కోనప్ప దో నెంబర్ దందాలను అరికట్టండి

కోనప్ప దో నెంబర్ దందాలను అరికట్టండి
మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు
జ్ఞాన తెలంగాణ, సిర్పూర్ కాగజ్ నగర్:
ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దో నెంబర్ దందాలను అరికట్టాలని స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మంత్రి సీతక్కకు లేఖ రాశారు. తమరి పేరును వాడుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. “సిర్పూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత, అక్రమ దందాలకు మారుపేరుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికార పార్టీ అండదండలతో, మంత్రి సీతక్క పేరును వాడుకుంటూ నియోజకవర్గంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఆయనతో పాటు ఆయన మేనల్లుడు శ్రీనివాస్ గతంలో వీరిద్దరు చేసిన అక్రమాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో మీరు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రతిపక్ష హెూదాలో మీరు వీరి అక్రమాల గురించి స్వయంగా తెలుసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప అధికారపార్టీ పేరుతో నియోజకవర్గంలో చేయని దో నెంబర్ దందా లేదు. అంతేకాకుండా వ్యాపారులను, అధికారులను బెదిరించి అక్రమ వసూళ్లకు కూడా పాల్పడ్డారు. అతని అన్నదాన సత్రం నడువడానికి ఫండ్ పేరిట ఆక్రమ వసూళ్లకు పాల్పడ్డారు.
ఎన్నికలలో ఓటమి అనంతరం అతని నిత్యాన్నదాన సత్రాన్ని మూసివేశారు. ఇతని దో నెంబర్ దందాలు మళ్లీ యదాతథంగా కొనసాగడానికి అధికారపార్టీ అండదండలు అవసరమని భావించి మళ్లీ కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారనేది బహిరంగ రహస్యమే. ఇది మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఎపుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుండే తన దోనెంబర్ దందాలను కొనసాగించడం, నిత్యాన్నదాన సత్రానికి ఫండ్ వసూలు చేయడం ప్రారంభించారు. దీనికి అతని మేనల్లుడు, నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి రావి శ్రీనివాస్ అన్ని విధాలా సహకరిస్తూ మీ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇపుడు లోక్‌సభ ఎన్నికలు కూడా వారికి కలిసివచ్చాయి.
ఈ ఎన్నికల సందర్భాన్ని, తమరి పేరును వాడుకొని అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనికి ఉదాహరణ కూడా మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను, కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ఒక స్త్రీ వైద్య నిపుణురాలిని బెదిరింపులకు గురి చేసి లోక్‌సభ ఎన్నికల ఫండ్ కావాలని, మంత్రి సీతక్క అడగమని చెప్పారంటూ మీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ వైద్యురాలు నా వద్దకు వచ్చి తన ఆవేదన చెప్పుకోవడంతో ఇది మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇదొక్కటే కాదు.
ఇలాంటి సంఘటనలు మరెన్నో ఉన్నాయి. ఈ నేతల తీరుతో నియోజకవర్గంలోని ఏడు మండలాలలోని చిన్నా చితకా అధికారపార్టీ లీడర్లు కూడా ఇదే విధంగా ఆక్రమ వసూళ్లకు తెగించారు. కావున ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించి ఈ మామా అల్లుళ్ల అరాచకాలను అక్రమ వసూళ్లను అరికట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలి.”అని లేఖలో పేర్కొన్నారు.