మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

- తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల.
- జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ.
- 6వ తరగతిలో 100 సీట్లు, 7–10 తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ.
- అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, డిజిటల్ క్లాస్‌రూములు, ల్యాబ్ సదుపాయాలు.
- పూర్తి వివరాలకు tgms.telangana.gov.in వెబ్‌సైట్ సందర్శించాలి
తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనట్లు శంకర్పల్లి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందన్నారు.
6వ తరగతిలో మొత్తం 100 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అలాగే 7, 8, 9, 10వ తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను కూడా ఇదే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, పేద మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.
మోడల్ స్కూల్స్‌లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూములు, లైబ్రరీ, ల్యాబ్ సదుపాయాలు ఉండటంతో విద్యార్థులు మెరుగైన విద్యను పొందగలుగుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా బోధన అందించబడుతుందని చెప్పారు.
అభ్యర్థులు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, హాల్ టికెట్ తదితర వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ tgms.telangana.gov.in ను సందర్శించాలని సూచించారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని శోభారాణి విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
