కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా

- బీఆర్ఎస్ ఎంపీలతో కీలక భేటీ
- బీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సమావేశం
- కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని ప్రత్యేకంగా అడిగిన ప్రధాని
- సిరిసిల్ల–కోరుట్ల జాతీయ రహదారి విస్తరణపై వినతిపత్రం
- వేములవాడ ఆధ్యాత్మిక పర్యాటకానికి రహదారి కీలకం
- రోడ్-కమ్-రైల్ బ్రిడ్జి, రైల్వే ప్రాజెక్టులపై విజ్ఞప్తి
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. శుక్రవారం భారత పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులతో జరిగిన భేటీ సందర్భంగా మోదీ ఈ అంశాన్ని స్వయంగా ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఈ మాట నేను ప్రత్యేకంగా చెప్పానని ఆయనకు తెలియజేయండి” అని ఎంపీలను కోరారు. రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ మానవీయతతో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ భేటీలో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాల అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సిరిసిల్ల వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 365బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ రహదారి విస్తరణతో వేములవాడ క్షేత్రానికి ఆధ్యాత్మిక పర్యాటకం మరింత పెరుగుతుందని, ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని వారు వివరించారు.
ఈ అంశాన్ని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, గతంలో ఒక కేంద్ర మంత్రి కూడా సానుకూల హామీ ఇచ్చిన విషయాన్ని ఎంపీలు గుర్తుచేశారు. రహదారి విస్తరణ వల్ల పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటకం పెరిగి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు.
అదేవిధంగా, మిడ్ మానేరు ప్రాజెక్టుపై ధవళేశ్వరం తరహాలో రోడ్-కమ్-రైల్ బ్రిడ్జి నిర్మించాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇది వరద నియంత్రణతో పాటు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుందని వివరించారు. అలాగే మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంలో కేంద్రం సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఉత్తర తెలంగాణకు రైల్వే అనుసంధానం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.
ఎంపీలు వినిపించిన అన్ని అంశాలను శ్రద్ధగా విన్న ప్రధాని మోదీ, ఆయా ప్రతిపాదనలను సంబంధిత శాఖలతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవడం రాజకీయ మర్యాదలు, మానవీయ విలువలకు ప్రతీకగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
