మంచి కర్మలు చేయి-దుక్ఖం నుండి త్వరగా బయటపడగలవు.


🌹”పధమ మహానామ సుత్త”లో “నెయ్యి-గులకరాళ్ళు” అనే కథలో భగవాన్ గౌతమ బుద్ధుడు ప్రకృతి నియమం ప్రకారం పుట్టుట గిట్టుక సహజసిద్ధమని చెప్పెను. మనం చేసే పనులు వలన ఆ తర్వాత తప్పక ఆ చేసిన పనులు యొక్క ఫలితాలు ఉంటాయి అని వివరించారు.

ప్రకృతి నియమాలను అనుసరించి మనం జీవించాలి. సత్కర్మలు చేయాలి అనగా మంచి పనులనే చేయాలి. మంచి పనులు చేయడం మూలంగా మనం దుక్ఖానికి లోనుకాకుండా త్వరగానే బయట పడగలుగుతాం అని భగవాన్ బుద్ధుడు చెప్పెను.

🌺ఒకసారి ఒక యువకుడు తన తండ్రి మరణించడంతో దుక్ఖంతో బోరున ఏడుస్తూ బుద్ధుని వద్దకు వెళ్ళాడు.ఆ యువకుణ్ణి చూసిన బుద్ధుడు ఏం జరిగింది నాయనా‌,నీవు ఎందుకు అని అలా ఏడుస్తున్నావు? అని ప్రశ్నించారు.

🫧అప్పుడు ఆ యువకుడు భగవాన్! నిన్న నా ముసలి తండ్రి చనిపోయారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు.

నాయనా! మీ నాన్న చనిపోయారు దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు.ఏడ్వడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. పాపం నువ్వు ఏడిస్తే చనిపోయిన నీ తండ్రి తిరిగి రారు కదా! ఏడ్వకు అని బుద్ధుడు ఆ యువకునితో చెప్పెను.

🌸భగవాన్! నేను ఎంత ఏడ్చినా చనిపోయిన నా తండ్రి తిరిగి రాడని నాకు కూడా తెలుసు. నేను.ఎందుకు ఏడుస్తున్నానంటే చనిపోయిన నా తండ్రి స్వర్గానికి వెళ్ళారా లేదా అని నాకు దిగులుగా ఉంది. అందుకోసమే మీ వద్దకు వచ్చాను.నా తండ్రిని స్వర్గ లోకానికి పంపించే ఏదైనా మార్గం చెబుతారని ఆశతో పరుగు పరుగున మీ వద్దకు వచ్చానని ఆ యువకుడు అంటాడు.

🍃ఓహో! అలాగా అయితే ఇప్పుడు నేను నీ తండ్రిని స్వర్గానికి పంపించేందుకు ఏం చేయాలి? అని బుద్ధుడు ఆ యువకునితో అంటారు.

🌿ఏమిటి భగవాన్ మీరే అలా అంటే ఎలా? మీరు మహామునులు, సర్వశక్తి సంపన్నులు,దయగల వారు మీరు. మీరు ఏదైనా చేసి నా తండ్రికి స్వర్గం ప్రాప్తించే మార్గం చూపండి అని విలపిస్తూ ప్రాథేయపడతాడు.

🌼పురోహితులు తమ మంత్రాలతో కర్మకాండలు వంటివి చేసి చనిపోయిన వాళ్ళని స్వర్గలోకానికి పంపిస్తారు కదా అలా మీరు కూడా ఏదైనా తంతు జరిపించి నాకు మేలు చేయండి. మీకెంతో రుణపడి ఉంటానని ఆ యువకుడు బుద్ధుణ్ణి వేడుకొంటాడు.

🪷తండ్రి చనిపోవడంతో ఈ యువకుడు దుక్ఖంతో ఉన్నాడు.ఇలాంటి సమయంలో మాటలతో తనకు ఎంత చెప్పిన జ్ఞానం రాదని అర్థం చేసుకొని సరే నాయనా! నువ్వు బజారుకు వెళ్ళి నెయ్యి,రెండు మట్టి కుండలు తీసుకుని రా అని చెప్పగానే ఆ యువకుడు ఎంతో సంతోషంగా తన తండ్రిని స్వర్గానికి పంపించడానికి బుద్ధుడు ఏదో కర్మకాండ చేయనున్నారు అని పరుగు పరుగున బజారుకు వెళ్ళి రెండు మట్టికుండలు, నెయ్యి తీసుకుని వచ్చాడు.

