టీఎస్పీఎస్సీ పేపర్లు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

టీఎస్పీఎస్సీ చైర్మన్,సభ్యులను బర్తరఫ్ చేయాలి

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు టీఎస్పీఎస్సీ,ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలి

టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ చేసి,వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
ఆరోపించారు. పెద్దపల్లిలో శనివారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు.ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన ఘరానా దొంగ,మోసగాడు కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు.ఆసరా పెన్షన్లతో పెద్ద కొడుకునని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లను మాత్రం వేల కోట్లకు అమ్ముకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

జూన్‌ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ సూత్రదారులు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉన్నారన్న ఆయన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరైన వారికంటే కొత్తగా 270 ఓఎంఆర్ షీట్లను అదనంగా ఎలా వచ్చాయో టీఎస్పీఎస్సీ చైర్మన్ సమాధానం చెప్పాలన్నారు.టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని,సభ్యులను ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్‌-1 అభ్యర్థుల కోచింగ్ కోసం ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కూతురు కవిత ప్రత్యేక విమానంలో రూ.100 కోట్లు ఢిల్లీకి తరలించినట్లు ఈడీ కేసు నమోదు చేసినా ఎందుకు అరెస్టు చేసి,జైలుకు పంపలేదని ప్రశ్నించారు. అక్రమంగా దోచుకొన్న డబ్బుతోనే కవిత రూ.20 లక్షల  వాచ్ చేతికి ధరించిందన్నారు.గత 75 ఏళ్లుగా బహుజనులతో ఓట్లు వేయించుకున్న ఆధిపత్య పాలకులు ప్రజల సంపదను అక్రమంగా దోచుకొని సంపన్నులయ్యారన్నారు.ఎవరు ఓట్లేస్తే,ఈ ఆధిపత్య కులాలు గద్దెనెక్కి కూర్చొని పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు.అధిపత్య పాలకులు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ వర్గాలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని విమర్శించారు.

దళిత, బీసీ బంధు పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారం అడ్డంపెట్టుకొని నియోజకవర్గంలో వేలాది ఎకరాల అసైండ్ భూములను ఆక్రమిస్తూ,వేల కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులు బీఎస్పీలో చేరారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య,అసెంబ్లీ ఇంచార్జీ దాసరి ఉష, జిల్లా ఇంఛార్జి మొలుమురి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు,జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, అంబటి నరేష్ యాదవ్ పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షులు బోంకురి దుర్గయ్య,ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సతురి అనీల్, కోశాధికారి ఎండి రియాజ్,రామిళ్ళ శారద,కమల తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »