9వ తరగతి విద్యార్థులకు ఇస్రో స్వర్ణావకాశం

జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం(జ్ఞానదీక్షుచి):
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే అంతరిక్షంపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం “యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)” నిర్వహిస్తోంది. 2026 జనవరి 1 నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://jigyasa.iirs.gov.in/yuvika ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.
నమోదు అనంతరం నిర్వహించే ఆన్‌లైన్ క్విజ్‌లో సాధించిన మార్కులకు 10% వెయిటేజీ ఇస్తారు. 8వ తరగతి మార్కులకు 50%, ఎన్‌సీసీ/ఎన్‌ఎస్‌ఎస్‌కు 5%, సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనడంపై 10%, గ్రామీణ విద్యార్థులకు 15% వెయిటేజీ కేటాయించి తుది ఎంపిక చేస్తారు. తొలి జాబితా ఏప్రిల్ 13న, రెండో జాబితా ఏప్రిల్ 20న విడుదలవుతుంది.
శిక్షణ హైదరాబాద్, సూళ్లూరుపేట, తిరువనంతపురం, అహ్మదాబాద్, షిల్లాంగ్, దేహ్రాదూన్, బెంగళూరు కేంద్రాల్లో మే 11 నుంచి 22 వరకు నిర్వహించబడుతుంది. ఎంపికైన విద్యార్థుల భోజనం, వసతి, రవాణా ఖర్చులను ఇస్రో భరిస్తుంది. అంతరిక్ష సాంకేతికతలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఇస్రో, భవిష్యత్ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే దిశగా యువికా ద్వారా కీలక అడుగులు వేస్తోంది.
