వర్షా కాలం అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్.

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)రాబోయే వర్శకాలన్ని దృష్టి పెట్టుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనాథికారి శశాంక్ అన్నారు. వర్షా కాలం దృష్టిలో పెట్టుకొని అధికారులు సమస్యల పై దృష్టి సారించాలని అన్నారు.అదే విధంగా
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి
సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి అన్నారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక వాతావరణ మార్పులపై (వర్షపాతం) అదనపు కలెక్టర్లు ప్రతీమా సింగ్, భూపాల్ రెడ్డి లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో మండల స్థాయి సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మండల స్థాయి సమావేశం నిర్వహించడానికి ముందు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నివాస ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు, రక్షిత మంచి నీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ జరపాలని, ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు ఏర్పడితే వెంటనే సరి చేసుకోవాలని సూచించారు. ఒక్కో ట్యాంకు వారీగా మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని, నివాస ప్రాంతాల నడుమ వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. ఎక్కడైనా నీరు నిలువ ఉంటే దోమల వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా ఆయిల్ బాల్స్ వేయించాలని అన్నారు. శానిటేషన్, తాగునీటి సరఫరా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు కల్పించినా, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా వారిని బయటకు వెళ్లేందుకు అనుమతించకూడదని తెలిపారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ తో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నందున, అవసరమైన చోట తక్షణ మరమ్మతులు జరిపించాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థకు ఆటంకం లేకుండా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. నివాస ప్రాంతాలకు కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీగా వ్యవహరించాలని, ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో స్పెషల్ ఆఫీసర్లుగా కేటాయించబడిన అధికారులు పరిశీలించి గ్రామాల వారీగా నివేదికలు సమర్పించాలని తెలిపారు. వరద నీటి ప్రవాహానికి రహదారులను దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందుగా గుర్తిస్తూ, తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దెబ్బతిన్న చెరువులు, చెక్ డ్యాంలు, కాల్వలు తదితర వాటి వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

You may also like...

Translate »