సీపీఐ వందేళ్ల ప్రయాణం – పోరాటాలు, విజయాలు, సవాళ్లు

– డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్


సీపీఐ భారతదేశంలోని పురాతన రాజకీయ పార్టీల్లో ఒకటి. ఇది 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో స్థాపించబడింది. సోవియట్ యూనియన్ లెనిన్ విప్లవం ప్రభావంతో పురుడుపోసుకుంది. ఎం.ఎన్.రాయ్ వంటి విప్లవకారులు దీనికి పునాది వేశారు. పార్టీ లక్ష్యం పేదలు, కార్మికులు, కర్షకుల సమస్యల పరిష్కారం. ఇది సమానత్వం, సోషలిజం కోసం పోరాడుతుంది. వందేళ్లలో సీపీఐ అనేక ఉద్యమాలు చేపట్టింది. ఇది బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా నిలిచింది. నేడు పార్టీ సభ్యత్వం 2022 డేటా ప్రకారం 6.5 లక్షలు.
ఇది లోక్‌సభలో 2 సీట్లు గెలుచుకుంది (2024 ఎన్నికలు).

స్వాతంత్ర్య పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించింది. 1925-28లో “వర్కర్స్ అండ్ పీజెంట్స్ పార్టీలను (డబ్లూ.పీ.పీ.ఎస్)” స్థాపించింది. 1934లో బ్రిటిష్ ప్రభుత్వం ఆ పార్టీని నిషేధించింది. అయినా పార్టీ కార్మికులు, కర్షకులను సమీకరించింది. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ను స్థాపించి భూసంస్కరణలు కోసం ఎడతెగని ఉద్యమాలు చేసింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ద్వారా విద్యార్థులను చైతన్యవంతులను చేసింది. మహిళల కోసం మహిళా సంఘాలు ఏర్పాటు చేసింది. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐపీటీఏ) ద్వారా కళాకారులను సమీకరించి ప్రజలకు చేరువైంది. పృథ్వీరాజ్ కపూర్, మృణాల్ సేన్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు. తెలుగు సినీ ప్రముఖులు అల్లు రామలింగయ్య, నాగభూషణం కూడా ప్రజానాట్య మండలిలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సంస్థలు ప్రగతిశీల భావజాలాన్ని వ్యాప్తి చేశాయి.

స్వాతంత్ర్యానికి ముందు సీపీఐ అనేక పోరాటాలు నడిపింది. బెంగాల్‌లో “తేభాగా” ఉద్యమం చేపట్టింది. ఇది భూస్వామ్య వ్యతిరేక పోరాటం. కర్షకులు పంటలో మూడింట రెండు వంతులు తమవేనని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం నడిపింది. ఇది 1946-51 మధ్య సాగింది. భూస్వాముల నుంచి భూములు స్వాధీనం చేసి పేదలకు పంచారు. కేరళలో పున్నప్ర-వాయలార్ ఉద్యమం నడిపింది. ఇది సంస్థానాధీశుడికి వ్యతిరేక సాయుధ పోరు. వార్లీ ఆదివాసీలు, త్రిపుర ట్రైబల్ ప్రజల పోరాటాల్లో ముందుండింది. 1946లో నావల్ మ్యూటినీకి మద్దతిచ్చింది. ఈ ఉద్యమాలు పేద కార్మికులు, రైతు కూలీల సమస్యలు పరిష్కరించాయి. మహిళలు, విద్యార్థులను సమీకరించి వారిలో చైతన్యాన్ని తెచ్చాయి.పోరుబాటను నేర్పాయి.శిక్షణా తరగతులు నిర్వహించి సామాజిక, ఆర్థిక రాజకీయ, సమకాలీన సమస్యలపై వారికి పూర్తి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు.

