ప్రతి ఇంటి నుండి తడి, పొడి వ్యర్దాలు సేకరణ
ప్రతి ఇంటి నుండి తడి, పొడి వ్యర్దాలు సేకరణ జరగాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
జ్ఞాన తెలంగాణ, భూపాలపల్లి:

మున్సిపాలిటీ లో పారిశుద్ద్య కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం కలెక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హాలు నందు భూపాలపల్లి మున్సిపాలిటీలో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణపై మున్సిపల్, సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు శాఖల మధ్య సమన్వయ లేకపోవడం వల్ల పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదని అన్నారు. సింగరేణి సంస్థ పరిధిలోని అవాసాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత సంస్థదేనని స్పష్టం చేశారు.
పారిశుద్ధ్య. కార్యక్రమాలు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని, పారిశుద్ధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ప్రతి రోజు ఇంటింటి నుండి తడి, పొడి వ్యర్దాల సేకరణ జరగకపోతే అట్టి వ్యర్దాలు మురుగు కాలువల్లో వేస్తుంటారని తద్వారా మురుగునీరు నిల్వలు పేరుకుపోతాయని అన్నారు. మున్సిపల్. కమిషనర్ సోమవారం నుండి అన్ని వార్డుల్లో ద్వి చక్ర వాహనంపై పర్యటించి అన్ని వార్డులను తనిఖీ చేయాలని తెలిపారు. ఎక్కడైనా వ్యర్దాలు పేరుకు పోతే తక్షణమే నోటీస్ జారీ చేసి ఫైన్ విధించాలని ఆదేశించారు.
రామప్ప కాలానికి వెళ్ళు మార్గంలో వ్యర్దాలు పేరుకుపోయానని ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిశుభ్రం చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. ప్రతి ఇంటి నుంచి తడి,పొడి వ్యర్ధాలు సేకరించాలని, నిరంతరాయంగా జరగకపోవడం వల్ల అపరిశుభ్రత ఏర్పడుతుందన్నారు. వ్యర్ధాలను ఆరుబయట వేస్తే జరిమానా విధించాలని అన్నారు.
దుకాణాల ముందర వ్యర్దాలు వేయొద్దని వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేయాలని ఆయన సూచించారు. సింగరేణి, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రంగా తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, సింగరేణి అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.