అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే.

జ్ఞాన తెలంగాణ,బోధన్ ప్రతినిధి:

అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే.

  • నాసిరకం విత్తనాలు విక్రయించే కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
  • నకిలీ విత్తనాల వ్యాపారులపై నిఘా ఉంచాలని అధికారులకు ఆదేశాలు.
  • ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.
  • బోధన్ మండలంలో నేలకొరిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ- బోధన్ విత్తన కంపెనీలు రైతులకు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన బోధన్ ఉమ్మడి మండలంలోని నాగన్ పల్లి, సాలూర క్యాంప్, కుమ్మన్ పల్లి తదితర గ్రామ శివారులో ఈదురు గాలులు వర్షంతో నేలకొరిగిన మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ మండలంలోని నాగన్ పల్లి, సాలూర క్యాంప్, కొప్పర్తి క్యాంప్, జాడీ జమాల్ పూర్ ప్రాంతాలలో సుమారు 500 ఎకరాలలో వరి, మొక్కజొన్న పంటలు ఈదురు గాలులు వర్షంతో నేలకొరిగిందని దాంతో రైతులు నష్టపోయారని అన్నారు.

పంట నష్టపోయిన రైతుల వివరాలు, నష్టపోయిన పంటలు వివరాలను అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి అందించాలని ఆదేశించారు. విత్తన కంపెనీలు నాసిరకమైన ,కల్తీ విత్తనాలు విక్రయించడంతో మొక్కజొన్న కంకులు సక్రమంగా ఎదగలేదని దాంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఆరుతడి పంటలు వేసిన రైతులకు శనివారం కురిసిన ఆకాల వర్షంతో నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు చేపడతామన్నారు. భవిష్యత్తులో నకిలీ విత్తనాలు రాకుండా వ్యాపారులపై వ్యవసాయ శాఖ అధికారులు నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలన్నారు . పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో పంటల నష్ట పోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం తీరుతో రైతులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.

సహకార బ్యాంకు వ్యవస్థను కెసిఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కనీసం నష్టపోయిన పంటలకు ఇన్సూరెన్స్ అందించలేదని అన్నారు .ప్రభుత్వం ద్వారా భవిష్యత్తులో రైతులు నష్టపోయిన పంటలకు ఇన్సూరెన్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో సిరికొండ ,ఇందల్వాయి, ధర్పల్లి, బీర్కూర్, కోటగిరి ,బోధన్ తదితర ప్రాంతాలలో నష్టపోయిన పంటల సర్వే చేయడానికి అధికారులను డిప్యూటేషన్ పై నియమించి పంట వివరాలు సేకరిస్తామని అన్నారు. వర్షాకాలం సీజన్ నుంచి పంటలకు ఇన్సూరెన్స్ అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఆయన వెంట ఇంచార్జి ఏడీ సంతోష్, ఏఈఓ అపర్ణ, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, గంగా శంకర్, నాగేశ్వరరావు ,మందరన్న రవి, అల్లె రమేష్, తూము శరత్ రెడ్డి, తూము రవి, నర్సారెడ్డి, సంతోష్ రెడ్డి,చీలా శంకర్ రైతులు ఉన్నారు.

You may also like...

Translate »