భారతదేశంలో అసలు చరిత్రను కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచారు. స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన సంఘ సంస్కర్తలు ,విప్లవకారులు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే దంపతులను మరుగున పరిచి ఎలా అయితే చరిత్ర కారులు వేటగాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పడం ప్రారంభించారో మహాత్మా జోతిరావు ఫూలేకూ ,చదువులతల్లి సావిత్రి బాయి ఫూలే కు అడుగడుగునా అండగా ఉంటూ తోడ్పాటును అందించిన షేక్ ఉస్మాన్ ఖాన్ -ఫాతిమా బేగం దంపతులను గురించి మనకు చరిత్రలో ఎక్కడ కనబడకుండా జాగ్రత్తలు పాటించారు ఈ చరిత్ర కారులు.ఎందుకంటే ముస్లింలు పట్ల ఈ చరిత్ర కారులకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. చరిత్ర కారునికి ద్వేషం, పక్షపాతం ఉండకూడదు.చరిత్రలో జరిగిన నిజానిజాలు తప్పనిసరిగా తెలియచేయాలి. అలా కాకుండా కుల కోణంతో ,ఆధిపత్య సంస్కృతి తో పక్షపాత ధోరణితో రచన చేస్తే అది చరిత్ర ఎలా అవుతుంది?
ఎవరీ షేక్ ఫాతిమా బేగం?
భారతీయ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని. భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే స్నేహితురాలు.సావిత్రిబాయి ఫూలే,మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతులు నడిపిన సామాజిక పరివర్తన ఉద్యమంలో చురుకుగా పనిచేసిన మహామానవీయురాలు షేక్ ఫాతిమా బేగం. షేక్ ఫాతిమా బేగం ఉపాధ్యాయిని మాత్రమే కాదు సామాజిక సేవకురాలు, సంఘ సంస్కర్త. ఈనాడు మనం వింటున్న బేటీ బచావో, బేటీ పడావో నినాదాన్ని ఇవ్వడమే కాకుండా అందుకోసం కృషి చేసిన ప్రపథమ భారతీయ ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం. ఆడపిల్లల రక్షణ కోసం, వారి అభివృద్ధి కోసం, ఆడపిల్లలకు చదువుల కోసం శూద్రులు మరియు అతిశూద్రులలో విద్యావ్యాప్తికి అహర్నిశలు కృషి చేసిన విద్యాదీప్తి షేక్ ఫాతిమా బేగం.
షేక్ ఫాతిమా బేగం జననం:
1831 వ సంవత్సరం జనవరి 8 వ తేదీన షేక్ ఫాతిమా బేగం మహారాష్ట్రలోని గంజి వాడిలో జన్మించారు.ఫాతిమా బేగం కట్లుబాట్లు గల ముస్లిం సమాజం నుండి వచ్చిన మహిళ.మహిళలలో మణిపూస షేక్ ఫాతిమా బేగం.ఆనాడు ముస్లిం సమాజంలో హైందవ సమాజంలో వలె ఛాందసత్వం,మహిళలపై ఆంక్షలు ఉండేవి. ఈ నేపథ్యంలో షేక్ ఫాతిమా బేగం ఆడపిల్లలకు చదువుకునే హక్కు కోసం, లింగ వివక్షత నిర్మూలన కోసం తన ఉద్యమ స్నేహితురాలు సావిత్రిబాయి ఫూలేతో కలిసి ఉద్యమాన్ని నడిపింది.ఈ ఉద్యమం ఆనాడు మహారాష్ట్రలోని పూనా పరిసర ప్రాంతాల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చింది.
మీకు తెలుసా ? మొట్టమొదటి పాఠశాల ఫాతిమా ఇంటిలోనే ప్రారంభమైంది.
ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే – చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే దంపతులు శూద్రులు మరియు అతిశూద్రులలో విద్యవ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఇది బ్రాహ్మణ పురోహితులు, ఛాందసవాదులకూ నచ్చలేదు. ఈ దంపతులు కుల ధర్మానికి, తమ హైందవ ఆచారాలకు వ్యతిరేకంగా అందరికీ చదువు చెబుతున్నారు అనీ ముఖ్యంగా సమాజంలో మెజారిటీ ప్రజలైన శూద్రులు, అతిశూద్రులలో విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నారు అనీ ఇలా చేయడం అంటే కులనాశనానికి, వంశ నాశనానికీ ఇది దారి తీసే ప్రమాదం పొంచి ఉందంటూ తొలుత బ్రాహ్మణులు ఫూలే దంపతులను బెదిరించారు.చివరకు ఫూలే తండ్రి గోవిందరావును కూడా బెదిరించి , ఫూలే దంపతులను ఇంట్లో నుండి బయటకు గెంటి వేయించారు.నాడు హిందూ సమాజంలో వివక్ష వలన మెజారిటీ ప్రజలు బానిసత్వంలో జీవించారు.బహుజనులకు చదువు లేదు,కులవృత్తులు చేసుకుని బానిసలుగా జీవించాలి.మూఢనమ్మకాలు ప్రజలకు అంటగడుతూ ,దేవుని పేరుతో బ్రాహ్మణ ధర్మం మెజారిటీ ప్రజలను దోపిడీ చేసింది.ఈ దుర్మార్గపు బ్రాహ్మణ భావజాలంపై ఫూలే దంపతులు తిరుగుబాటు చేశారు.ఈ నేపధ్యంలో మత పెద్దలు ఫూలేను సంఘబహిష్కరణ చేశారు.సమాజంలో అస్పృశ్యుల ఉద్ధరణ కోసం, ఆడవాళ్ళకి చదువుకునే హక్కు కోసం, శూద్రాతిశూద్రులకు విద్య కల్పించడం కోసం అలా ఫూలే దంపతులు రోడ్డున పడ్డారు.
ఫూలేను ఇంట్లో నుండి బయటకు గెంటేయాలని మతపెద్దలు ఫూలే తండ్రి పై ఒత్తిడి తేవడంతో ఫూలే ఇంటి నుండి తథాగత బుద్ధుని వలె ఇల్లు విడిచి పెట్టి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఫూలే ఇల్లు విడిచి పెట్టి రావడంతో ఎక్కడ జీవించాలో తెలియని కష్టాలు పడుతున్న ఈ సమయంలో సావిత్రిబాయి ఫూలే స్నేహితురాలు షేక్ ఫాతిమా బేగం ఫూలే దంపతులకు ఆశ్రమం ఇచ్చి,తన స్నేహాన్ని, ఉదారతను చాటుకుంది.ఫాతిమా సోదరుడు షేక్ ఉస్మాన్ వీరికి ఆనాడు అండగా నిలిచారు. ముస్లిం సమాజం ఈ విషయాలను గమనించాలి.అంబేడ్కర్ ఉద్యమాలకు కూడా ఆనాటి ముస్లిం సమాజం అండగా నిలిచిన చరిత్ర ఉంది. భారతీయ ముస్లింలు కూడా మూలనివాసులు, భారతీయులే.వీరు బయట నుండి రాలేదు. మనమంతా భారతీయులమే.
మహాత్మా జ్యోతిరావు ఫూలే మహిళలు కోసం పాఠశాల ఏర్పాటు చేసి మహిళలతోనే పాఠాలు బోధించాలని అందుకోసం మహిళా ఉపాధ్యాయినులను తయారు చేయాలని భావించి ఆనాడు అమెరికన్ మిషనరీకి చెందిన సింతియా ఫరార్ ఆధ్వర్యంలో నడుపుతున్న టీచర్ ట్రైనింగ్ కళాశాలకు షేక్ ఫాతిమా, సావిత్రిబాయి ఫూలేను పంపించి శిక్షణ ఇప్పించారు.మహాత్మా జ్యోతిరావు ఫూలే కోరిక మేరకు షేక్ ఫాతిమా బేగం 1848 వ సంవత్సరంలో తను ఉంటున్న ఇంట్లోనే పాఠశాల ప్రారంభించడానికి అంగీకరించింది. ఈ పాఠశాలకు “దేశీయ గ్రంథాలయం” అని పేరు కూడా పెట్టారు.సావిత్రిబాయి ఫూలే,ఫాతిమా బేగంలతో పాటుగా వీరి సహాధ్యాయిలు సుగుణాబాయి కూడా విద్యార్థినీ విద్యార్థులకు పాఠాలు బోధించారు.1856 వరుకూ వీరు ఉద్యమం నడిపారు.ఉర్ధూ భాషలో షేక్ ఫాతిమా బేగం కవిత్వం కూడా వ్రాశారు.ఆనాడే ఫాతిమా బేగం బహుజనులు మరియు ముస్లింలు ఒకే రక్త సంబంధీకులు అన్న వాస్తవాన్ని గుర్తించారు. ఈ దేశంలో ఉన్న ముస్లింలు ఎవరూ కూడా బయటి దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. భారతీయులే ఆనాడు బ్రాహ్మణ ధర్మం వలన వివక్షకు తట్టుకోలేక ఇస్లాం మతం స్వీకరించారు.మహారా ష్ట్రలో ఫాతిమా బేగం గురించి ఉర్ధూ పాఠ్య పుస్తకాలలో వివరించారు.
నాడు హైందవ మత ఛాందస వాదులు ఆడపిల్లలకు చదువు నిరాకరించారు. ఆడపిల్లలు చదువుకుంటే పనికిమాలినది అవుతుంది, బుద్ధిలేనిది అవుతుంది, చెడిపోతుంది, ఆడపిల్లల గడపదాటరాదు.గడపదాటితే అడ్డదారులు తొక్కుతారు అంటూ ఛాందసవాదులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇదే నిజమని చాలావరకు నమ్మేవారు ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల చదువుల కోసం షేక్ ఫాతిమా బేగం, సావిత్రిబాయి ఫూలే,సుగుణాబాయిలు చేస్తున్న ప్రయత్నాలు ఛాందస వాదులకు కంటగింపుగా మారాయి.షేక్ ఫాతిమా బేగం అయితే ముస్లిం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఇంటింటికి వెళ్లి చదువు యొక్క విలువ చెప్పేది.చదువులు గురించి కౌన్సెలింగ్ కూడా ఇచ్చేది.పాఠశాలకు రాని ఆడపిల్లలను ప్రోత్సహించి పాఠశాలకు తీసుకుని వచ్చేది.షేక్ ఫాతిమా, సావిత్రిబాయి ఫూలేలు ఆడపిల్లల చదువులు గురించి, అణగారిన వర్గాలు చదువుకోవాలని, ఆరోగ్యం కాపాడుకోవాలి అనీ, మంచి అలవాట్లు కలిగి ఉండాలి అనీ నైతిక విలువలు గురించి బోధించేవారు.దీంతో బ్రాహ్మణ పురోహితులు,ఛాందసులు షేక్ ఫాతిమా, సావిత్రిబాయి ఫూలేలను బెదిరించేవారు.వీరిని అవమానించేవారు.వీరు పాఠశాలకు వెళుతుంటే దారిలో ఛాందస బ్రాహ్మణ పురోహితులు వీరి బట్టల మీద పేడ నీళ్ళు జల్లేవారు.దీంతో ఈ ఇద్దరు మహిళా టీచర్లు తమతో పాటు సంచిలో మరో చీరను పట్టుకుని వెళ్ళి,పాఠశాలలో బురద,పేడనీళ్ళతో పాడైన చీరను మార్చుకుని శుభ్రమైన చీరను కట్పుకొని పాఠశాలలో పాఠాలు బోధించేవారు.ఓర్పు, సహనంతో షేక్ ఫాతిమా తన సోదరుడు షేక్ ఉస్మాన్ సహకారంతో , తన భర్త జ్యోతిరావు ఫూలే సహకారంతో ,ప్రోత్సాహంతో సావిత్రిబాయి ఫూలేలు విద్యాబోధన సాగించారు.షేక్ ఫాతిమా ముస్లిం కావడం వల్ల ఆమె ఇటు హిందూ మత ఛాందస వాదులు నుండి అటు ముస్లిం మత ఛాందస వాదుల నుండి తీవ్ర వ్యతిరేకత, అవమానాలు, చీదరింపులు ఛీత్కారాలను ఎదుర్కొనేది.సావిత్రిబాయి లాగే షేక్ ఫాతిమా బేగం కూడా ప్రశ్నించే స్వభావం గల ధీర వనిత.ముస్లిం మత పెద్దలు ఎందుకు అని బాలికలకు విద్యను నిషేధించాలని చూస్తున్నారు అని ప్రశ్నించేది. ఈమె కేవలం ముస్లిం సమాజంలో విద్యావ్యాప్తికి మాత్రమే కృషి చేయలేదు. ఆనాటి భారతీయ కుల సమాజాన్ని చూసి కుల నిర్మూలన చేయాలని, కులం లేని సమాజాన్ని నిర్మించాలని పోరాటం చేసింది. అలాగే లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసింది.షేక్ ఫాతిమా బేగం స్ఫూర్తితో కలకత్తాలో,పాట్నాలలో బేగం -రోకియా సఖావత్ హుస్సేన్ బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించారు.2011 వ సంవత్సరంలో మహారాష్ట్ర పాఠ్య పుస్తకాల పరిశోధనా సంస్థ షేక్ ఫాతిమా బేగం గురించి పాఠ్యాంశాన్ని చేర్చింది.
మహాత్మా జోతిరావు ఫూలేకు తన భార్య సావిత్రి బాయి ఫూలే ఉత్తరం వ్రాశారు.ఆ ఉత్తరం లో ఇలా ఉంది.జనవరి 9 ఫాతిమా బేగం జయంతి: “ఫాతిమా నాకు బాగా సహకరించారు.ఆమె సహాకారంతో నేను నా సేవా కార్యక్రమాలు కొనసాగించ గలిగాను.”
