రిమైండర్ :ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు

రిమైండర్ :ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు


2024-25 నుంచి కేంద్ర సహాయం అమలు
పదో తరగతి మెమో, ఆధార్‌ పేరు సరిపోలాల్సిందే
కేంద్రం మార్గదర్శకాలతో దరఖాస్తు విధానంలోనూ ఎస్సీ సంక్షేమశాఖ మార్పులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాలు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్రం మార్గదర్శకాలతో దరఖాస్తు విధానంలోనూ ఎస్సీ సంక్షేమశాఖ మార్పులు చేసింది. ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు మాత్రం పూర్వవిధానంలోనే దరఖాస్తు చేయాలి. కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి ఎస్సీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాల నిబంధనలు మార్చింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు జమ చేస్తే.. కేంద్రం 60% మంజూరు చేస్తుంది. ఈ నిబంధనలకు రాష్ట్రంలోని నాటి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఏటా రూ.250 కోట్ల చొప్పున మూడేళ్లుగా దాదాపు రూ.750 కోట్లు కోల్పోయింది. 2024-25 నుంచి కేంద్ర సంస్కరణల అమలుకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఏటా ఇంటర్, ఆపై ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న 2.6 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుంది.

ఈ-పాస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు:
ఎస్సీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ-పాస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. 2024-25లో కొత్తగా చేరిన, అప్పటికే చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయాలి.
– తొలిదశలో డెమోగ్రాఫిక్‌ మ్యాచింగ్,
– రెండోదశలో బయోమెట్రిక్‌ ఆథెంటికేషన్‌..
– మూడో దశలో దరఖాస్తు పూర్తి చేయాలి.డే స్కాలర్, కళాశాల అనుబంధ హాస్టళ్ల విద్యార్థులు ఇదే తరహాలో పూర్తి చేయాలి.

దరఖాస్తు చేయు విధానం:

డెమోగ్రాఫిక్‌ ఆథెంటికేషన్‌ కోసం ఆధార్‌లోని పేరు, పదో తరగతి ధ్రువీకరణ పత్రంలో పేరు సరిపోలాలి. టెన్త్‌ హాల్‌టికెట్‌ నంబరు, పుట్టినతేదీ, ఉత్తీర్ణత సాధించిన ఏడాది, రెగ్యులర్‌/ప్రైవేటు వివరాలు నమోదు చేయాలి.
విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ ప్రత్యక్షమవుతాయి. జెండర్, కులం, ఉపకులం, ఆధార్‌ నంబరు, మొబైల్‌ నంబరు, చదువుతున్న యూనివర్సిటీ/బోర్డు, కళాశాల పేరు, ఊరు నమోదు చేసి.. సబ్‌మిట్‌ చేయాలి.
అనంతరం డెమో ఆథెంటికేషన్‌ జరుగుతుంది. ఆధార్‌.. టెన్త్‌ వివరాలు సమానంగా ఉంటే.. విజయవంతమైనట్లు మెసేజ్‌ వస్తుంది. డెమోగ్రాఫిక్‌ ధ్రువీకరణ ఫెయిలైతే ఆధార్‌లో ఆ మేరకు మార్పులు చేసి ధ్రువీకరించుకున్నాక దరఖాస్తు నంబరు వస్తుంది.
ఆ వివరాలతో మీ సేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్‌ ఆథెంటికేషన్‌ ఇవ్వాలి. అప్పుడే రెండోదశ దరఖాస్తు పూర్తవుతుంది.
బయోమెట్రిక్‌ పూర్తయిన తరువాత.. వివరాలు నమోదు చేస్తేనే దరఖాస్తు పూర్తవుతుంది. దీన్ని పరిశీలన కోసం కళాశాలలో అందించాలి.

You may also like...

Translate »