🌷ఇప్పుడు బుద్ధుడు ఆ యువకునితో ఇలా చెప్పెను నాయనా ఆ రెండు మట్టికుండలలో ఒక కుండలో గులకరాళ్ళు పోయి, మరో కుండలో నెయ్యి పోయి ఆ తర్వాత వాటి మూతులు కట్టేసి చెరువులో పడవెయ్యి అని చెప్పెను.ఆ యువకుడు బుద్ధుడు చెప్పినట్లు చేసాడు.

🥀నాయనా! ఇప్పుడు ఒక కర్రతో ఆ రెండు కుండలను పగుల గొట్టు అని బుద్ధుడు చెప్పెను.ఆ యువకుడు ఆ రెండు కుండలను కర్రతో గట్టిగా కొట్టి పగుల గొట్టాడు.

🍃ఆహా భగవానుడు నా తండ్రిని స్వర్గానికి పంపించే ఏర్పాటులో భాగంగా భారతీయ సనాతన సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తిని స్వశానంలో చితిపై కాల్చేటప్పుడు ఒక కర్రతో కపాలం మీద కొట్టమంటారు.దీనిని కపాల మోక్షం అని అంటారు.ఆ విధంగానే బుద్ధుడు కపాలానికి బదులుగా కుండలను పగులగొట్టి తన తండ్రిని స్వర్గానికి వెళ్ళే మార్గం సుగమం చేస్తున్నాడన్న మాట అని అనుకుంటాడు.ఇది ఘటమోక్షం ఆహా అని ఆనందపడతాడు.

🍀అంతట బుద్ధుడు చూడు నాయనా! నేను చేయగలగింది చేసాను.ఇప్పుడు పురోహితులను పిలిచి కుండలో నుండి చెరువులోకి వెళ్ళిన గులకరాళ్ళను నీటిమీద తేలేటట్లు చేయమను.అలాగే మరొక కుండలోని నెయ్యి పైకి తేలకుండా నీటిలో అడుగు భాగానికి వెళ్ళేలా చేయమను.ఏం జరుగుతోంది అనేది అప్పుడు చూద్దాం అని చెప్పెను.

🔸అప్పుడు ఆ యువకుడు మళ్ళీ ఏడుపు లంకించుకొన్నాడు. భగవాన్ అదెలా సాధ్యం.ప్రకృతి నియమం ప్రకారం నీటికంటే రాళ్లు బరువు గనుక ఆ గులకరాళ్ళు నీటిలో మునిగిపోయాయి.నెయ్యి తేలిక గనుక నీటిమీద తేలుతుంది.ఇది ప్రకృతి సహజ సిద్ధమైన ధర్మం కదా అని యువకుడు పలికాడు.

🔹బుద్ధుడు ఆ యువకుని తెలివితేటలకు సంతోషించి నాయనా నీకు ప్రకృతి నియమాలను గురించి కూడా తెలుసును అన్నమాట.ప్రకృతి నియమాలను చాలా చక్కగా వివరించావు.నాయనా గులకరాళ్ళు నీటిలో మునగడం ఎంత సహజమో పుట్టిన వాడు పెరిగి పెద్దవాడై, ముసలివాడై చనిపోవడం కూడా అంతే సహజం. నీ తండ్రి బతికి ఉండగ మంచి పనులు గనుక చేసి ఉంటే ఖచ్చితంగా తేలికైన నెయ్యి లాగే స్వర్గలోకానికి తప్పకుండా వెళతాడు.అలా కాకుండా చెడు పనులు చేసి ఉంటే గులకరాళ్ళు వలె బరువుగా నరకానికి వెళతాడు.అలాంప్పుడు ఏ రకమైన తంతులు, కర్మకాండలు చేసిన ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ప్రకృతి నియమాలను అనుసరించి మంచి పనులు చేద్దాం. అప్పుడే మనలో దుక్ఖం అనేది కలుగదు అని బుద్ధుడు ఉపదేశించారు.

✍🏽అరియ నాగసేన బోధి
ఎం.ఎ.,ఎం.ఫిల్., టిపిటి., ఎల్.ఎల్.బి

🌾భవతు సబ్బ మంగలమ్🎋

You may also like...

Translate »