జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత పరిశోధన విద్యపై ప్రభావం చూపుతున్నది. తగినంత మంది ప్రొఫెసర్లు లేక పరిశోధనలకు గైడెన్స్ కరువైంది. ఫలితంగా అసలు పరిశోధనలే మూలనపడ్డాయి. ఇప్పుడు ఇదే సాకుతో ఉస్మానియా, జేఎన్‌టీయూ వంటి కొన్ని యూనివర్సిటీలు ప్రైవేటు పరిశోధనలపై మొగ్గు చూపుతున్నాయి. పరిశోధనల కోసం ప్రైవేటు కాలేజీలలో ఐఐటీ, ఎన్‌ఐటీలలో పీహెచ్‌డీలు పూర్తిచేసి, ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారితో గైడెన్స్ పొందాలని చూస్తున్నాయి. ఈ మేరకు సర్కారీ వర్సిటీల పరిశోధన బాధ్యతలు ప్రైవేటు కాలేజీ ప్రొఫెసర్ల చేతుల్లో పెట్టబోతున్నారు. ఈ మేరకు ప్రైవేటు అఫిలియేషన్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్లతో జేఎన్‌టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
దీంతో భవిష్యత్తులో ప్రమాదం నెలకొనే అవకాశం ఉన్నదని సీనియర్ ప్రొఫెసర్లు హెచ్చరిస్తున్నారు. జేఎన్‌టీయూ సహా కొన్ని వర్సిటీలు తమ విద్యార్థుల పరిశోధన బాధ్యతలను ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ప్రొఫెసర్ల చేతుల్లో పెట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు అఫిలియేషన్ కాలేజీలు, ప్రైవేటు వర్సిటీలతో ప్రభుత్వ యూనివర్సిటీలు విలవిల్లాడుతున్నాయి. ఇలాంటి స్థితిలో యూనివర్సిటీల్లో జరగాల్సిన పరిశోధనలు కూడా ప్రైవేటుబాట పడితే ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో జేఎన్‌టీయూ ఒక అడుగు ముందుకేసి కొత్త పంథాను అవలంబిస్తున్నది. ప్రైవేటు అఫిలియేషన్ ఇంజినీరింగ్ కాలేజీల ప్రొఫెసర్లతో సంప్రదింపులకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది.
ప్రొఫెసర్ పోస్టులు ఇప్పట్లో భర్తీకావని భావించిన జేఎన్‌టీయూ.. పరిశోధన విద్యపై ముందుకే సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఆ వర్సిటీలో పరిశోధన విద్యార్థులకు అనుగుణంగా, గైడెన్స్ ఇచ్చే సీనియర్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు తగ్గిపోయారు. దీనికోసం ప్రైవేటు అఫిలియేషన్ ఇంజినీరింగ్ కాలేజీలపై ఆధారపడుతున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీలలో పీహెచ్‌డీలు పూర్తిచేసి, ప్రస్తుతం ప్రైవేటు అఫిలియేషన్ ఇంజినీరింగ్ కాలేజీలలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి సహాయం పొందబోతున్నారు.
వారిచ్చే అంగీకారం ప్రకారం జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ సీట్లను పెంచుకోవాలని ఆ యూనివర్సిటీ యాజమాన్యం భావించిందని ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీల ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి విడుదలయ్యే పీహెచ్‌డీ నోటిఫికేషన్‌లో కనీసం 150 సీట్లకు తగ్గకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలన్న ఆలోచనలో తామున్నామని డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 12 వర్సిటీలలో 2,060కి పైగా ప్రొఫెసర్లతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని వర్సిటీలలో అసలు ప్రొఫెసర్లే లేకపోవడం గమనార్హం. వర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత చాలా తీవ్రంగా ఉన్నదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. కొన్ని వర్సిటీలు పరిశోధన విద్యార్థుల కోసం ప్రైవేటు కాలేజీల ప్రొఫెసర్లను ఆశ్రయిస్తున్నాయని, సొంత వర్సిటీలలో మానవ వనరులను పెంచుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీలపై ఆధారపడితే మున్ముందు చెడు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.