స్వాతంత్ర్యానంతరం సీపీఐ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించింది. సోవియట్ యూనియన్, బ్రిటన్ మిత్రులు కావడం వల్ల ఇలా చేసింది. ఇది పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసింది. నిజాం సంస్థానం భారత్‌లో కలిసినా తెలంగాణ పోరాటం కొనసాగించింది. ఇది పార్టీకి నష్టం కలిగించింది. 1975 ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీని సమర్థించింది. ఇది పార్టీ పరపతిని మసకబార్చింది. సోవియట్, చైనా కమ్యూనిస్టు విభేదాలు పార్టీలో చీలికలు తెచ్చాయి. 1962 ఇండో-చైనా యుద్ధంలో వైఖరి విషయంలో విభేదాలు వచ్చాయి. బ్యాలెట్ మార్గం vs బుల్లెట్ మార్గం వాదనలు జరిగాయి. 1964లో సీపీఐ(ఎం) ఏర్పడింది. 1969లో సీపీఐ(ఎమ్‌ఎల్) ఏర్పడింది. ఈ చీలికలు కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలహీనపరిచాయి. కుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం కూడా నష్టం చేసింది.

ఎన్నికలలో సీపీఐ పనితీరు మిశ్రమం గా ఉంది :

1951లో 16 సీట్లు, 3.29 శాతం ఓట్లు గెలిచింది. 1957లో 27 సీట్లు, 8.92 శాతం ఓట్లు. కేరళలో మొదటి నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యారు. భూసంస్కరణలు, విద్యా సంస్కరణలు చేపట్టింది. 1962లో 29 సీట్లు (పీక్), 9.94 శాతం ఓట్లు. చీలిక తర్వాత 1967లో 23 సీట్లు. 1971లో 23 సీట్లు. 2004లో 10 సీట్లు. 2009లో 4 సీట్లు. 2014లో 1 సీటు. 2019లో 2 సీట్లు. 2024లో 2 సీట్లు. స్టేట్ ఎలక్షన్లలో కేరళ, బెంగాల్, త్రిపురలో ప్రభావం చూపింది. కానీ సీపీఐ(ఎం)తో పోటీ వల్ల బలహీనమైంది. 1970-77లో కేరళలో కాంగ్రెస్ కూటమిలో భాగమైంది.

సీపీఐ పేదల కోసం అనేక ఉద్యమాలు చేపట్టింది. కార్మికుల సమస్యలకు స్ట్రైక్స్ నడిపింది. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ ) ద్వారా వారిని సమీకరించింది. కర్షకులు, రైతు కూలీలకు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు. మహిళల సమస్యలకు మహిళా సంఘాలు. విద్యార్థులకు AISF(ఏఐఎస్ఎఫ్) ద్వారా ఉద్యమాలు చేసింది. ఈ ఉద్యమాలు వివిధ రాష్ట్రాల్లో సాగాయి. బెంగాల్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, త్రిపురలో ప్రభావం చూపాయి. పార్టీ నిషేధాలు, నిర్బంధాలు, జైలు జీవితాలు ఎదుర్కొంది. కానీ ప్రజల మధ్యనే, ప్రజలలో విస్తరించి నిలిచింది.

నేడు సీపీఐ సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రజలు, పార్టీ మధ్య దూరం పెరిగింది. సోషల్ మీడియా, టెక్నాలజీలో వెనుకబడింది. యువత, మధ్యతరగతి, టెక్నోక్రాట్స్‌ను ఆకర్షించడం కష్టమవుతోంది. మూస నిరసనలకు పరిమితమవుతోంది. ఇటీవల శ్రీలంక, నేపాల్ ఉద్యమాలు సోషల్ మీడియా ద్వారా సఫలమయ్యాయి. మన దేశంలో రైతు చట్టాల వ్యతిరేక పోరాటం కూడా అంతే. సీపీఐ టెక్నాలజీని ఉపయోగించాలి. పోరాట స్వరూపాలు మార్చాలి. కాలం చెల్లిన ప్రసంగాలు వదిలేయాలి. ఆర్‌ఎస్‌ఎస్ నిర్మాణపరంగా బలంగా ఉంది. సీపీఐ దాన్ని అధ్యయనం చేయాలి. ఆత్మశోధన చేసుకోవాలి. అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకమైతే బలం పెరుగుతుంది. ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రశ్నించే శక్తులు కావాలి. సీపీఐ ఆ దిశగా ముందడుగు వేయాలి.

You may also like...

Translate »