ఆప్ నేతలకు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది.

ఆప్ నేతలకు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది.
ప్రధాని మోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ , సంజయ్ సింగ్‌లకు ఊరట లభించలేదు. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ వారు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థనలపై జస్టిస్ హస్ముఖ్ సుతార్ స్పందిస్తూ.. ట్రయల్ కోర్టులోనే వారి వాదనలు వినిపించాలని సూచిస్తూ పిటిషన్లు కొట్టేశారు. తమ వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్శిటీ సెషన్స్ కోర్టును ఆశ్రయించకుండా.. మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయలేరని ఆప్ నేతలు వాదించారు.
పీఎం మోదీ డిగ్రీ విషయంలో ఆప్ నేతల వ్యాఖ్యలు వెకిలిగా, అవమానకరంగా ఉన్నాయంటూ గుజరాత్ యూనివర్శిటీ గతేడాది ఏప్రిల్‌లో మెట్రోపాలిటిన్ కోర్టును ఆశ్రయించింది. అదే నెలలో 15వ తేదీన న్యాయస్థానం ఇద్దరు నేతలకూ సమన్లు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్, సంజయ్‌సింగ్ పైకోర్టులో ఈ సమన్లను సమీక్షించాలని కోరారు. అక్కడ దిగువ న్యాయస్థానం చర్యలను సెషన్స్ కోర్టు సమర్థించింది. దీంతో ఇద్దరు నేతలు తాత్కాలిక స్టే కోసం హైకోర్టును ఆశ్రయించారు. కానీ, వారికి అక్కడ ఊరట లభించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లగా.. అక్కడ విచారణకు నిరాకరించారు. ఆ తర్వాత సెషన్స్ కోర్టు కొత్త బెంచ్‌కు ఈ విషయాన్ని అప్పజెప్పిన తర్వాత 10 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. గతేడాది ప్రధాని విద్యార్హత వివరాలపై సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు పక్కనపెట్టింది. ఆ తర్వాత కేజ్రీవాల్, సంజయ్‌సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో.. గుజరాత్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ కోర్టును ఆశ్రయించారు…