రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్)–2026కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీసెట్ కన్వీనర్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 492 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అభ్యర్థులు ముందుగానే తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోవాలని సూచించారు.
పరీక్ష ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత వచ్చిన అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు అవసరమైన గుర్తింపు పత్రం తీసుకురావాలని, నిబంధనలు పాటించాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాలకు తీసుకురావడం నిషేధమని హెచ్చరించారు.
గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకునే వేలాది మంది విద్యార్థులకు ఈ పరీక్ష కీలకమని పేర్కొన్నారు. పరీక్షను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
