ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు

ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు
- సాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ గురుకులాల CoE (సెంటర్ అఫ్ ఎక్సలెన్స్) అమలుకు శ్రీకారం
- ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ సీట్లు సాధించేలా శిక్షణ
జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్ష డెస్క్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటీ, మెడిసిన్ ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అత్యధిక సీట్లు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా గురుకులాల పరిధిలోని 54 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ)లలో ఎనిమిదో తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు అందించనున్నారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. అలాగే గురుకులాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి విద్యార్థికి కనీసం రెండు గంటలు కంప్యూటర్ అందుబాటులో ఉంచాలని ఎసాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీలు నిర్ణయించాయి.

ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్
- రెగ్యులర్ పాఠాలతో పాటుగా ఫౌండేషన్ కోర్స్
- సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 8 ప్రీమియర్ ,32 నాన్ ప్రీమియర్ CoE ల్లో ప్రత్యేక శిక్షణ
- గిరిజన సంక్షేమ గురుకులాల్లో 14 CoE ల్లో ప్రత్యేక శిక్షణ
- ప్రతి విద్యార్థి పేరిట ప్రత్యేక లాగిన్ ఐడీ సదుపాయం
సీవోఈల్లో సీట్లకు డిమాండు అధికంగా ఉంది. ఇక్కడ విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరిన తరువాత చదువుతోపాటు ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కానీ విద్యార్థులపై ఒత్తిడి పెరిగి సీట్లు పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 2023-24 విద్యాసంవత్సరంలో పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని పాఠశాలల్లో ఎనిమిదో తరగతి నుంచి ఫౌండేషన్ కోర్సులతో శిక్షణ ఇప్పించేందుకు ఎస్సీ, ఎస్టీ సొసైటీలు ప్రణాళికను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 8 ప్రీమియర్ సీవోఈలు, 32 నాన్ ప్రీమియర్ సీవోఈలు ఉన్నాయి. అలాగే ఎస్టీ సొసైటీ పరిధిలో 14 కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచే రోజువారీ పాఠాలతోపాటు అత్యుత్తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపై ఫౌండేషన్ కోర్సులు బోధించనున్నారు. ప్రతి విద్యార్థి పేరిట ప్రత్యేక లాగిన్ ఐడీ సదుపాయాన్ని కల్పిస్తారు. దీంతో వారు ఎప్పుడైనా ఆన్‌లైన్లో చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. రెండేళ్లపాటు రూ.20 కోట్ల విలువైన ఆన్‌లైన్ కంటెంట్ ఉచితంగా అందించేందుకు ఓ కార్పొరేట్ సంస్థతో గురుకుల సొసైటీలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రతి పాఠశాలలో అవసరమైన కంప్యూటర్లను సొసైటీ సమకూర్చుతోంది. పలు కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంప్యూటర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

