ఉండాలని ఉందా? పోవాలని ఉందా? మహిళా అధికారిణికి బెదిరింపుల ఆరోపణలు

  • ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ మహిళా అధికారిణికి మాజీ ఎమ్మెల్యే సంపత్ ఫోన్ చేసినట్లు ఆరోపణలు
  • వివరాలు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు అందజేశామని మహిళా అధికారిణి స్పష్టం
  • ఉండాలని ఉందా? పోవాలని ఉందా? అంటూ బెదిరించినట్లు సమాచారం
  • ఒత్తిడి తట్టుకోలేక వనపర్తి జిల్లాకు బదిలీపై వెళ్లినట్లు ప్రచారం
  • ఘటనపై రాజకీయ వర్గాల్లో, ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చ

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :

గద్వాల జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా అధికారిణికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా చెప్పుకునే సంపత్ పేరు తెరపైకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారి తీసింది.

సమాచారం ప్రకారం, గద్వాల జిల్లాలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ ఓ మహిళా అధికారిణికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు సమర్పించామని ఆమె స్పష్టం చేసినప్పటికీ, ఆ సమాధానంతో సంపత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా “ఉండాలని ఉందా? పోవాలని ఉందా?” అంటూ బెదిరింపు స్వరంలో హెచ్చరించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ ఫోన్ సంభాషణ తరువాత మహిళా అధికారిణిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడినట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, మానసిక వేధింపులు భరించలేక ఆమె వనపర్తి జిల్లాకు బదిలీపై వెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామం మహిళా ఉద్యోగుల భద్రత, స్వేచ్ఛపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికార యంత్రాంగంలో పనిచేసే మహిళలు ఇలాంటి ఒత్తిళ్లకు గురవుతుంటే, పాలనపై ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందనే చర్చ మొదలైంది.

ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం. అయితే మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహిళా అధికారిణిపై జరిగిన బెదిరింపులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

రాజకీయ అధికారాన్ని ఉపయోగించి అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి స్పష్టత ఇవ్వాలని, మహిళా అధికారుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద, “ఉండాలని ఉందా? పోవాలని ఉందా?” అనే మాటలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతున్నాయి.

You may also like...

Translate »