శంకర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యుడు కాలే యాదయ్య సమక్షంలో శంకర్పల్లి పట్టణానికి చెందిన శంకర్పల్లి కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక శంకర్పల్లి పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య గుండ చంద్రశేఖర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవను ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని, ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వ్యాపార వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
గుండ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాహిత విధానాల పట్ల ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. శంకర్పల్లి పట్టణ వ్యాపార వర్గాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం పార్టీతో కలిసి పనిచేస్తానని చెప్పారు. స్థానిక ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