ఒక లేఖలో సావిత్రిబాయి మహాత్మా జ్యోతిరావు ఫూలేకు వ్రాసినది గనుక మనం చదివితే ఈ ఇద్దరు మహిళలు సమాజం కోసం, మహిళలల్లో విద్యా వ్యాప్తి కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో తపించారు అని తెలుస్తోంది. ఒకసారి సావిత్రిబాయి ఫూలే పుట్టింటికి వెళ్ళారు.సావిత్రిబాయి ఫూలే ఆరోగ్యం క్షీణించడంతో ఆమె తన భర్త జ్యోతిరావు ఫూలేకు లేఖ వ్రాసింది. పూణేలో ఫూలే దంపతులు పాఠశాలలు నడుపుతున్నారు. సావిత్రిబాయి ఫూలే వెళ్లి పాఠాలు బోధించాలి. ఆరోజుల్లో సామాజిక సేవ చేసే వాళ్ళు అరుదు. 1856 వ సంవత్సరం అక్టోబర్ 1౦ వ తేదీన ఈ విధంగా జ్యోతిరావు ఫూలేకు లేఖ వ్రాసింది : “నా గురించి బాధపడకండి.ఫాతిమాకు కూడా చాలా కష్టంగా ఉండే ఉంటుంది.కానీ ఆమె మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు.ఎలాంటి ఫిర్యాదులు చేయదు.” అని సావిత్రిబాయి ఫూలే ఆ లేఖలో వివరించారు. షేక్ ఫాతిమా గొప్ప మనసున్న మహిళ. భారతీయ సమాజంలో ఇలాంటి మహిళలు చాలా అరుదుగా ఉంటారు.ప్రత్యేక వ్యక్తిత్వం గల మహిళా షేక్ ఫాతిమా.. భారతీయ సమాజంలో బహుజనులలో విద్యావ్యాప్తికి చిత్తశుద్ధితో కృషి చేసిన మహిళా ఉపాధ్యాయిని ఆమె.భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయినిగా షేక్ ఫాతిమా చరిత్ర సృష్టించారు.ఈనాటి మహిళలు,ముస్లిం మహిళలు బహుజనులతో కలిసి, షేక్ ఫాతిమాను ఆదర్శంగా తీసుకొని సమాజ పరివర్తన కొరకు కృషి చేయాలి.భారతదేశంలో ముస్లింలకు ఆధునిక విద్య కోసం కృషి చేసిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కంటే ముందే షేక్ ఫాతిమా బేగం,షేక్ ఫాతిమా బేగం సోదరుడు షేక్ ఉస్మాన్ ఖాన్ స్త్రీ విద్య కోసం, నిమ్న జాతులలో విద్యా వ్యాప్తి కోసం పాటుపడ్డారు.ముస్లింలలో విద్యావ్యాప్తి కోసం వీరు కృషి చేశారు..
భారతదేశ ప్రప్రథమ మహిళా టీచర్ సావిత్రి బాయి ఫూలేతో కలిసి 19వ శతాబ్దంలో బడుగు బలహీన,పేద వర్గాలకు మరియు మహిళలకు చదువు నేర్పిన ముఖ్యంగా ఫూలే దంపతులకు అన్ని విధాలుగా తోడుగా ఉండిన సావిత్రిబాయి ఫూలే స్నేహితురాలు ఉపాధ్యాయిని ఫాతిమా బేగం గారి జయంతి ఈరోజు.ముస్లిం సమాజం ఫాతిమా బేగం కృషిని తెలుసుకోవాలి. మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం.ప్రభుత్వం సావిత్రి బాయి ఫూలే, ఫాతిమా బేగం పేర్లతో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలి.ఇంగ్లీషు విద్య ప్రాముఖ్యతను ఆనాడే ఈ మహిళా ఉపాధ్యాయినిలు గుర్తించారు.మన భారతీయ సమాజంలో మహిళలు ఎందరో సామాజిక పరివర్తన కొరకు కృషి చేసిన వారున్నారు. వారిలో స్వాతంత్ర్య పోరాటంలో వీరనారి ఝల్కారీ బాయి కోరీ ఒకరు.అలాగే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే ఈమెతో సమానంగా సామాజిక పరివర్తన కొరకు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఉద్యమంలో పాల్గొన్న మహిళ షేక్ ఫాతిమా. ఇలాంటి ఎందరినో చరిత్రలో కనుమరుగు చేశారు. ఇప్పుడు సత్యాన్ని సత్యంగా తెలుసుకొనే వారు పెరుగుతున్నారు.దాచబడిన చరిత్ర గురించి ఈనాటి విద్యార్థులు, యవత అధ్యయనం చేయాలి. విస్తృతంగా వీరి గురించి ప్రచారం చేయాలి. పాఠ్య పుస్తకాలలో సత్యాన్ని సత్యంగా చెప్పే పాఠాలు ఉండాలి. షేక్ ఫాతిమా, సావిత్రిబాయి ఫూలేల జీవితం, త్యాగం, పోరాటం గురించి కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలి.