దేశం కోసం జీవించడమే నిజమైన సేవ : నరేష్ కుమార్ పిలుపు

- దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను మరువకూడదని హితవు
- ఆర్మీ డే సందర్భంగా శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమం
- సైనికులకు సన్మానం, పిల్లలకు మిఠాయిల పంపిణీ
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
దేశం కోసం ప్రాణాలను అర్పించిన భారత సైనికుల త్యాగాలను ప్రతి భారతీయుడు ప్రతిరోజూ స్మరించుకోవాలని, అలాగే సమాజం–దేశం కోసం సేవా భావంతో పనిచేయాలని శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. నరేష్ కుమార్ పిలుపునిచ్చారు.ఆర్మీ డే సందర్భంగా గురువారం శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సైనికులతో కలిసి కేక్ కట్ చేయించి, శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు.
నరేష్ కుమార్ మాట్లాడుతూ, “దేశానికి, సమాజానికి ఉపయోగపడని దేహం వ్యర్థమే. నేటి యువత పుట్టిన ఊరికి, తమను కన్న తల్లిదండ్రులకు, భారతదేశానికి గర్వకారణంగా నిలిచేలా ముందుకు సాగాలి” అని అన్నారు.ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి అనంతరం ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై చేపట్టిన దాడుల్లో మహిళా అధికారులు యామిక సింగ్, సానియా కురిశి విజయకేతనం ఎగురవేశారని గుర్తుచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు అభినందించాయని తెలిపారు.
గత పది సంవత్సరాలుగా ఆర్మీ డే వేడుకలను నిరంతరంగా నిర్వహించడం శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్‌కు గర్వకారణమని, ఈ కార్యక్రమం ద్వారా సైనికుల త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంతో సంతృప్తినిస్తోందని ఆయన అన్నారు. అనంతరం పిల్లలు, విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సైనికులు మాట్లాడుతూ, పండుగ రోజున చాలామంది తమ వ్యక్తిగత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారని, అయితే సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ సైనికులను ఒకచోట చేర్చి సన్మాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ఆయన ప్రయత్నం నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ వేనేంద్ర చారి, వైస్ ప్రెసిడెంట్ కార్తీక్, జాయింట్ సెక్రటరీ రవీందర్ యాదవ్, సభ్యులు కళావతి, నాగమణి, మురళీకృష్ణ, విజయ్, ఫణిందర్‌తో పాటు ఆర్మీ అధికారులు, సైనికులు, కాలనీవాసులు జంగయ్య, కావ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
