కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సాయికుమార్

జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధి
తేదీ:
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్.సి.ఎల్. టౌన్‌షిప్‌లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్ ప్రతిభకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇటీవల వరంగల్ నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లో ‘అందరి మీడియా’ ఆధ్వర్యంలో నిర్వహించిన “సంక్రాంతి సంబరాలు” కార్యక్రమంలో ఆయన జానపద నృత్య ప్రదర్శనలో పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.
ఈ కార్యక్రమంలో సాయికుమార్ ప్రదర్శించిన కళాత్మక నైపుణ్యం, సాంప్రదాయ నృత్య శైలికి ప్రేక్షకులు మరియు నిర్వాహకులు విశేషంగా ముచ్చటపడ్డారు. ఈ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఆయనను “కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్” లో నమోదు చేయడంతో పాటు బంగారు పతకం మరియు ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, సాయికుమార్ విద్యాబోధనతో పాటు సాంస్కృతిక కళారంగంలోనూ విశిష్ట ప్రతిభను ప్రదర్శించడం గర్వకారణమని పేర్కొంటూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అవార్డు సాధించిన అనంతరం సాయికుమార్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తన జీవిత ప్రయాణంలో చదువుకున్న పాఠశాలల ఉపాధ్యాయులు, స్నేహితులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. వారి సహకారంతోనే తన కలలను మరింత మెరుగుపరుచుకోగలిగానని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని శ్రీ చైతన్య పాఠశాల అధ్యాపక బృందం సాయికుమార్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హృదయపూర్వక అభినందనలు తెలిపింది.
