గాంధీ పేరు తొలగింపుపై భీమ్ భరత్ నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన

  • భీమ్ భరత్ పిలుపుతో అజీజ్ నగర్‌లో ఆందోళన
  • ఏఐసీసీ ఆదేశాలతో నిరసన కార్యక్రమం
  • ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కొనసాగించాలని డిమాండ్
  • టీపీసీసీ, ఏఐసీసీ నేతల హాజరు
  • కాంగ్రెస్ శ్రేణులను సమీకరించిన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :
జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా :
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఏఐసీసీ పిలుపుమేరకు రేపు (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
దేశంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కోట్లాది పేదలకు జీవనాధారంగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇది కేవలం ఒక పేరును తొలగించడమే కాకుండా, గాంధీజీ ఆలోచనలపై దాడి చేయడమేనని విమర్శించింది.
ఈ చర్యను వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. “వికసిత్ భారత్ వద్దు – మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ముద్దు” అనే నినాదంతో ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గ్రామీణ పేదల జీవన భద్రతకు ఈ పథకం కీలకమని పేర్కొంది.
ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు పి. మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి పాల్గొననున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులు, మాజీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.

You may also like...

Translate »