ఆదిలాబాద్ సమగ్ర అభివృద్ధికి విస్తృత ప్రణాళిక ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాగా భావించబడుతున్న ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విస్తృత ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) స్థాపన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాగునీరు–సాగునీటి అవసరాల కోసం తుమ్మిడిహెట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం, జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక వాడ అభివృద్ధి వంటి కీలక నిర్ణయాలను సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా రూ.386.46 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసి, నిర్మల్‌లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి బాట” సభలో మాట్లాడుతూ ఆదిలాబాద్‌కు ఇప్పటివరకు రావాల్సిన అభివృద్ధి, నీరు రాలేదని పేర్కొన్నారు. పాలమూరుకు ఇచ్చిన ప్రాధాన్యతే ఆదిలాబాద్‌కు కూడా ఇస్తామని, చనాక–కొరాట బ్యారేజీని ప్రజాప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. చనాక–కొరాట బ్యారేజీకి మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి, సదర్మట్ బ్యారేజీకి స్వతంత్ర సమరయోధుడు పి. నర్సారెడ్డి పేర్లు పెడతామని ప్రకటించారు. బాసరలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, నిర్మల్‌లో ATC ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌లో 10 వేల ఎకరాలతో అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో జిల్లా సమీక్షలు నిర్వహించి బడ్జెట్‌లో అనుమతులు మంజూరు చేస్తామని, నాగోబా జాతరకు రూ.22 కోట్లు మంజూరు చేస్తామని, మేడారంలా గొప్ప అభివృద్ధి చేస్తామని తెలిపారు. “మేం పాలకులం కాదు, ప్రజల సేవకులం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.







