శయ నగారంలో ఉన్నా…, లేదా ఉద్యాన ఉన్నా వనంలో ఉన్నా..! నడకలో ఉన్నా, లేదా స్వారీపై ఉన్నా… లేదా ఏదైనా చేస్తూ ఉన్నా., అన్ని చోట్ల, అన్ని వేళల్లో ప్రజల ఫిర్యాదులను నాకు తెలియచేయాలి..!” అని సామ్రాట్ అశోకుడు తన ప్రజలకు గొప్ప ప్రవచనాన్ని ఇచ్చారు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్న గొప్ప బౌద్ధ చక్రవర్తి అశోకుడు. నేడు పాఠ్య పుస్తకాలలో విద్యార్థులకు మహా సామ్రాట్ అశోకుని గురించి పాఠ్యాంశంగా లేకపోవడం శోచనీయం.ప్రపంచంలో ఎక్కడా తన ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుని గురించి దాచరు.కానీ మనదేశంలో మాత్రం సామ్రాట్ అశోకుడు గురించి అసలైన చరిత్రను అందకుండా చేయడం ఓ కుట్ర.మనదేశంలో కల్పిత కథలకు ఇచ్చిన ప్రాథాన్యత నిజ చరిత్రకు ఇవ్వకపోవడం చాలా అన్యాయం.అశోకుడు ప్రపంచ దేశాలకు ఆదర్శ పాలకుడు.భారతీయ చరిత్రలోనే చారిత్రక ఆధారాలు ఉన్న ఏకైక బౌద్ధ చక్రవర్తి అశోకుడు.

అశోకుని తన 12 వ శిలా శాసనంలో మాటలను చూడండి.. అశోకుడు ఎంతటి మహామానవీయుడు, పరమతసహనం గలవాడు అనేది మనకు అర్థం అవుతుంది..”సాధారణంగా తమ మత సంప్రదాయాలపట్ల తీవ్ర ఆసక్తి వున్నవారు ,తమ మతాలను ప్రచారం చేసుకోవడం ,తమ మతాలను అతిగా పొగుడుకొని ఇతర మత సాంప్రదాయాలను అవహేళన చేయడం చూస్తుంటాం. ఇది అధమమైన పద్ధతి. దీనికి బదులు ,ప్రతి మత సాంప్రదాయ అనుయాయులు తమతమ మత సాంప్రదాయాల తాత్విక ,ఆధ్యాత్మిక వికాసం కొరకు కృషి చేయడం ఉత్తమం.అందరూ ఈ సంస్కృతిని అలవర్చుకో గలిగినప్పుడు,భిన్న మత సాంప్రదాయాల మధ్య సామరస్య పూర్వక సంభాషణ , గౌరవప్రద సహజీవనం నెలకొంటుంది.ఏ సమాజానికైనా ఇదే అత్యుత్తమ స్థితి.”

⛩️అశోకుడు- బౌద్ద ధమ్మ పోషణ☸️

🌹మొగ్గలి పుత్త తిస్స మార్గదర్శకంలో ఉపగుప్తుని వద్ద అశోకుడు బౌద్ద ధమ్మాన్ని స్వీకరించాడు.

🔱త్రిపీటకాలలోని 84000 ధమ్మ సూత్రాలను ఎనభైనాలుగువేల స్థూపాలలో ప్రతిష్ఠించారు.

💐కరుణ,మైత్రి,ముదిత, ఉపేక్ష లను అనుసరించి అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేశాడు.

👉అశోకుడు ప్రపంచంలోనే మొదటగా…రహదారులు నిర్మించాడు, రహదారులకు ఇరువైపుల చెట్లను నాటించాడు,.

🌲ఔషధ మూలికల చెట్లను నాటించాడు.

🌹మనుషులకు,పశువులకు ఆసుపత్రులు కట్టించాడు.

🌷24 గంటలు తెరచి ఉంచబడే ఉచిత మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేశాడు.

🌾థేరతిస్స వద్ద అశోకుడు బౌద్దసారం గ్రహించి నిజమైన భిక్ఖులతో మహాసభను ఏర్పరిచాడు.

☸️1000 మంది భిక్ఖులతో మొగ్గలి పుత్త తిస్స ఆధ్వర్యంలో బౌద్ధ సంగీతిని ఏర్పరిచాడు.

🪷మిగిలిన భిక్ఖులు దాదాపు 18 బౌద్ధ శాఖలుగా విడిపోయి ధమ్మ ప్రచారం చేశారు.

☘️ధమ్మ ప్రచారం ఎలా జరిగేది తెలుసుకోవడం కోసం ధమ్మ మహామాత్రలను నియమించాడు.వీరిని వివిధ దేశాలకు ధమ్మ ప్రచారం కోసం పంపించాడు.

🌼పంచవార్షిక సభలలో చర్చలు జరిగేవి. భిక్ఖులు ,అరహంతులు పాల్గొనేవారు.

🌺అశోకుడు సంఘానికి తన రాజ్యాన్ని సమర్పించి, తర్వాత సంఘానికి ధనం ఇచ్చి తన రాజ్యాన్ని తీసుకునే వాడు.

🍀పంచశీలను అనుసరించి యజ్ఞ యాగాదులలో జంతుబలిని నిషేధించాడు.జీవేణి జీవన పుసితయే ( జీవం మరో జీవంతో పోషణ జరుపుకోకూడదు) అని ప్రకటించాడు.

🌸పాలన ద్వారా కొన్ని సంవత్సరాలు, లేదా రెండు మూడు తరాలకు మంచిని అందించవచ్చు..అదే ఉత్తమ ధమ్మం ద్వారా వేలాది సంవత్సరాలు ప్రజలలో సత్ప్రవర్తన నిలపవచ్చని బౌద్ధం వ్యాప్తికి కృషి చేశాడు.

👉సామ్రాట్ అశోకుడు సత్పరిపాలన సాగించిన రాజు : సత్పరిపాలన సాగించే రాజు గురించి జాతకమాలలో యిలా ఉంది:

స్నేహం,సౌభ్రాతృత్వం అతని బలం,సైన్యం కాదు; అతనికి కోపం అంటే తెలియదు,పరుష వాక్యాలు పలుకడు;అతను సత్ర్పవర్తనతో తన రాజ్యాన్ని పాలిస్తాడు. కానీ రాజకీయ చతురతతో కాదు.

“సుగుణశీలురైన వారిని ఆదరించడానికి అతనికి సంపద ఉపయోగగించ బడుతుంది.” అశోక చక్రవర్తి అటువంటి ఆదర్శాలను పాటించాడని నిస్సంశయంగా చెప్పవచ్చు. తన మాటల్లో,చేతల్లో,కూడా ఆయన తన ప్రజలను సుఖశాంతులతో పాలించడానికి ప్రయత్నించాడు.అశోకుని శిలాశాసనంలో యిలా వ్రాసి ఉంది.

సత్యం,చిత్తశుద్ధి,దయ,కరుణ,దాన శీలతలను ఆచరించటం ద్వారానే ధర్మం వ్యాప్తి చెందుతుంది…..
“ప్రజలంతా నా పిల్లల వంటివారే.వారి యోగ క్షేమాలే నా ఆశయం….ధర్మమార్గంలోనే పరిపాలన,ధర్మంతోనే సంరక్షణ అనేదే శాసనం.”

అశోకచక్రవర్తిని మించి భారతావనికి సేవచేసిన వ్యక్తి మరొకరు లేరు.

అశోకుని ఇద్దరు పిల్లలు
సంఘమిత్ర,మహేంద్రలను బౌద్ధధర్మ వ్యాప్తికి భిక్ఖువులను చేసి ప్రపంచదేశాలకు పంపాడు.

అశోకుని గూర్చి ఇంతగొప్పగా చరిత్ర చెప్పుతుంటే … ఏ ఒక్క నాయకుడు ఇతని గూర్చి అతని త్యాగాల గురించి,మానవతవిలువల గూర్చి ఎవ్వరు మాట్లాడరు.

సమాజానికి కీడుచేసిన వారు, కుటుంబాన్ని నాశనం చేసినవారు దేవుళ్ళని,దయ్యాలని వల్కబోస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు….కులాన్ని,మతాన్ని ప్రబోధిస్తున్న వారిని ఆదర్శవాదులుగా చూపుతున్నారు. ఇది సమాజానికి ఎంతమాత్రం మంచిదికాదు.

👉మనదేశంలో బౌద్ధం ఎలా అంతరించింది:

భారతదేశంలో కనుమరుగైన బౌద్ధ ధమ్మాన్ని నెలకొల్పిన రోజు ఈరోజు.క్రీ.పూ.100 వ శతాబ్దంలో బ్రాహ్మణ పాలకుడు పుష్యమిత్ర శుంగుడు మౌర్య పాలకుడైన అశోకుని మనమడు బృహద్రధుని హత్య చేసాడు. బౌద్ధ ధమ్మాన్ని భారతదేశంలో లేకుండా చేయాలని బౌద్ధ భిక్ఖువుల తలలను నరికించాడు.ఒక్కో బౌద్ధ భిక్ఖువు తల నరికి తీసుకుని ఇచ్చిన వారికి ఒక్కో బంగారు నాణాన్ని ఇస్తానని ప్రకటించాడు.బౌద్ధ విహారాలను బ్రాహ్మణ మత దేవాలయాలుగా మార్చాడు.బౌద్ధ స్తూపాలను చెక్కించేసి శివలింగాలుగా చేయించాడు.భారతదేశ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసారు. ఎక్కడ కూడా బౌద్ధ ఆనవాళ్లు, బౌద్ధ చక్రవర్తులు ఉండకుండా ఈ దేశంలో మారణహోమం సృష్టించారు.ఆనాడు ఈ మారణహోమం చూసి మానవతావాదులైన లక్షలాది బౌద్ధ భిక్ఖులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర దేశాలకు వెళ్ళారు. అలా మనదేశంలో బౌద్ధం అంతరించింది.బ్రాహ్మణ మనువాదుల హత్యలు వలన బౌద్ధం ఈ నేలపై కనుమరుగైపోయింది.అసమానతలు, దోపిడీ, మూఢనమ్మకాలు, దుర్మార్గపు చట్టాలు గల మనుస్మృతి అనే రాజ్యాంగాన్ని పుష్యమిత్ర శుంగుడు అమలు చేయించాడు.ఈ మనుస్మృతిని బ్రాహ్మణ మనువాదులు ఈ దేశంలో అమలు జరిపి తమ దోపిడీ యథేచ్ఛగా కొనసాగించాలని,తమను దైవ స్వరూపులుగా సమాజం పరిగణించాలని ఆశించారు.అందుకోసం దయ ,జాలి అనేది లేకుండా, శ్రమ చేయకుండా, ఎలాంటి శారీరక శ్రమలో, ఉత్పత్తి లో పాలుపంచుకోకుండా సర్వ సౌఖ్యాలు పొందడం కోసం, మెజారిటీ ప్రజలపై ఆధ్యా‌త్మిక ,సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, వ్యాపార ఇలా అన్ని రంగాలలో తమ మాటే చెల్లుబాటు అయ్యే వివిధ విధంగా ,తమ ఆధిపత్యాన్ని శాశ్వతంగా కొనసాగించడానికే మనుస్మృతి ,దేవుడు, వేదాలు, ఉపనిషత్తులు ,భారత ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీత, రామాయణం, జ్యోతిష్య, వాస్తు వంటివి తమకు అనుకూలంగా రచించి వాటికి దైవత్వం జోడించడం ద్వారా ప్రజలను భయపెట్టి, లోభరుచుకుని, సెంటిమెంట్ పేరుతో, మూఢత్వం అలవరచి,ప్రజలను మానసిక బలహీనులను చేసి దోచుకోసాగారు.ఇప్పటికీ ఈ దోపిడీ మనదేశంలో కొనసాగుతోంది. ఈ దోపిడీ బలహీనులపై దుర్మార్గులు, క్రూరులు, మూర్ఖులు,మానవత్వం లేని ఫాసిస్టులు,ఏ మాత్రం మనుషులు కాని దగాకోరులు కోరుతుంటారు.ఇది తమ జ్ఞానం అంటూ ,తెలివి అంటూ ఏ మాత్రం సిగ్గు లజ్జా లేకుండా ప్రకటించుకుంటారు.ఇలాంటి దుర్మార్గపు మనుస్మృతి పైనా ,అసమాన పునాది గా గల బ్రాహ్మణ వైదిక మతం చేస్తోన్న అమానుషంపైనా మన దేశంలో తిరుగుబాటు వచ్చింది. పుష్యమిత్ర శుంగుడు కన్నా ముందు ఈ దేశంలో మనువాద భావవాద సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ చార్వాకులు,లోకాయతులు‌‌,నాస్తికులు తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత జైనం వచ్చింది. బౌద్ధం వచ్చి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ను ,జీవన విధానాన్ని అందించింది.

“భారతదేశ చరిత్ర అంటే బ్రాహ్మణులు – బౌద్ధులు మధ్య జరిగిన సంఘర్షణ” అని ప్రపంచ మేధావి డా.బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు.ఈ మాటను చరిత్ర కారులు ఎక్కడా ప్రస్తావించరు.ఈ కోణంలో అసలైన చరిత్ర లభిస్తుంది కాబట్టి ఇది వ్రాయకుండా తారీఖులు,దస్తావేజులతో మసిపూసి మారేడు కాయ చేసే పనికి పూనుకున్నారు చరిత్ర కారుల ముసుగులో ఉన్న అవకాశవాదులు,మనువాదులు.

చరిత్రలో మనువాదులు గుప్తుల కాలం స్వర్ణయుగంగా చెబుతూ చరిత్ర ను దాచేపని చేశారు. చరిత్ర ను చరిత్ర గా కాకుండా కుట్రపూరితంగా లిఖించారు.బాబాసాహెబ్ అంబేడ్కర్ అసలైన చరిత్ర గురించి ఈ విధంగా చెప్పారు.”భారతదేశ చరిత్రలో సమున్నత స్వాతంత్య్రం ,ఔన్నత్యం, వైభవం,వెల్లివిరిసిన కాలం ఒకే ఒక్కటున్నది.అది మౌర్య సామ్రాజ్యం,మహోజ్వలంగా వెలుగొందిన కాలం.మిగిలిన రాజ్యాల,రాజుల పాలనా కాలమంతా దేశం పరుల చేతిలో పరాజయాలతోను,పలు రంగాలలో గాఢాంధకారంలోను మ్రగ్గిపోయింది.అట్లే కొంతవరకు చాతుర్వర్ణ వ్యవస్థ నిర్మూలించబడి,బహుజనులుగానున్న శూద్రులు వారి స్వశక్తితో రాజ్యపాలకులైన కాలం మౌర్యుల పాలనా కాలంలో మాత్రమే.”

మౌర్య సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి మనువాదులు సమయం కోసం వేచి చూసారు.మౌర్యుల చివరి పాలకుడైన బృహద్రధుడు అసమర్థత గల పాలకుడు కావడంతో అతణ్ణి పుష్యమిత్ర శుంగుడు హత్య చేసాడు.

పుష్యమిత్రుని విప్లవం కేవలం రాజకీయ పరమైనది కాదు. బౌద్ధాన్ని నాశనం చేసి బ్రాహ్మణ ఆధిపత్యం కొరకు చేసినది.

పుష్యమిత్ర శుంగుడు బౌద్ధ సన్యాసులకు వ్యతిరేకంగా ఒక్కో భిక్షువు తలకు 100 బంగారు నాణాలను వెలకట్టి బౌద్ధ భిక్షువులను చంపించాడు. ఈ విధంగా ప్రజలను భయ బ్రాంతులను చేసి బౌద్ధాన్ని విడనాడేలా చేసాడు.

పుష్యమిత్ర శుంగుడు పరిపాలనలో నాలుగు కులాలు బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు ( రెడ్డి, కమ్మ , వెలమ, కాపు, SC,BC,ST మొదలగు వారు శూద్రులు ). కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేసి సుమతి భార్గవుడు చేత మనుధర్మ శాస్త్రాన్ని క్రీ.పూ.170 నుంచి క్రీ.పూ.150 సం.మధ్యలో రచింపజేసి మనుధర్మ శాస్త్రం ప్రకారం పరిపాలన సాగించాడు.

You may also like...

Translate »