శ్రీ నారాయణ గురు 169 వ జయంతి

మహర్షి నారాయణ గురు గురువులకే గురువు


పరమపూజ్య నారాయణ గురు దక్షిణ భారతదేశంలో నిమ్న జాతులను ఉద్ధరించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన నిస్వార్థ సంఘసేవకుడు.ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మహర్షి నారాయణ గురు.ఆధ్యాత్మికత అంటే పెద్ద పెద్ద భవంతులలో ఉంటూ పండ్లు ఫలాలు మెక్కడం,ఏసీ రూమ్ లలో కులకడం కాదు. ఆధ్యాత్మికత అంటే పైకి మనసు గురించి చెప్పడం రాత్రి అయితే శృంగార జీవితాన్ని పొందుతూ నీతిమాలిన పనులు చేయడం కాదు. ఆధ్యాత్మికత అంటే విలాసవంతమైన జీవిక కొనసాగిస్తూ కూడా సమాజ సేవకునిగా నటించడం కాదు. అసలైన ఆధ్యాత్మికత అంటే ముందు తాను ఆచరించాలి. చిత్తశుద్ధి కలిగి ఉండాలి రాగద్వేషమోహాలను త్యజించాలి.నిజమైన ముని కోవలోకి వస్తారు శ్రీనారాయణ గురు.కేవలం రాగద్వేషమోహాలను జయిస్తే సరిపోతూందా దుక్ఖితులు ,పీడితుల కోసం భారతదేశం లో ఉన్న నిమ్న జాతుల కోసం అవర్ణుల కోసం పనిచేయాలి.వాళ్ళు చదువు, కనీస సౌకర్యాలు గురించి, వాళ్ళ ఉపాధి కోసం మార్గం చూపాలి. చాలామంది దొంగ బాబాలు, దొంగ సన్యాసులు తాము సంఘం కోసం పనిచేసే వారి వలె పెద్ద ఫోజులు కొడుతుంటారు.ఇలాంటి దొంగల వలన నిమ్నజాతులకు ,వెనుకబడిన ఒబిసి లకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇలాంటి దొంగ బుద్ధి గల దొంగ స్వాములు, బాబాలను తన్ని తరమాలి.

మహర్షి నారాయణ గురు గొప్ప జ్ఞాని.ఆయన గురించి భారతీయులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో ఇలాంటి మహనీయుణ్ణి గురించి పాఠ్యాంశంలో పెట్టాలి.ఇలాంటి వాళ్ళ గురించి బోధించకుండా ఏవేవో కల్పిత కథలు చెప్పడం వలనే పిల్లల్లో సామాజిక స్పృస ,దయ ,కరుణ ,సమత వంటి భావాలు కానరావడం లేదు. అభ్యుదయం ముసుగులో ఉన్న అకడమిక్ మేధావులు, రచయితలు కళ్ళు తెరవాలి.నారాయణ గురు గురించి తప్పనిసరిగా పాఠ్యాంశం లో బోధించాలి.ఒక్క నారాయణ గురు గురించి మాత్రమే కాదు.బుద్ధ, ఫూలే, ఛత్రపతి సాహూమహారాజ్, శివాజీ, అంబేడ్కర్, బిర్సా ముండా ,ఫూలన్ దేవి ,కబీర్, రవిదాస్ ,మహావీరుడు వంటి మహనీయుల గురించి పిల్లలకు బోధించాలి.

మహర్షి నారాయణ గురు వట్టి పిట్ట కథలు చెప్పలేదు. బతుకు దెరువు చూపిన మార్గదాత. కొంతమంది పిట్టకథలు చెబుతారు. ఆకలి బాధను తీర్చరు.ఒకరోజున జరిగిన యదార్థ సంఘటన మీకు తెలియజేస్తాను. ఒక ముసలి అవ్వ తన కూతురితో ఒక గుట్ట మీద జీవిస్తూ ఉండేది. దుర్భరమైన పేదరికంలో వాళ్ళు ఉండేవారు. నారాయణ గురుకు బెస్తలు పచ్చి చేపలు కానుకగా ఇస్తుండేవారు.ఆ చేపలను ఆ అవ్వకు ఇచ్చేవారు. అవ్వ ఆ చేపలు వండి నారాయణ గురుకు కూడా అన్నం పెట్టేది.నారాయణ గురు ఆమె మంచి మనస్తత్వానికి మెచ్చి వాళ్ళకు ఒక దారి చూపాలని అనుకుంటారు.నారాయణ గురు కొబ్బరి పీచు నుండి నార ఎలా తీయాలి ,తీసిన ఆ నారను అల్లడం ఎలాగో ఆ ముసలి అవ్వకు,ఆమె కూతురికి నేర్పించారు.ఈ విధంగా వాళ్ళు ఆ నారను అమ్ముకుని జీవనం సాగించేవారు.స్వల్పంగా అయినా వాళ్ళకు ఒక ఆదాయ మార్గం నారాయణ గురు చూపెట్టారు. 1888 ఫిబ్రవరి 10 న తన జీవిత సందేశాన్ని ఒక శిలాఫలకం పై ఇలా లిఖితపూర్వకంగా వ్రాయించారు:”ఇక్కడ ఒక ఆదర్శ మందిరం నెలకొన్నది.ప్రజలు అన్నదమ్ముల వలె మనుగడ సాగిస్తారిక్కడ.కుల సంకోచ అనర్థాలకు తావేదీ ఇక్కడ.మత వైషమ్య మౌఢ్యానికి ఇక చోటేలేదిక్కడ.”

మహర్షి నారాయణ గురు ఈ ప్రపంచానికి కేరళ ఒక ఆదర్శంగా నిలవాలని భావించారు. నేడు చాలామంది నారాయణ గురు మా గౌడ కులం అంటూ ఆయన ఫోటోలు పెట్టుకుని మావాడు అంటున్నారు. వాస్తవానికి బహుజన నాయకులు ఈ ఉత్పత్తి కులాలకు చెందిన మహనీయులను వెలికి తీసి మనకు పరిచయం చేసారు.వాళ్ళు మనకు ఎందుకు పరిచయం చేసారంటే మనలో కుల సంకెళ్ళు తెంచుకుని సమతా భావనతో రాజ్యాధికారం తెచ్చుకుంటారని ,బ్రాహ్మణ మనువాదులకు తొత్తులుగా మారకుండా ఆత్మ(స్వాభిమానం) గౌరవంతో జీవించాలని వారు భావిస్తుంటే మన వాళ్ళు మా యాదవుడు ,మా కాపు ,మా బిసీ అంటూ మనువాదులుగా మారుతున్నారు.మహనీయులను కూడా తమ స్వార్థ ఆధిపత్య రాజకీయ పదవులు కోసం, అధికారం కోసం, చిన్న చిన్న పదవుల కోసం ఈ మధ్య వాడుకోవడం ఒక ఎత్తుగడగా చేసుకుంటున్నారు. మహనీయులు కులాన్ని వదులుకుని ,హిందూ మత మనువాద మత్తను వదులుకుని సమాజం కోసం పాటు పడ్డారు. కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉండదు కొందరు స్వార్థ పరులకు.ఎవరైతే మా కులం వారు ఫలానా మహనీయుడు అని ఫోజులు కొడుతున్నారో మీకు నిజంగా మనఃసాక్షి అనేది ఉంటే ఆ మసనీయుడి జీవిత చరిత్రలు, రచనలు తిరిగి ఫ్రింట్ చేయించండి. మీ కులం వాళ్ళకి పంచండి. వాళ్ళ బోధనలపై సభలు, సమావేశాలు పెట్టండి. వాళ్ళు ఏం చెప్పారు.ఎలా సమాజం కోసం త్యాగం చేసారు అనేది మీకే తెలియదు.దొంగ బుద్ధి కలిగి ఉండి మీ స్వార్థ రాజకీయ పదవుల కోసం, మీ పేరు కోసం మహనీయులను వాడుకోవడం ఏం బుద్ధి మీది.మనువాద రాజకీయ పార్టీల జెండాలు మోయడం ఏం భావదాస్యం ఇది.
“సకల మానవాళిది ఒకే కులం.ఒకే మతం , మానవుడికి ఒకే ఒక దేవుడు” అని మానవత్వం గురించి సందేశం ఇచ్చారు. ఎంతమంది తమ కులం పరిధి దాటి ఇతర కులాల వారిని పెళ్ళి చేసుకుంటున్నారు. మీ కులంలోనే అది కూడా కట్నాలు దోచుకుంటూ మీ వాళ్ళనే దోపిడీ చేసి పెళ్ళిళ్ళూ చేసుకుంటారు. మీరు ఆదర్శాలు వల్లిస్తారు.ఏం బతుకులు ఇవీ.

ఉత్పత్తి కులాలు వాళ్ళు తాగుడుకు బానిసలుగా మారడం వలనే తమ పిల్లలను చదివించడం లేదు.మద్యం మనిషిలో విచక్షణా జ్ఞానం లేకుండా చేస్తోంది. బుద్ధ భగవాన్ దగ్గర నుండి నేటి అంబేడ్కర్,కాన్షీరామ్ ల వరకూ మద్యం మహమ్మారి జోలికి వెళ్ళవద్దని బహుజనులకు చెప్పారు. అయినా మనవాళ్ళు మారడం లేదు. నారాయణ గురు 1912 నాటికే “మద్యమంటే విషం.దాన్ని ఎవరూ తయారు చేయకూడదు. అమ్మకూడదు.తాగకూడదు.” అని ప్రకటించారు. ఈ మధ్య బహుజనులలో కొందరు డబ్బులకు ఆశ పడి నాటు సారా తయారు చేస్తోన్నారు. ఈ నాటుసారా వలన మనిషి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది.మహర్షి నారాయణ గురు “నీలోనే నీవే స్వయంగా నిర్థారించుకో.పరిశీలించుకో.”అని బోధించేవారు.

మహర్షి నారాయణ గురు మట్టి నుంచి మానవులుగా పరివర్తన చేసారు.” ఒకే కులం ,ఒకే మతం ,మానవుడికి ఒకే దైవం” అంటూ వ్యాపార దృష్టి లేకుండా సమాజ హితం కోసం కృషి చేసిన అసలైన ఆధ్యాత్మిక గురువు నారాయణ గురు.నల్లా నారాయణ గురు గారిది నిశ్శబ్ద విప్లవం. ఎక్కడ నిమ్న జాతుల వారూ,పీడితులు ఉంటారో అక్కడ మహర్షి నల్లా నారాయణ గురు సందేశం ” స్వేచ్ఛగా బానిసలుగా కాకుండా స్వాభిమానం తో జీవించేందుకు విద్యావంతులను చేయి,శక్తివంతమైన వారిగా జీవించడానికి ఐక్యపరచు,ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పరిశ్రమలనాశ్రయించు.” అనేది నేటికీ ఆదర్శంగా నిలుస్తోంది.

మహర్షి నల్లా నారాయణ గురు గారికి పేదల పట్ల, నిమ్నజాతుల పట్ల సానుభూతి ఎక్కువగా ఉండేది. మనుషులను మనుషులుగా చూడాలని తపించారు.ఆయన మార్గం ఉన్నతమైనది.నారాయణ గురుకు అందరి వలె తన తల్లిదండ్రులు వివాహం చేసారు.అయితే ఆయనకు సంసార బంధాల పట్ల ఆసక్తి ఉండేది కాదు. పెళ్ళి అయినా కూడా ఆయన కాపురం చేయనే లేదు.” ఈ ప్రపంచంలో మనుషులు వివిధ గమ్యాలతో జన్మిస్తారు.వేరు వేరు లక్ష్యాలను ఆశిస్తారు.మీ దారి వేరు ,నా దారి వేరు.అవి ఒకటికావు.మీ మార్గాన్ని మీరు అనుసరించండి. మంచిదే.కాని నా మార్గాన నన్ను పోనివ్వండి.” అంటూ ఒకసారి నారాయణ గురు తన భార్య ఇంటికి తనకు పెళ్ళి సంబంధం కుదిర్చిన మధ్యవర్తి ఒత్తిడి వలన ఒకసారి మధ్యవర్తి తో తన భార్య వెళ్ళాల్సి వచ్చింది.అప్పుడు నారాయణ గురు ఈ విధంగా చెప్పి ,అక్కడి నుండి వెళ్ళిపోయారు.


✍️ అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రచారకులు & న్యాయవాది

You may also like...

Translate »