ఏల్వర్తి గేట్ వద్ద మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి వేల లీటర్ల తాగునీరు వృథా

- అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లపైకి పారుతున్న స్వచ్ఛమైన తాగునీరు
- నీటి కొరత వేళ మిషన్ భగీరథ నీటి వృథా – ప్రజల్లో ఆగ్రహం
- కోట్ల నిధుల పథకం పైపు లీకేజీలకే పరిమితం?
- తక్షణ మరమ్మతులు చేయాలని గ్రామస్తుల డిమాండ్
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
శంకర్‌పల్లి మండలంలోని ఏల్వర్తి గేట్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పగిలి వేల లీటర్ల స్వచ్ఛమైన నీరు నిర్దాక్షిణ్యంగా వృథా అవుతోంది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో, ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపు నుంచి నీరు రోడ్లపై పారుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ఇలా నిర్లక్ష్యానికి బలవడం దురదృష్టకరం. పైపు లైన్ పగిలిన విషయం తెలిసినా మరమ్మతులు చేయకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని స్థానికులు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పగిలిన పైపు లైన్‌ను తక్షణమే మరమ్మతు చేయాలని, నీటి వృథాను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యం జరిగితే ప్రజలు ఆందోళనకు దిగక తప్పదని హెచ్చరిస్తున్నారు.
