సైబర్ నేరాలపై అవగాహన సదస్సు, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

పత్రిక ప్రకటన
తేది :05-06-2024
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలి లేదా https://cybercrime.gov.in/ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
జ్ఞాన తెలంగాణ జైనథ్ జూన్ 05:
జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరలపై అవగాహణ కార్యక్రమానికి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డి ఎస్ పి హసీబుల్లా హాజరై సాదారణ ప్రజలు అత్యాశ, అమాయకత్వం వలన సైబర్ నేరాలకు గురి అవుతున్నారని, ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ళు ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు.
మహిళలను ఎరచూపి వీడియో కాల్స్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారని ఇలాంటి వాటిపై వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు.
ఈ మధ్యకాలంలో పిల్లలు, యువత ఆన్లైన్ యాప్ ల ద్వారా లోన్లు తీసుకొని ఆ డబ్బులతో రమ్మీ గేమ్, ఇతర ఆన్లైన్ గేమ్స్
ఆడుతూ మోసపోతూ ప్రాణాలు తీసుకుంటున్నారని మీ పిల్లలు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలని, వారి ప్రవర్తన మరియు మొబైల్ ఉపయోగం పై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ బంధువులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరో తెలియని నేరస్థుడు సాంకేతికతను, ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్ల రూపంలో దోచుకుంటున్నారని అన్నారు.
ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి యుండి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డి ఎస్ పి హసీబుల్లా తో పాటు జైనథ్ సి ఐ డి. సాయి నాథ్, ఎస్ ఐ పురుషోత్తం, ఐటీ కోర్ టీం కానిస్టేబుల్ రియాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు